చికిత్సా నిపుణుల వివరాలు 11568...India
ప్రాక్టీషనర్ 11568…ఇండియా 2014 లో డాక్టర్ అగ్గర్వాల్ గారి సోల్ జర్న్స్ వీడియో చూడడం ద్వారా ఈమె స్పూర్తి పొంది వెంటనే స్వామికి తమ దివ్య ఆశీస్సులు ప్రసాదించమని ఉత్తరం వ్రాసారు. స్వామి విభూతిని ప్రసాదించడం ద్వారా తమ ఆశీస్సులు అందించగానే వెంటనే AVP కోర్సుకు తమ పేరు నమోదు చేయించు కున్నారు. 2015 మార్చి నెలలో పుట్టపర్తిలో AVP శిక్షణ ముగించుకున్న ఈ ప్రాక్టీషనర్ ప్రస్తుతం SVP గా తమ సేవలందిస్తున్నారు.
2015 లో ఒక ఆలయంలో మరొక ప్రాక్టీషనర్ తో పాటు వైబ్రియోనిక్స్ క్యాంపు ప్రారంభించినపుడు అక్కడ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, షిర్డీసాయి బాబా వారి నిలువెత్తు పటములు వీరి టేబుల్ దగ్గరే ఉండడం చూసి ఎంతో ఆనందించారు. అంతకుముందు వీరు చాల సార్లు ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది కానీ ఎప్పుడూ ఆ ఫోటోలు కనిపించలేదు. ఈ ఫోటోలు గురించి వివరాలు సేకరించగా ఎవరో ఒక అపరిచిత వ్యక్తి ఆరోజు ఉదయమే ఆ ఫోటోలను అక్కడ వదిలి వెళ్లారని తెలిసింది. ఈ సంఘటన స్వామి ఆశీస్సులు ఈ క్యాంపు పైన దండిగా, మెండుగా ఉన్నాయని స్వామి ఎల్లప్పుడూ నిస్వార్ధ సేవ చేసేవారి వెంటే ఉంటారని స్పష్టం చేసింది. ముఖ్యంగా తనకంటే ముందే స్వామి క్యాంపు జరిగే ప్రదేశానికి చేరుకొని తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నిరూపించడం ప్రాక్టీషనర్ కు మరింత ఆనందాన్నిచ్చింది. 15 రోజుల కొకసారి జరిగే ఈ క్యాంపులలో వీరికి అనుభవశాలురైన మరో ఇద్దరు ప్రాక్టీషనర్ల తోడ్పాటు కూడా ఉంటుంది. వీరి ఉద్దేశ్యంలో ఇలా ఎక్కువమంది ప్రాక్టీషనర్లతో కలసి (బృంద కృత్యము) టీంవర్కు చేయడం ద్వారా ఎంతో ఆనందంతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, అంతర్ద్రుష్టి ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని వీరి అభిప్రాయం.
వీరు వార్తాలేఖలను ఎప్పటికప్పుడు చదువుతూ కొత్త విషయాలను అవగాహన చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ‘అగ్గర్వాల్ గారి డెస్క్ నుండి’’ అనే టాపిక్ వీరికి ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. అలాగే ‘‘వైబ్రో రెమిడి లు ఉపయోగించిన కేసుల వివరాలు’’, ‘‘ప్రశ్న-జవాబులు” ఇవన్నీ కూడా ప్రతీ ఒక్క ప్రాక్టీషనర్ చదివి ప్రయోజనం పొందవలసిన విషయాలని వీరి నమ్మకం. ఇంతేగాక న్యూస్ లెటర్ లను వార్తలేఖలుగా తెలుగు లోనికి అనువదించడం స్వామి తనకిచ్చిన వరం అని వీరు భావిస్తున్నారు. దీనివలన వాటిని బాగా చదివి అర్ధం చేసుకోవడానికి, ఈ దివ్య విధానము గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం కలిగిందని వీరు భావిస్తున్నారు. ఇదేకాక వీరు మెంటర్ గా ( కొత్తగా శిక్షణ తీసుకున్న AVP లకు రోగులకు చికిత్స చేసే విషయంలో వారు VP లు గా ఉత్తీర్ణత పొందే వరకూ సలహాదారుగా బాధ్యత వహించడం) బాధ్యత కూడా చేపట్టడం ద్వారా ఈ విధానము పైన వీరికి ఎంతో అవగాహన కలిగింది. ఈ పద్దతి ద్వారా మెంటీ (గ్రాహకుడు) మరియు మెంటర్ ఇద్దరూ తమ జ్ఞానాన్ని, అవగాహనను పెంపొందించుకోవచ్చు అని వీరి భావన.
వైబ్రో చికిత్సా విధానంలో వీరికున్న అచంచల విశ్వాసం వల్ల తాను చికిత్స చేసిన కేసులలో అద్భుత విజయాలు సాధించారు. ఇప్పటివరకూ వీరు శ్వాశకోశ సంబంధిత వ్యాధులు, సైనుసైటిస్, స్త్రీల ఋతు సంబంధిత సమస్యలు, పార్శ్వపు నొప్పి, సాధారణ తలనొప్పి, అసిడిటీ, పక్కతడుపుట, మోకాళ్ళ నొప్పులు, ఎండకు సంబంధించిన అలెర్జీలు వంటి వ్యాధులకు సంబంధించి 350 మంది పేషంట్లకు విజయవంతంగా చికిత్స చేసారు. అంతేకాక తలనొప్పి, వైరల్ ఫీవర్లు, జీర్ణకోశ వ్యాధులు, వడదెబ్బ, ఆందోళన, ఫోబియా వంటి మానసిక సమస్యలకు చికిత్స చేయడంలో వీరికి అపార అనుభవం ఉంది.
వీరు అన్ని వ్యాధులకు సంబంధించిన రెమిడిలన్నింటికీ CC15.1 Mental & Emotional tonic కలపడం వలన వ్యాధి త్వరగా నయమవుతున్నట్లు తెలుసుకున్నారు. వీరికి SRHVP తో కూడా అద్భుత మైన అనుభవాలు ఉన్నాయి. అటువంటి ఒక ఉదంతం మనతో పంచుకుంటున్నారు. 32 సంవత్సరాల మహిళ, గొంతు లో గుచ్చుతున్నట్లు బాధ, దగ్గు, జ్వరం తో బాధ పడుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. పేషంటు తెల్లవారిన తర్వాత పనికి ఎట్లా వెళ్ళాలా అని ఆందోళన లో ఉన్నట్లు అనిపించింది. అంతేకాక ఆమెకు రోగం నయమవ్వడానికి అలోపతి మందులు వాడకుండా ఎలా తప్పించుకోవాలా అన్న ఆదుర్దా కూడా ఉన్నట్లు అనిపించింది. SRHVP, మిషన్ ఉపయోగించి వీరు NM6 Calming + NM18 General Fever + NM30 Throat + NM36 War ను తయారుచేసి ఇచ్చి తరుచుగా వాడమని చెప్పారు. ఆశ్చర్యకరమైన రీతిలో మరునాటికల్లా గొంతు నొప్పి, మరియు గొంతులో గుచ్చుతున్నట్లుగా అనిపించడం పూర్తిగా అదృశ్యమయ్యాయి. అంతేకాక జ్వరంగా అనిపించే లక్షణం కూడా మాయమయ్యింది.
మరో సందర్భంలో 36 సంవత్సరాల మహిళ గత కొన్ని సంవత్సరాలుగా రెండు కాళ్ళలో తిమ్మిరులతో బాధ పడుతూ ఉన్నారు. దీనివలన ఆమె బాసింపట్టు వేసుకొని ఎక్కువ సేపు కూర్చోలేక పోతున్నారు. ప్రాక్టీషనర్ ఆమెకు NM14 Cramps ఇచ్చారు. మొదట ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున ఒక గంట సేపు తీసుకున్న తర్వాత ఆమె రెండు గంటలు నిర్విరామంగా కుర్చోగలిగారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రోజంతా ఆమెకు తిమ్మిరులే లేవు!
వీరి అభిప్రాయం ప్రకారం వైబ్రియోనిక్స్ మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి లోనున్న అంతర్యామికి చేరువగా చేరుస్తుంది. ఈ విధంగా వైబ్రో విధానం వలన ప్రాక్టీషనర్ లు ఎంతో లబ్ది పొందుతారని వీరి భావన. వ్యక్తిగతంగా హృదయాన్ని పరిశుద్ధమైన రీతిలో తీర్చిదిద్ది దానిలో దయ, ప్రేమ వంటి భావాలతో నింపడం తన బాధ్యత అనీ దానివలన దివ్యశక్తి ప్రవాహానికి ఒక చక్కని వాహకంగా ఉండగలుగుతానని వీరి అభిప్రాయము. అంతేకాక తను ఉపయోగించే రెమిడిలు పరిశుద్ధంగా ఉండడానికి తన దేహం నుండి వచ్చే వైబ్రేషణ్ కూడా పవిత్రంగా ఉంచడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. తను ఆశించిన రీతిలో పవిత్రముగా చికిత్స సాగడానికై వీరు స్వామిని ఇలా ప్రార్ధిస్తూ ఉంటారు. ‘‘ ప్రియమైన స్వామీ, తమ దివ్య ప్రేమ ప్రవాహానికి నన్ను పవిత్ర వాహకంగా చేసి ఈ రోజు నా చెంతకు వచ్చిన వారికి నయం చేసే శక్తిని ప్రసరింప జేసి వారిని స్వస్థత పొందేలా చేయండి.’’
ప్రాక్టీషనర్ వృక్ష శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పొందిన వారు గనుక భవిష్యత్తులో వైబ్రియానిక్స్ కి సంభందించి వ్యవసాయ రంగంలో పురోగమనం కోసం ఎంతో కొంత చేయూతనందించాలని తహతహలాడుతున్నారు. చివరిగా సాయి వైబ్రియానిక్స్ స్వామి మానవాళికి అందించిన గొప్ప వరం అని దీని వలన పేషంటుకు నయమవ్వడమే కాక ప్రాక్టీషనర్ లో కూడా పరివర్తన వస్తుందని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకున్నానని మనకు తెలియజేస్తున్నారు.