డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 3 సంచిక 2
March 2012
ప్రియమైన ప్రాక్టీషనర్లకు ప్రేమ పూర్వక సాయిరాం !
మీ అందరూ ఈ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందకరంగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రశాంతి నిలయంలో భజనలు మనోహరంగా ఉండటమే కాకుండా వైబ్రియోనిక్స్ కు సంబంధించినంతవరకూ మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం కూడా ఏర్పడింది. మహాశివరాత్రి పవిత్రోత్సవం అయిన 2012 ఫిబ్రవరి 20న సాయి సంస్థల అఖిలభారత అధ్యక్షుడు శ్రీనివాసన్ గారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అధ్యక్షులు మరియు వారి వైద్య సమన్వయకర్తల కోసం వైబ్రియోనిక్స్ వర్క్ షాప్ నిర్వహించారన్న వార్త మీ అందరికీ ఎంతో ఆనందదాయకం ఔతుందన్న విషయం నాకు తెలుసు. సంస్థలోని పదాదికారులలో వైబ్రియోనిక్స్ గురించి అవగాహన కల్పించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశ్యము. మనకు ప్రత్యేక సూచనలు ఇవ్వడానికి స్వామి మనమధ్య తన భౌతిక రూపంలో లేనందున వైబ్రియానిక్స్ అధికారిక స్థానం ఈ సమావేశం స్పష్టం చేసిందని చెప్పవచ్చు.
భగవాన్ బాబా వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ వేదం పఠనం జరుగుతూ ఉండగా అఖిలభారత అధ్యక్షుడు దీపం వెలిగించడం ద్వారా ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించాము. వారు తన ప్రారంభ ప్రసంగంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ పతాకంపై భారతదేశంలో వైబ్రియానిక్స్ సదస్సులు జరగకపోయినా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే శిబిరాలను సాయి సంస్థ సులభతరం చేస్తుందని హామీ ఇచ్చారు.
సంక్షిప్తంగా ఈ వైద్య విధానం గురించి పరిచయం చేస్తూ రెమిడీ లను తయారు చేయడానికిసాయిరాం పోటెంటైజర్ ఎలా ఉపయోగింప బడుతుందో ఒక ప్రదర్శన ఇచ్చాను. స్వామి సంకల్పంతో ప్రవేశపెట్టబడి 1994లో ఆశ్రమంలో దీన్ని సాధన చేయడం మొదలు పెట్టినప్పటి నుండీ అనేక సందర్భాలలో స్వామి ఈ వైద్య విధానాన్ని ఎలా ఆశీర్వదిస్తూ వచ్చారో ప్రేక్షకులకు తెలియజెప్పడం అవసరమని భావించి అట్టి వివరాలు అందించడం జరిగింది. అనగా స్వామి మొదటి సారి సాయిరాం హీలింగ్ మిషనును ఎలా ఆశీర్వదించారు, విదేశాల్లో మరియు భారతదేశంలో సెమినార్లు నిర్వహించడానికి వారు మనల్ని ఎలా ఆశీర్వదించారు, వైద్యపట్టభద్రులు కానివారు కూడా ఈ చికిత్సా పద్దతిని ఎలా అభ్యసించగలరు, (స్వామి మాత్రమే నిజమైన వైద్యుడు మనమంతా వారి దివ్య హస్తంలో పనిముట్లు) స్వామి అనేక రకాల వైబ్రో పుస్తకాలను, 108 కోంబో బాక్సును, వార్తాలేఖను ఎలా ఆశీర్వదించారో మరియు వరుసగా మూడు సంవత్సరాలు గురు పూర్ణిమకు వైబ్రియానిక్స్ కు చెందిన కేకును కట్ చేయడం ద్వారా మనలనందరినీ ఎలా ఆశీర్వదించారో వివరించడం జరిగింది. వాస్తవానికి స్వామి ఆశీర్వాదాలను మరియు సూచనలు జాబితాగా చేసినప్పుడు గత 18 సంవత్సరాలు స్వామి మనకు ఎంత ఇచ్చారో తెలుసుకొంటే ఆశ్చర్యం కలుగక మానదు. నిజం చెప్పాలంటే ఇంత చక్కని మార్గదర్శకత్వం మరియు ఆదరణ అందించే ప్రేమమూర్తి మనకు లభించడం మనందరి భాగ్యవిశేషం.
మహారాష్ట్ర, ఢిల్లీ-NCR, కేరళ, కర్ణాటక, మరియు జమ్మూకాశ్మీరుకు చెందిన వైబ్రియానిక్స్ కోఆర్డినేటర్లు మరియు బోధన అధ్యాపక సభ్యులు చిన్నచిన్న ఉపన్యాసాలు ఇచ్చారు. వారు స్పృశించిన అంశాలు వైబ్రియానిక్స్ సేవలను ఎంత సులభంగా నిర్వహించవచ్చు, సమర్థవంతమైన వైద్యం కోసం అభ్యాసకుని విశ్వాసం యొక్క ఆవశ్యకత, గ్రామాలు మరియు మురికివాడలలో నిర్వహించ బడుతున్న క్యాంపులద్వారా రోగుల చికిత్సలో ఒనగూడే ఆశ్చర్య కరమైన ఫలితాలు, వాటికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు, మరియు చికిత్సపొందుతున్న రోగుల సంఖ్య మరియు అంకితభావం గల అభ్యాసకులు చేసిన సేవా గంటల సంఖ్య వంటివి వివరించారు.
పోలెండ్ కు చెందిన ఒక కోఆర్డినేటర్ వైబ్రియానిక్స్ సాధన ద్వారా మన ప్రభువైన స్వామికి ఎలా సన్నిహితం కాగలమో, 1999లో వైబ్రియానిక్స్ పోలండుకు ఎలా వచ్చిందో మరియు క్రమం తప్పకుండా సదస్సులు, పునశ్చరణ తరగతులు ఎలా నిర్వహింపబడుతున్నాయో వివరించారు. UK నుండి వచ్చిన మా చురుకైన అభ్యాసకులలో ఒకరు ఈ అద్భుత వైద్య విధానం గురించి నమ్మశక్యం కాని కొన్ని కేసులను సమర్పించారు. రోగ స్వస్థతలో పనిచేసేది రెమిడీ మాత్రమే కాదు రోగితో ప్రేమగా మాట్లాడటం, రోగి చెప్పేది మనం ఓపికతో వినడం ద్వారా తన బాధలు తీరడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది కూడా చికిత్సలో ఒక భాగమే అనే చాలా ముఖ్యమైన విషయాన్ని ఆమె తెలియజేసారు. UK నుంచి వచ్చిన మన పరిశోధనా బృందపు అధినేత వైబ్రో వ్యవస్థపై ఆమెకున్న నమ్మకం గురించి మరియు మనందరికీ స్వామి ప్రేమ ఎలా శక్తినిస్తుంది అనేదానిని గురించి మాట్లాడారు.
USA నుండి అభ్యాసకురాలు మరియు మన వార్తాలేఖ సంపాదకురాలు స్వామి ఆశీర్వాదము చేత దీనికి అంకురార్పణ ఎలా ఏర్పడిందో వివరించారు. సేవ చేయాలనుకునే ఉత్సుకత కలిగిన ఎవరైనా ప్రముఖ భారతీయ భాషలలోనికి వార్తాలేఖను అనువదించడానికి ముందుకు రావలసిందిగా ఆమె ఆహ్వానించారు. గత సంవత్సరం స్వామి పుట్టినరోజున ప్రారంభించిన మన కొత్త వెబ్సైట్ www.vibrionics.org గురించి ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం ఒక చిన్న ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఆ తర్వాత స్వామి అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ ను ఆశీర్వదించిన సంఘటనలతో కూడిన వీడియో ప్రదర్శనతో ఈ వర్క్ షాప్ ముగిసింది.
వాస్తవానికి ఇది చాలా విజయవంతమైన రోజు. ఇది అభ్యాసకులుగా మనకు ఎంత ఫలవంత మైనదో ప్రేక్షకులకు కూడా అంతే ఉత్పత్తులను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. సాయి సేవ ప్రపంచ వ్యాప్తంగా వైబ్రియానిక్స్ ద్వారా వ్యాప్తి చేయడానికి ఇది చక్కని ముందడుగు కావాలని ఆశిస్తున్నాము.
సమస్త లోక సుఖినోభవంతు
ప్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్