డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 9 సంచిక 5
September/October 2018
ప్రియమైన వైబ్రో అభ్యాసకులారా,
అత్యంత ఆనంద దాయకమైన గణేశ్ చతుర్ధీ సందర్భంగా మీతో ఇలా నా భావాలు పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన యూదు సోదరులు రోష్ హషణా గారికి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. సర్వమత సామరస్యం చూపిస్తూ వైషమ్యాలను రూపుమాపి దైవిక ప్రేమను ప్రసారం చేస్తూ అన్నీ మతాల పండుగలను సమైక్య భావనతో జరుపుకొనే యూనివర్సల్ మిషనరీ ఆఫ్ లవ్ లో భాగమై ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇది వాస్తవంగా విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది.
అనూహ్యంగా వచ్చిన వరదల కారణంగా అనేక అవస్థలకు గురైనప్పటికీ ఎంతో బాధ ననుభవిస్తూ ఉన్న కేరళ సోదర సోదరీ మణులకు మా హృదయ పూర్వక ప్రార్ధనలను చేరాలని ఆశిస్తూ ఉన్నాము. అలాగే అమెరికాలోని దక్షణ కెరొలినా మరియు ఉత్తర కెరొలినా ప్రాంతాలను అతలాకుతలం చేయనున్న మరొక హరికేన్ సమాచారాన్ని మేము గమనిస్తూనే ఉన్నాము. గత వార్తాలేఖ లో చెప్పినట్లు భూమాత అనుభవిస్తున్న ఇట్టి క్లేశాల నివారణకు అమెరికాలో బ్రాడ్కాస్టింగ్ ద్వారా హీలింగ్ వైబ్రేషణ్ పంపించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాము. ఈ ప్రక్రియ భారతదేశంలో కూడా ప్రాక్టీషనర్ 11573…ఇండియా చొరవతో కొందరు సీనియర్ ప్రాక్టీషనర్ల ప్రోద్బలంతో ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతీ ఒక్కరి నుండి హృదయ పూర్వక ప్రార్ధన ద్వారా వచ్చిన శక్తి అల్పమైనప్పటికీ అనంత ఫలితాన్ని ఇస్తుంది.
ప్రశాంతి నిలయంలో పురుష సేవాదళం వారి భవనంలో ప్రతీ నెలలో పదిహేను రోజులపాటు, స్త్రీ సేవాదళం భవనంలో అప్పుడప్పుడు వైబ్రో క్లినిక్కులు నడుపుతూ ఉన్నాము. మరో విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గురుపూర్ణిమ ఆనంతరం ఇద్దరు ప్రాక్టీషనర్లు టీచర్ 11422…ఇండియా ఆధ్వర్యంలో వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండా ఈ సేవ నిర్వహిస్తూ ఉన్నారు. సేవాదళ్ భవనాలలో మన వైబ్రో సేవలకు చాలా డిమాండ్ ఉంది కనుక మిగతా రోజులలో కూడా ఈ సేవను అందించడానికి నిబద్ధత కలిగిన ప్రాక్టీషనర్ల కోసం చూస్తున్నాము. ఎవరైనా ప్రాక్టీషనర్ ప్రశాంతినిలయంలో వారం రోజులు గడపడానికి వస్తున్నట్లయితే ఈ సేవలో పాల్గొనడం కోసం [email protected] కు రాసి మీ పేరు నమోదు చేసుకోన్నట్లయితే మీకు సేవ చేయడానికి అవకాశం కల్పిస్తాము.
మన ప్రాక్టీషనర్ వెబ్సైట్ ను తమ అంకిత భావము మరియు దీక్షతో తీర్చిదిద్దిన ప్రాక్టీషనర్ 03560…యుఎస్ఎ మరియు వారి బృందాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వెబ్సైట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఏదైనా కొత్తది విడుదల చేసిన సందర్భంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయని మేము గుర్తించాము. ఐతే ఇటువంటివి ప్రతీ రోజు సాధ్యమైనంత వరకూ పరిష్కరిస్తూనే ఉంటాము. ఈ చిన్న చిన్న సమస్యలు ఈ కొత్త వెబ్సైట్ ను ఉపయోగించకుండా మిమ్మల్ని నిరోధిస్తాయని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ ఫోటో మార్చడానికి, మీ వ్యక్తిగత వివరాలు మార్చుకోవడానికి, నెలవారీ రిపోర్టులు పంపడానికి IASVP సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడానికి (ఇది VP లందరికీ ఇప్పుడు తప్పనిసరి) ఇలా ఎన్నో సేవలు పొందడానికి అనుకూలంగా ఉన్నది. ఒకవేళ ఇప్పటికీ మీ నెలవారీ రిపోర్టులు నమోదు చేయడంలో వెబ్సైట్ లాగిన్ చేయడంలో ఏమైయినా సమస్యలు ఎదురవుతూ ఉంటే వెంటనే సహాయం కోసం [email protected] కు రాయండి.
ఈ సందర్భంగా గణేష్ చతుర్థిని పురస్కరించుకుని నిస్వార్ధ సేవ యొక్క ప్రాముఖ్యత గురించి స్వామి చెప్పిన ఒక చిన్న కథను చెప్పి ముగిస్తాను. – “ ఢిల్లీ కి చెందిన ఒక యువకుడు ప్రతీరోజు స్వామి బోధలు వింటూ ఉండేవాడు. ఒకరోజు తను కాలేజీకి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఒక పరీక్షకు హాజరు కావాలని వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక భిక్షగాడు అనారోగ్యంతో నడవలేని నిస్సహాయ స్థితిలో రోడ్డు పైన పడి ఉండడం గమనించాడు. ఈ యువకుడు అతడికి నిలబడడానికి సహాయం చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసాడు. అప్పటికి సమయం 10 గంటలు అయ్యింది. పరీక్షకు చాలా ఆలశ్యమయ్యింది. ఇక ఆ యువకుడు ఇది తన ప్రవర్తనకు స్వామి పెట్టిన పరీక్షగా భావించాడు. పరీక్ష వ్రాయలేనందుకు ఏమాత్రం విచారించ లేదు. పైగా ఒక నిస్సహాయునికి సేవ చేయగలిగినందుకు ఆనందించాడు కూడా. అతడు నాదగ్గరికి (స్వామి వద్దకు) వచ్చి ‘’స్వామీ ఒక పరీక్ష పోయింది. ఈ సంవత్సరం నేను ఉత్తీర్ణుడను కాలేను. కానీ నాకు విచారము లేదు కావాలంటే మరుసటి సంవత్సరం పరీక్ష వ్రాస్తాను. కానీ మీ పరీక్షలో ఉత్తీర్ణుడనైనందుకు ఆనందంగా ఉంది” అన్నాడు. అప్పడు నేను చెప్పాను ‘’నాయనా నీవు నా పరీక్ష లోనే కాదు నీ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడవైనావు ‘’ అన్నాను. ఆ మరుసటి నెలలో ఫలితాలు వెలువడినప్పుడు ఈ యువకుడు ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణుడయ్యాడు.
ఈ యువకుడు తన పరీక్ష గురించి విచారించ లేదు ఎందుకంటే ఒక నిస్సహాయునికి సహాయం చేయడం ద్వారా దేవుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఇటువంటి ధృక్పధం ఉన్న విద్యార్ధులు ఎందరో ఉన్నారు. ఇట్టి ఉత్తమ శీల సంపత్తి ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోవడం జరగదు. నీవు ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యి. ఈ విధంగా చేస్తే నీవు దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.”– , వినాయక చవితి దివ్యవాణి, 1-09-2000, ప్రశాంతినిలయం
ప్రేమతో స్వామి సేవలో