Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టిషనర్ల వివరములు 11656...India


శ్యామల కస్తూరి 11656… ఇండియా మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైన ఆమె, తన ఇష్టంతో అంకితభావం కలిగిన గృహిణిగా ఉండడాన్ని ఎంచుకున్నారు. సంగీతం మరియు సేవ ఆమెకు అత్యంత ఇష్టమైన రెండు అభిరుచులు. సాయి భక్తుల కుటుంబంలో జన్మించిన ఆమెకు, తన తాతయ్య చెప్పిన స్వామివారి దివ్యలీలల ద్వారా చిన్నప్పటి నుంచే భగవాన్‌పై గాఢమైన ప్రేమాభిమానాలు పెంపొందాయి. 2006లో సాయి భజన మండలి సమీపానికి నివాసం మారిన తరువాత, ఆమె సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 2008లో సాయి భక్తులు కాని కుటుంబం యొక్క వ్యక్తితో వివాహం కావడంతో, 11 సంవత్సరాలపాటు సాయి కార్యక్రమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. అనంతరం 2019లో తన పిల్లల కోసం బాల వికాస్ తరగతిని వెతుకుతున్న సందర్భంలో, ఆనందంగా మళ్లీ సాయి కుటుంబంలోకి అడుగుపెట్టారు.

అప్పటి నుండి ఆమె నారాయణ సేవ, బట్టలు మరియు దుప్పట్ల పంపిణీ, అలాగే ఒక పాఠశాల మరియు మానసిక ఆరోగ్య సంస్థలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె తన సమితిలో ప్రధాన భజన గాయనిగా సేవలందిస్తున్నారు. రేడియో సాయి నిర్వహించిన భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో, అలాగే 2025 ఏప్రిల్‌లో ప్రశాంతి నిలయంలో నిర్వహించిన 1008 భజన మాల వంటి ప్రధాన కార్యక్రమాలలో భజనలు ఆలపించే భాగ్యం ఆమెకు లభించింది.

అంకితభావం కలిగిన విద్యావేత్తగా ఆమె సుమారు ఐదు సంవత్సరాలుగా బాల వికాస్ గురువుగా మరియు విద్యా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన నివాసంలోనే కాకుండా, వెనుకబడిన ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కూడా బాల వికాస్ తరగతులను నిర్వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, 200 మంది పిల్లలు మరియు 10 మంది గురువుల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు కొనసాగిన ఆన్‌లైన్ వేసవి శిబిరానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా, తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు, పిల్లల భజన కార్యక్రమాలు, పుట్టపర్తి యాత్రలు, వ్యాసరచన పోటీలు, అలాగే వివిధ సేవా కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. 2025 ఆగస్టులో, ఆమె కేంద్రానికి చెందిన ఆరుగురు బాల వికాస్ విద్యార్థులు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో భజనలు ఆలపించి, నాటికను ప్రదర్శించే దివ్యావకాశాన్ని పొందడం ఆమె సేవా ప్రస్థానంలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచింది.

2022 జూన్‌లో ఒక సాయి భక్తుడు పంపిన వైబ్రియానిక్స్ సంబంధిత వీడియో ద్వారా ఆమెకు వైబ్రియానిక్స్‌తో తొలి పరిచయం ఏర్పడింది. దీనిని స్వామివారు స్వయముగా  ఆశీర్వదించారన్న విషయం తెలుసుకున్న వెంటనే, ఆమె మనసు దీనివైపు ఆకర్షితమైంది. అనంతరం, వైబ్రియానిక్స్ రెమెడీల ద్వారా సేవలందిస్తున్న ఒక ప్రాక్టిషనర్ ని  కలిసి, ఆయన సేవానుభవాలను విన్నప్పుడు ఆమె హృదయం ఎంతో ప్రభావితమైంది. ప్రస్తుత కాలంలో వైద్య చికిత్సలు అధిక వ్యయభారంతో కూడుకుని కరుణాభావాన్ని కోల్పోతున్న నేపథ్యంలో, ఈ విశిష్టమైన వైద్య విధానం ద్వారా మానవసేవ చేసే మరో దివ్య అవకాశమిదేనని ఆమె దృఢంగా విశ్వసించారు. ఆ సంకల్పంతో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్గా చేరేందుకు దరఖాస్తు చేసి, 2023 నవంబరులో AVP కోర్సును విజయవంతంగా పూర్తిచేసి, 2024 ఆగస్టులో VPగా అర్హత పొందారు.

ప్రాక్టీషనర్గా సేవ ప్రారంభించిన తొలిరోజుల్లో, ఒక రోజు రాత్రి పొద్దు పోయిన తరువాత ఆమె ఇంటికి వచ్చిన 62 సంవత్సరాల వయస్సు గల తన బంధువుకు చికిత్స అందించారు. ఆ మహిళ గత ఆరు వారాలకు పైగా కఫంతో కూడిన దగ్గుతో (Wet cough) బాధపడుతున్నారు. అల్లోపతి మందులుతో పాటు రెండు సీసాల దగ్గు సిరప్ పూర్తిగా తీసుకున్నప్పటికీ ఉపశమనం కలగలేదు. ఆ రాత్రి ఆమె నిరంతరం దగ్గుతూ ఉండడంతో నిద్రపోలేకపోయారు. ప్రాక్టీషనర్ CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough క్రానిక్ కాంబినేషన్‌ను నీటిలో తయారుచేసి, ఒక గంటపాటు ప్రతి 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున తీసుకోవాలని సూచించారు. కేవలం మూడు మోతాదులు తీసుకున్న వెంటనే దగ్గు సుమారు 70 శాతం వరకు తగ్గి, ఆమె ప్రశాంతంగా నిద్రపోగలిగారు. మరుసటి ఉదయానికి పూర్తిగా ఉపశమనం పొందారు. వాస్తవానికి, ఇదే కాంబినేషన్‌తో ప్రాక్టీషనర్ ఇటువంటి 50కిపైగా కేసులకు విజయవంతంగా చికిత్స అందించారు.

2024 ఫిబ్రవరిలో, 10 సంవత్సరాల బాలిక జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, నీరసం, అలాగే చెవుల సమీపంలో వాపుతో బాధపడుతోంది. ఆమె చదువుతున్న పాఠశాలలో ఇదే లక్షణాలతో పలువురు విద్యార్థులు బాధపడుతుండటంతో, ఇది గవదబిళ్లలు (Mumps) అయి ఉండవచ్చని అనుమానించారు. ఆమెకు CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC12.2 Child tonic + CC13.1 Kidney & Bladder tonic కాంబినేషన్‌ను నీటిలో తయారుచేసి, రెండు రోజులపాటు ప్రతి గంటకోసారి, అనంతరం రోజుకు ఆరు సార్లు (6TD) తీసుకోవాలని సూచించారు. ఆమె తల్లికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ, ఎలాంటి అల్లోపతి మందులు తీసుకోకుండానే కేవలం మూడు రోజుల్లో బాలిక పూర్తిగా కోలుకుంది.

మరో సందర్భంలో, ఆమె వద్ద పనిచేసే 36 సంవత్సరాల గృహ సహాయకురాలు దీర్ఘకాలంగా తక్కువ రక్తపోటు (సాధారణంగా 95/60 mmHg), తలతిరగడం, నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతూ, గతంలో మూడుసార్లు స్పృహ తప్పి పడిపోయింది. 2024 మార్చిలో, ప్రాక్టీషనర్ ఆమెకు CC3.2 Bleeding disorders + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders కాంబినేషన్‌ను ఒక మోతాదు ఇచ్చి, నిద్రపోయే ముందు 30 నిమిషాల వ్యవధిలో మరో రెండు మోతాదులు తీసుకోవాలని సూచించారు. ఆమెకు ఎంతో ఆనందం కలిగించే విధంగా, కేవలం మూడు మోతాదుల తర్వాతే గృహ సహాయకురాలికి అన్ని లక్షణాల నుంచీ పూర్తిగా ఉపశమనం కలిగి, ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ తరువాత ఆమె ఒక్క మోతాదు కూడా తీసుకోలేదు. ఇప్పటివరకు, అంటే గత 18 నెలలుగా, ఆమెకు ఎలాంటి లక్షణాలు తిరిగి కనిపించలేదు. అంతేకాకుండా, ఆమె రక్తపోటు 110/80 mmHgగా సాధారణ స్థాయిలో కొనసాగుతోంది!

2025 ఆగస్టులో జరిగిన పుట్టపర్తి యాత్ర సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె చిరస్మరణీయమైన అనుభవంగా గుర్తుచేసుకుంటారు. సాయి కుల్వంత్ హాల్‌లో మరుసటి రోజు జరగాల్సిన కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి భజన పాడవలసిన బాలికకు, కార్యక్రమానికి ముందు రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. మందులు వాడినప్పటికీ ఎలాంటి ఉపశమనం కలగలేదు. అప్పుడు ప్రాక్టీషనర్ Immunity Booster (IB) ను నీటిలో తయారుచేసి, తదుపరి ఒక గంటపాటు తరచుగా తీసుకోవాలని సూచించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, మరుసటి రోజు ఉదయం 7 గంటలకే ఆ బాలిక పూర్తిగా కోలుకొని, కార్యక్రమంలో ఆనందంగా భజనలు ఆలపించింది. ఆమె తల్లి వైబ్రియానిక్స్‌ను భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన వరం అని ప్రశంసించారు.

రజోనివృత్తి (post-menopausal) అనంతరం గర్భాశయ తొలగింపు (Hysterectomy) చేయించుకున్న అనేక మంది మహిళలు మోకాలు, వెన్ను లేదా భుజాలలో SMJ నొప్పితో బాధపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో, సంబంధిత నొప్పి నివారణ కాంబినేషన్‌కు CC8.1 Female tonicను జోడించడం ద్వారా, తాను చికిత్స చేసిన ఏడు కేసులలోనూ అద్భుతమైన ఫలితాలు లభించినట్లు ఆమె గుర్తించారు. అలాగే, తలతిరగడం (Vertigo)తో బాధపడుతున్న నలుగురు రోగులకు CC5.1 Ear infections + CC10.1 Emergencies + CC18.7 Vertigo కాంబినేషన్‌ను ఇవ్వగా, వారందరికీ మంచి ఉపశమనం లభించింది.

 అనుభవం పెరిగే కొద్దీ, వ్యాధికి మూలకారణాలను మరింత ఖచ్చితంగా గుర్తించి, తగిన కాంబినేషన్లను సూచించే అంతఃస్ఫూర్తి ఆమెలో మరింత పెంపొందింది. సేవా శిబిరాలలో పాల్గొనడం ద్వారా ఆమె వినే నైపుణ్యం, రోగులకు సలహాలు అందించే సామర్థ్యం మరింత మెరుగుపడి, వ్యాధి లక్షణాలతో పాటు వాటికి దోహదపడే మానసిక, భావోద్వేగ మరియు జీవనశైలి సంబంధిత అంశాలను కూడా సమర్థవంతంగా పరిష్కరించగలుగుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అలాగే ఓంకార జపం, గాయత్రీ మంత్ర పారాయణం వంటి ఆధ్యాత్మిక సాధనలను ఆచరించాలని ఆమె రోగులను ప్రోత్సహిస్తారు. ప్రతి ఔషధాన్ని “బ్రహ్మార్పణం సాయీశ్వరార్పణమస్తు” అనే ప్రార్థనతో భక్తిపూర్వకంగా ప్రసాదంగా అందజేస్తారు.

ప్రస్తుతం ఆమె ప్రతి నెల రెండు సమితి సేవా శిబిరాలలో, అలాగే స్వామివారి పాఠశాలలో నిర్వహించే ఒక సేవా శిబిరంలో సేవలందిస్తూ, రెండు సంవత్సరాల లోపే వెయ్యిమందికి పైగా రోగులకు చికిత్స అందించారు. భవిష్యత్తులో వైబ్రియానిక్స్ ప్రాక్టిషనర్లకు మార్గదర్శకురాలిగా సేవ చేయాలనే ఆకాంక్ష కూడా ఆమెకు ఉంది. వైబ్రియానిక్స్ సేవ తనలో సహనం, కరుణ, సమస్త జీవుల పట్ల ప్రేమను మరింత పెంపొందించిందని, అదే సమయంలో స్వామివారితో నిరంతర అనుబంధాన్ని ప్రసాదించిందని ఆమె చెబుతారు. ఆమె దృష్టిలో, వైబ్రియానిక్స్ అనేది బాబా ప్రసాదించిన ఒక పవిత్ర వరం—ఆపదలో ఉన్నవారికి సేవ చేసే అవకాశం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక సాధనం, నిస్వార్థ సేవలో నిజమైన తృప్తిని పొందే మార్గం. చికిత్స అనంతరం రోగి ముఖంపై కనిపించే ప్రతి ఉపశమన చిరునవ్వు ఆమె హృదయాన్ని ఆనందంతో, కృతజ్ఞతతో నింపుతుంది.

Cases to share: