Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వేదిక 11650...India


ప్రాక్టీషనర్ 11650...ఇండియా  ఈ ప్రాక్టీషనర్ 1976లో వైట్‌ఫీల్డ్‌లోని స్వామి కళాశాల నుండి బి.కామ్. పట్టా పొందారు. అనంతరం వినియోగ వస్తువులు, ఔషధాలు, నిర్ధారణ పరికరాలు (డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్), మరియు కాన్సెప్ట్ సెల్లింగ్ వంటి విభిన్న రంగాలలో మార్కెటింగ్ విభాగంలో సుదీర్ఘమైన, వైవిధ్యభరితమైన వృత్తి జీవితాన్ని గడిపారు. పదవీ విరమణకు ముందు, వైట్‌ఫీల్డ్ మరియు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ (SSSIHMS) లో సమన్వయం (కోఆర్డినేషన్) మరియు ప్రజా సంబంధాల (పబ్లిక్ రిలేషన్స్) విభాగాలలో సేవ చేసే భాగ్యాన్ని పొందారు.

1960లో, ఆయన నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన మేనమామ బాబా వారి చిత్రపటంతో పాటు స్వామి వారి లీలలను కథలుగా ఇంటికి తీసుకురావడం ద్వారా స్వామి వారి ప్రవేశం ఆయన జీవితంలో జరిగింది. ఆ తరువాతి సంవత్సరం, వారి కుటుంబానికి పుట్టపర్తిలో స్వామి వారి దర్శనం మరియు ఇంటర్వ్యూ పొందే దివ్య భాగ్యం కలిగింది. చిన్న వయస్సు నుంచే ఆయన బాలవికాస్ తరగతులకు హాజరయ్యేవారు. కాలక్రమేణా, ఆ ప్రారంభ అనుబంధం ఒక స్థిరమైన ఆధ్యాత్మిక జీవన విధానంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆయన క్రమం తప్పకుండా భజనల్లో పాల్గొంటూ, తన స్థానిక సాయి సమితి ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వైబ్రియానిక్స్‌తో ఆయన అనుబంధం చాలా కాలం తరువాత, 2018లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన యాదృచ్ఛికంగా డా. అగర్వాల్ గారి పరిచయ వీడియోను చూశారు. ఈ వైద్య విధానాన్ని స్వామి స్వయంగా ఆశీర్వదించారని తెలుసుకోవడం ఆయనను ఎంతో లోతుగా ప్రభావితం చేసింది. వెంటనే తాను కూడా ఒక ప్రాక్టీషనర్ కావాలనే బలమైన కోరిక ఆయనలో కలిగింది. అయితే, ఆ సమయంలో ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి ముందుకు సాగలేకపోయారు. కొద్దికాలానికే, తన 93 సంవత్సరాల తల్లి ద్వారా వైబ్రియానిక్స్ శక్తిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఆయనకు లభించింది. పదేళ్లకు పైగా ఆమె ఒకేసారి గంటకంటే ఎక్కువసేపు నిద్రపోలేక బాధపడుతూ ఉండేవారు. వైద్యపరంగా ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ, తన బాల్యం లోని బాధాకరమైన జ్ఞాపకాలు రాత్రివేళల్లో మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చి ఆమెను కలవరపరచేవి. ఒక రోజు, అకస్మాత్తుగా ఆమె నిద్రపోవడానికి సహాయపడే హోమియోపతి మందు తీసుకురావాలని ఆయనను కోరారు. అప్పుడు ఆయన వైబ్రియానిక్స్ వెబ్‌సైట్ ద్వారా సమీపంలోని ఒక ప్రాక్టీషనర్ను సంప్రదించారు. ఆయన ఆశ్చర్యానికి అవధులు లేకుండా, పడుకునే ముందు కేవలం ఒకే మోతాదు తీసుకున్న తర్వాత, ఆమె వరుసగా ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోయారు! ఈ అనుభవం ఆయనకు వైబ్రియానిక్స్ ప్రభావశీలతపై మరింత దృఢమైన విశ్వాసాన్ని కలిగించింది.

ఈ అనుభవం వైబ్రియానిక్స్ నేర్చుకోవాలనే ఆయన కోరికను మళ్లీ రగిలించి, మరింత బలపరిచింది. అయితే, ఆ సమయంలో వైబ్రియానిక్స్ సేవకు అవసరమైన సమయాన్ని కేటాయించలేని పరిస్థితిలో ఉండటంతో, ఒక ప్రాక్టీషనర్ నిర్వహిస్తున్న శిబిరాలలో ఆమెకు సహాయకుడిగా సేవ చేయడం ప్రారంభించారు. తరువాత, 2022 ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఆన్‌లైన్ కోర్సులో చేరి, 2023 ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన శిక్షణా శిబిరం లో పాల్గొన్నారు. అలా, ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో ఉన్న సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ కావాలనే కోరికను చివరకు నెరవేర్చుకున్నారు. తాను ఈ అర్హతను పొందడం ఒక గొప్ప దైవానుగ్రహంగా భావిస్తున్నారు. వైబ్రియానిక్స్‌ను సులభంగా అర్థం చేసుకుని, సులభంగా ఆచరించగలగడం ఆయనను ఎంతో ఆకట్టుకుంది. రోగులకు చికిత్స అందించడం ద్వారా ఆయన అపారమైన ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా, ఏదైనా రోజు తన వద్ద చికిత్స కోసం రోగులు లేకపోతే, ఏదో లోటు ఉన్నట్లుగా అనిపిస్తుందని చెబుతారు. అందువల్ల, ఇప్పటికే తన సంరక్షణలో ఉన్న రోగులను స్వయంగా సంప్రదించి వారి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకుంటుంటారు. రోగులు పొందుతున్న ఉపశమనం, ఆనందం ఆయనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. అదే ఆయనకు మరింత ప్రేరణనిస్తూ, తన సేవా కార్యక్రమాలను విస్తరించి, అవసరంలో ఉన్న మరింత మంది ప్రజలకు చేరువ కావాలనే సంకల్పాన్ని బలపరుస్తోంది.

అనేక కేసులలో, కొన్నిసార్లు కేవలం ఒక్క మోతాదుతోనే వేగవంతమైన ఉపశమనం కలగడాన్ని ఆయన ప్రత్యక్షంగా గమనించారు. 2025 జూన్ 12న, అదృశ్య శక్తి ఆవహించినట్లుగా కనిపించే లక్షణాలను పోలిన సమస్యలతో బాధపడుతున్న 60 సంవత్సరాల మహిళకు CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing కాంబోను ఇచ్చారు. గత ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా ఆమె ప్రతి రాత్రి ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉండేది. ఆ సమయంలో ఆమె శరీరం తన నియంత్రణ లేకుండానే ఒక వైపు నుండి మరొక వైపుకు బలంగా కదిలిపోతుండేది. ఆమె కేవలం నాలుగు గంటల వ్యవధిలో రెండు మోతాదులు తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అప్పటి నుండి ఆ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. ఈ కాంబోను నీటిలో కలిపి నోటిద్వారా తీసుకున్నప్పటికీ, లేదా ఇంట్లో స్ప్రేగా ఉపయోగించినప్పటికీ, మంచి ఫలితాలను ఇస్తుందని ప్రాక్టీషనర్ నిరంతరం గమనించారు. అనేక కుటుంబాలలో ఆయన గణనీయమైన సానుకూల మార్పులను కూడా చూశారు. వాటిలో: కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడటం, అహంభావం మరియు ప్రవర్తనా సమస్యల వల్ల ఏర్పడే విభేదాలు తగ్గిపోవడం, 28 సంవత్సరాల యువకునిలో మద్యపానానికి సంబంధించిన తీవ్రమైన దూకుడు ప్రవర్తన తగ్గిపోవడం, కుటుంబంలో ఒక సభ్యుని బలవంతపు (అబ్సెసివ్) ఆలోచనలు మరియు మితిమీరిన విమర్శనాత్మక ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదల కనిపించడం వంటి ఫలితాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం మరింత ప్రశాంతమైన, సామరస్యపూరితమైన జీవితాన్ని గడుపుతున్నాయి.

58 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రాణిక్ హీలర్, 16 సంవత్సరాలుగా కుడి మణికట్టులో నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive Tissue + CC20.5 Spine రెమెడీను రోజుకు ఆరు సార్లు (6TD) ఇవ్వబడింది. రెండు వారాల తర్వాత సంప్రదించినప్పుడు, మొదటి రోజే కేవలం రెండు మోతాదులు తీసుకున్న తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. సమస్య మళ్లీ రాకపోవడంతో, మరో రెండు రోజులు మాత్రమే రెమెడీను కొనసాగించి ఆపివేశారు.

2026 జనవరి 6న, 18 సంవత్సరాల యువకుడు చిన్ననాటి నుంచీ తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతూ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాడు. అతనికి నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి మాత్రమే మలవిసర్జన జరిగేది. కడుపు ఉబ్బరంతో ఆకలి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, క్రీడల్లో పాల్గొనడం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా ఉండేవి. అతనికి CC4.4 Constipation + CC4.10 Indigestion రెమెడీను రోజుకు ఆరు సార్లు (6TD) తీసుకోవడానికి నీటిలో కలిపి ఇచ్చారు. అదనంగా, కొబ్బరి నూనెలో ఒక చుక్క మందు కలిపి బొడ్డుపై (నాభిపై) రాసి, ఐదు నిమిషాల తర్వాత నాభి చుట్టూ మృదువుగా మసాజ్ చేయమని సూచించారు. జనవరి 13న అతను 80% మెరుగుదల ఉందని తెలిపాడు. జనవరి 18 నాటికి 100% కోలుకున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు సమస్య మళ్లీ రాలేదు.

గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాక్టీషనర్ వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. సుమారు 30 మంది స్వచ్ఛంద సేవకులతో కూడిన బృందంలో భాగంగా, ప్రభుత్వ మానసిక ఆసుపత్రిని క్రమం తప్పకుండా సందర్శించి, రోగుల దైనందిన అవసరాలలో సహాయపడుతున్నారు. అదనంగా, ఆయన ప్రతి నెల రెండు వైబ్రియానిక్స్ క్యాంపులను, అలాగే ప్రతి వారం మూడు క్యాంపులను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని ఆయన నివాసానికి చాలా దూరంలో ఉంటాయి. ఈ క్యాంపులలో ఒకదానిలో, ప్రజలు తమ పశువులను మరియు పెంపుడు జంతువులను కూడా చికిత్స కోసం తీసుకురావాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు.

తన వైబ్రియానిక్స్ సేవతో పాటు, ప్రస్తుతం ఆయన నలుగురు వైబ్రియానిక్స్ అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అలాగే, బాబా వారి శతజయంతి సందర్భంగా విడుదలైన పుస్తకాలకు వ్యాసాలను కూడా అందించారు. ఈ ప్రాక్టీషనర్ అభిప్రాయం ప్రకారం, వైబ్రియానిక్స్ అనేది కేవలం ఇతరులకు సేవ చేసే అవకాశమే కాకుండా, అంతర్గత ఆత్మవికాసానికి కూడా ఒక విలువైన సాధనం. రోగులతో తన అనుబంధం ద్వారా ఆయన మరింత అవగాహన, సహనం మరియు కరుణను పెంపొందించుకున్నారు. ప్రతి రోగితో జరిగే సంభాషణ తనకు ప్రజలతో మరింత లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి, వారి క్లిష్ట పరిస్థితుల్లో వారికి తోడ్పడడానికి, అలాగే స్వస్థతను ప్రసాదించే దైవిక సాధనంగా సేవ చేస్తూనే వ్యక్తిగతంగా ఎదగడానికి సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారు.

ఉదహరించిన కేసులు: