Vol 5 సంచిక 4
July/August 2014
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
ఈ సంచిక తో మొదలుకొని మన వార్తాలేఖ అభ్యాసకులనుండి వచ్చే ఎన్నో విషయాలకు ప్రాధాన్యత నిచ్చే దిశలో ముందుకుపోవడానికి సంసిద్ధమైనది. రాబోయే సంచికలలో కొత్తకొత్త శీర్షికలతో వార్తాలేఖను విస్తరించాలని యోచిస్తున్నాము. దయచేసి ఈ కొత్తహంగులు మీకు ప్రయోజనాత్మకంగా ఉన్నయా లేదా ఎలా ఉంటే మీ అభిరుచికి అనుగుణంగా మీకు మేలుచేసే విధంగా ఉంటుందో అనే విషయం పైన మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇప్పటికే తమ సేవల ద్వారా ప్రేరణాత్మక దివ్య వైద్య అనుభావల ద్వారా మాతో ప్రచురణార్ధం తమ అనుభవాలు పంచుకొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకూ మాకు చేరిన అద్బుతమైన అనుభవాలను చాలా వరకూ ఈ సంచికలో ప్రచురించాము. మిగిలిన వాటిని రాబోయే సంచికలలో మీ ముందుకు తెచ్చేదిశలో ముందుకు సాగుతున్నాము.
గురుపూర్ణిమ సమీపిస్తోంది కనుక మన హృదయాలు మన సద్గురువు, మన వైద్యబ్రహ్మ, మన ప్రియాతి ప్రియమైన స్వామి వైపు మరింత భక్తితో, అనురక్తితో మరలాలని కోరుకుంటున్నాను. ఈ పర్వదినపు రోజులు మనం స్వామితో మరింత సామీప్యాన్ని అనుభవించినట్టివి, ఎందుకంటే ఇదే రోజులలో స్వామి మనకు ఈ అద్భుతమైన దివ్య వైద్య సేవను తమ దివ్య అనుగ్రహంతో ఆశీర్వదించారు. ఈ పర్వదినము నాడే స్వామి వైబ్రియోనిక్స్ ను ఆశీర్వదించడం, తమ అనుగ్రహానికి చిహ్నంగా మనం సమర్పించిన కేకును సాయికుల్వంత్ సభాప్రాంగణంలో భక్తులందరికీ పంపిణి చేయించడంద్వారా మనమంతా ఆనందంతో పులకరించేటట్లు చేసిన అద్భుత క్షణాలవి. కనుక ఏవిధంగా ఐతే పొద్దుతిరుగుడు పూవు (సన్ ప్లవర్) క్షణమైనా వీడకుండా తన స్వామి ఐన సూర్యుడికి అభిముఖంగా తిరుగుతూ ఉంటుందో అలాగే మనం కూడా మన స్వామిని అనుక్షణం స్మరిస్తూ ఈ దివ్య సేవలో పాల్గొనడానికి శక్తినిమ్మని స్వామిని ప్రార్ధిద్దాం.
మనం స్వామి ప్రేమకు ప్రతిరూపాలుగా ఉంటూ, స్వామి ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారని భావిస్తూ, అనుదినమూ మనం చూసే రోగులకు మన మాటలు, తలపులు, సేవల ద్వారా ప్రేమను పంచుదాం. అందరిలోనూ స్వామినే చూద్దాం.
స్వామి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్
సోరియాసిస్ 02128...Argentina
2013 డిసెంబర్ 10 వ తేదీన 28 సంవత్సరాల వ్యక్తి సోరియాసిస్ వ్యాధికి వైద్యం నిమిత్తం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఇది అతనికి తాను విశ్వవిద్యాలయ పరీక్షలు వ్రాస్తున్న సందర్భంలో ఏర్పడిన మానసిక వత్తిడి కారణంగా మొదలయ్యి తరుచుగా ఇబ్బంది పెడుతోంది. అతనికి వీపు, పార్శ్వాలు, భుజాలు, ముంజేతులు అంతా మచ్చలు వ్యాపించాయి (డిసెంబర్ 12 ఫోటోలు చూడండి). గతంలో అతను అలోపత వైద్యం తీసుకున్నా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది.
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis + SR293 Gunpowder…BD, విభూతి తో ఆల్మండ్ నూనె కలిపి ఇవ్వబడింది.
ఒక వారం తర్వాత మంట పూర్తిగా తగ్గిపోయి మచ్చలు క్షీణించసాగాయి (డిసెంబర్ 19 ఫోటోలు చూడండి). రెండు వారాల తర్వాత చర్మం మామూలు స్థితికి రావడంతో పేషంటుకు 100% ఉపశమనం కనిపించింది.
డిసెంబర్ 12 డిసెంబర్ 19 డిసెంబర్ 27
లుకేమియా ఎముకల మజ్జ మార్పిడి ఆపరేషన్ 12051...India
2013సెప్టెంబర్ 19వ తేదీన రక్తక్యాన్సర్తో బాధపడుతున్న4 సంవత్సరాల పాపను వైద్యం నిమిత్తం ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చారు. రెండు సంవత్సరముల క్రితం నుoడి ఈ వ్యాధితో బాధపడుతూ బెంగుళూరులోని ఒక హాస్పిటల్ లో కీమోతెరపి పూర్తిచేసుకున్నప్పటికీ ఇంటికి వచ్చిన 4 నెలల తర్వాత వ్యాధి మరల ప్రారంభమయ్యింది. ఆమెకు ఎముకల మజ్జను మార్చవలసి ఉందని చెప్పడంతో ఆమె వైద్యం తీసుకున్న హాస్పిటల్లో మజ్జ ఇచ్చే దాత దొరకక బెంగుళూరు లోనే వేరే హాస్పిటల్లో చేర్చారు. ఈ హాస్పిటల్ లోనే పాప తండ్రి క్యాంటీన్ లో పనిచేస్తున్నారు. డాక్టర్లు పాప తండ్రి నుండి ఎముక మజ్జను సేకరించి మజ్జమార్పిడి శస్త్ర చికిత్సను చేసారు. ఆపరేషన్ అనంతరం పాప ICU లో ఉన్నప్పుడు క్రింది రెమిడీ ఇవ్వబడింది.
#1. CC2.1 Cancers – all + CC3.1 Heart tonic...TDS
10 రోజుల తర్వాత పాపకు నీళ్ళ విరోచనాలు ప్రారంభం కావడంతో డోసేజ్ ను OD కి తగ్గించడం జరిగింది. పాప మలాన్ని పరీక్షించినప్పటికీ అంతా నార్మల్ గానే ఉంది కానీ పాప చాలా నీరసంగా ఐపోయింది. 10 రోజుల తర్వాత నీరసం, నీళ్ళవిరోచనలు తగ్గడానికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#2. CC3.1 Heart tonic + CC4.1 Digestion tonic + CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic ...TDS (అవసరమైతే రోజుకు ఆరు సార్లు).
మూడు రోజుల తర్వాత పాప పూర్తిగా కోలుకోవడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. ఇంటికి వచ్చిన రెండు వారాల తర్వాత పాప 100% కోలుకుందని డాక్టర్లు కూడా అంత త్వరగా కోలుకున్నందుకు ఆశ్చర్య పోయారని పాప తల్లి చెప్పారు.
పాప భవిష్యత్తు గురించి ఆశలు వదిలి వేసుకున్న ఆ తల్లిదండ్రులు వైబ్రియోనిక్స్ వల్ల అంత త్వరగా కోలుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ భవష్యత్తులో పాపకు ఏ ఇబ్బంది వచ్చినా వైబ్రో వైద్యమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ 01768...Greece
జనవరి 6వ తేదీన 3 సంవత్సరాలుగా రొమ్ముపై కేన్సర్ తో బాధ పడుతున్న62 సంవత్సరాల మహిళ ప్రాక్టీషనర్ వద్దకు చికిత్స కోసం వచ్చారు. శస్త్ర చికిత్స ద్వారా స్తనమును తొలగించడం, కీమోథెరపీ పూర్తిగా తీసుకున్న పిదప ఆమెకు 2013 జూన్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వళ్ళంతా నొప్పులు రావడం మొదలు పెట్టాయి. 2013 డిసెంబర్ 23న పరీక్షల అనంతరం ఆమెకు మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. రెండు వారాలు అనంతరం ఆమె క్రింది రెమిడి తీసుకుంది. CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + NM113 Inflammation…TDS
2014 మార్చి నెలలో కొన్ని పరిక్షల అనంతరం డాక్టర్ ఆమెతో ‘’ఇది నమ్మశక్యము కాకుండా ఉంది, మచ్చుకైనా క్యాన్సర్ లక్షణాలు లేవు. క్యాన్సర్ పూర్తిగా పోయింది’’ అన్నారు. ఈ వ్యాధి పోవడంతో పేషంటు మానసికంగా కూడా కోలుకున్నారు. వైబ్రియోనిక్స్ థెరపీ ప్రారంభించక ముందు ఆమె నడవడానికి కూడా అశక్తురాలిగా ఉండేది. 2014 మే నాటికీ ఆమె చక్కగా నడచి వచ్చి వైబ్రో థెరపీని తీసుకొంటోంది.
చేతి పైన తిత్తి 00014...India
సెక్యూరిటీ వాచ్ మ్యాన్ గా పనిచేస్తున్న 32 సంవత్సరముల వ్యక్తి, కుడి చేతిపైన 15 మి. మీ. వ్యాసంతో ఉన్న తిత్తితో అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఇది 12 నెలలుగా కొంచం కొంచం పెరుగుతూ ఉంది. అతనికి దీనివల్ల బాధ లేదు కానీ చేతితో ఎదైనా పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దీనికయ్యే ఖర్చులకు భయపడి అతను ఏ డాక్టర్ ను సంప్రదించలేదు. క్రింది రెమిడి అతనికి ఇవ్వబడింది.
CC2.3 Tumours & Growths…QDS
దీనిని 15 రోజులపాటు తీసుకున్నారు. అంతేకాక రెమిడిని నువ్వుల నూనెలో కలిపి OD గా నిద్ర పోయేముందు తిత్తి పైన రాసేవారు.
దీర్ఘకాలికమైన వినాళగ్రంధుల వాపు (క్రోనిక్ టాన్సిలైటిస్) 10741...India
33సంవత్సరాల వ్యక్తి 20 సంవత్సరాలుగా దీర్ఘకాలిక వినాళ గ్రంధుల వాపుతో బాధపడుతూ పరిస్థితి విషమంగా మారి డాక్టరు దీనికి అపరేషనే మార్గము అన్న తరుణంలో వైబ్రియో నిపుణుడి వద్దకు వచ్చారు. దీనితో పాటుగా అపుడప్పుడు వచ్చే జ్వరం నిమిత్తం ఎక్కువ మోతాదు గలిగిన యాంటి బయోటిక్ తీసుకోవడం, అలెర్జీ దగ్గుతో కూడా బాధపడుతూ ఉండేవాడు. ఫిబ్రవరి 5, 2014 న అతనికి క్రింది కోమ్బో 20 రోజుల వరకూ వాడమని సూచించారు:
#1. CC9.2 Infections acute + CC14.1 Male tonic + CC19.2 Respiratory allergies + CC19.7 Throat chronic…TDS
అతనికి 60% మెరుగుదల కనిపించింది కానీ అదనంగా నీరసం, టెన్షను పెరిగాయి. అందుచేత కొమ్బో క్రింది విధంగా మార్చబడింది:
#2. CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.7 Throat chronic…BD
25 రోజులు ఈ డోసేజ్ తీసుకున్నాక 75% అభివృద్ధి కనిపించింది. మరొక నెల వాడే సరికి 85% మెరుగుదల కనిపించింది. గతంలో ఎప్పుడూ ఇలా నిలకడగా వ్యాధి తగ్గుతూ రావడం జరగలేదు పైగా 3 నెలలుగా జ్వరం కూడా రాలేదు. 2014 జూన్ 6 న కంటిన్యూగా #2 ను వాడాలని నిర్ణయించుకున్నారు.
లివరు వ్యాది, నులిపురుగులు మరియు విరేచనాలతో బాధపడే పిల్లి 02494...Italy
ప్రాక్టీషనర్ తన మిత్రుడికి చెందిన ఉమ అనే 5 నెలల పిల్లికూనకు చికిత్స్ చేయడానికి వెళ్ళారు. దీనికి తీవ్రమైన నులిపురుగులు, రక్తము, శ్లేష్మముతో కూడిన విరేచనాలు మరియు ప్రేగుల ఇన్ఫెక్షన్ కూడా ఉంది. వెటర్నరి డాక్టరు దీనికి లివర్ సమస్య ఉందని చెప్పి ఎన్నోరకాల అలోపతిక్ మందులు ఇచ్చారు కానీ దాని ఆరోగ్యం మెరుగవలేదు. దీనికి నీరసంతోపాటు ఆకలి కూడా లేదు. క్రింది కోమ్మ్బో దానికి ఇవ్వబడింది:
జ్వరానికి:
#1. NM22 Liver + SR265 Aconite + SR275 Belladonna (30C) + SR283 Chamomilla (30C) + SR343 Argent Nit + SR504 Liver...TDS
నీళ్ళ విరోచనాలకి:
#2. Nosode of blood and mucus…TDS
ఒక వారం తరువాత 20-30% మెరుగుదల కనిపించింది. కానీ పురుగులు, నీళ్ళవిరోచనాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. త్వరగా తగ్గాలనే ఉద్దేశ్యంతో పిల్లి మలము నుండి తీసిన పురుగుతో నోసోడ్ తయారుచేసి క్రింది విధంగా డోసేజ్ ఇచ్చారు.
లివరుకు, విరోచనాలకి, వాపుకు:
#3. NM15 Diarrhoea + NM22 Liver + SR348 Cortisone + SR504 Liver…TDS
పురుగులు, ఇన్ఫెక్షన్ కు:
#4. NM35 Worms + NM36 War + Nosode of a worm with faeces…TDS
దీనితో పిల్లికూన త్వరగానే కోలుకుంది 3 రోజులకు 30%, 5 రోజులకు 50%,10 రోజులకు 70% మెరుగుదల కనిపించింది. 19 వ రోజుకల్లా నీళ్ళవిరోచనాలు నులిపురుగులు పూర్తిగా తగ్గిపోయాయి.
పిల్లికూన ఉమకు #3 మరియు #4 ను మరో 11 రోజులు కొనసాగించారు. తర్వాత #4 ను ఆపేసి #3 మరో రెండు వారాలు కొనసాగించి డోసేజ్ ని క్రింది విధంగా మార్చారు:
#5. NM35 Worms…TDS
పిల్లికూనకు #3 మరియు #5 లను మరొక నెల కొనసాగించడంతో డానికి 100% నివారణ జరిగింది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్యానం:
“మా మిత్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత వారు ఏ విధంగా సహాయం పొందారో అలాగే ఇతరులకు కూడా వారు సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ఈ కోర్సు నేర్చుకున్నారు. ఇప్పుడు వారు వైబ్రోనిపుణులుగా సేవలందిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఇది మాకు చాలా గొప్ప వరం ఎందుకంటే ఈ అనుభవం ద్వారా ఇతరులలో ఆనందాన్ని చూస్తూ మేము పరమానందాన్ని అనుభవిస్తున్నాము. చికిత్సా నిపుణులుగా మేమే ఇతరులకు సహాయం చేసామనో, ఇతరులకు మావల్ల స్వస్థత చేకూరిందనో భావిస్తే ఇది సాధ్యపడి ఉండేదికాదు. మేము మా సద్గురువు దైవం ఐన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఉపకరణాలుగా భావిస్తూ ఉండడం వల్లనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి”
సంపాదకుని వ్యాఖ్యానం:
ఈ కేసు 2003 సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో చోటు చేసుకుని ఇటీవలే నోసోడ్ వినియోగం గూర్చిన సదస్సులో వివరించబడింది.
మలబద్ధకం 02896...UK
25 సంవత్సరముల యువతి తీవ్రమైన మలబద్దకంతో బాధపడుతూ ఉంది. దీనికి కారణం తను సహజంగా రోజూ తినే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మాని, ఒక వారం రోజులుగా తనకు అలవాటు లేని వేయిoచిన ఆహార పదార్ధాలు, గ్లుటేన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తిన్నారు. ప్రాక్టీషినర్ ను కలిసే సమయానికి గత రెండు రోజులుగా ఆమెకు మల విసర్జన కాకపోవడంతో, కడుపులో నొప్పితో ఎంతో అసౌకర్యంగా ఉండేది. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.
CC4.4. Constipation…1 pill every 10 minutes for 1 hour
రెమిడి తీసుకున్న రెండు గంటల తర్వాత ఆమెకు 2, 3 సార్లు మల విసర్జన కావడంతో కడుపునొప్పి కూడా తగ్గి పోయింది. 3 రోజుల పాటు రెమిడి తీసుకోవడంతో ఈ సమస్య పూర్తిగా పోయింది. ఆమె మామూలుగా తినే ఆరోగ్యవంతమైన ఆహారం తినడం ప్రారంభించింది. మరలా ఈ సమస్య ఎప్పుడూ రాలేదు.
కాలి పగుళ్ళు మరియు కాళ్ళలో పరాధీయ రక్తనాళాల (ఫెరిఫెరల్ వాస్కులర్) వ్యాధి 12051...India
86 సంవత్సరాల వృద్ధుడు అనేక సమస్యలతో చికిత్సా నిపుణుడి వద్దకు వచ్చారు. 1) చాలా సంవత్సరాలుగా కాలి మడమ మరియు వెన్నునొప్పి 2) రెండు పాదాల పైనా పగుళ్ళు 3) పరాధీయ రక్తనాళాల (కాళ్ళలో రక్త ప్రసరణకు అవరోధం) వ్యాధి; దీనివల్ల కాళ్ళలో విపరీతమైన నొప్పి నడవడానికి కూడా చేతకాని పరిస్థితి. గతంలో వీరు హొమియోపతీ, ఆక్యుపంక్చర్, అలోపతి, చికిత్సలు తీసుకున్నారు కానీ ఏమీ ప్రయోజనంలేదు. 2013 ఆగస్టులో క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC20.1 SMJ tonic + CC20.4 Muscles and Supportive tissue…TDS
8 నెలల చికిత్స అనంతరం అతనికి కాళ్ళలోనూ మడమ లోనూ నొప్పి 100% తగ్గిపోయింది. ఎడమ కాలి పైన పగుళ్ళు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. కానీ కుడి కాలిపైన సమస్యలు కొంతమేర తగ్గేసరికి వైబ్రో రెమిడిలనే పూర్తిగా తగ్గే వరకు వాడడానికి నిశ్చయించుకొన్నారు. ఈ విధంగా తనకు తగ్గించినందుకు స్వామికి ప్రణామములు అర్పించుకొంటు ఈ చికిత్సా కాలంలో తనకు స్వామి తాలూకు ఎన్నోరకాల అనుభవాలు కలిగాయని చెప్పారు.
సంపాదకుని వ్యాఖ్యానం:
ఆర్టియో స్కెలోరోసిస్ (arteriosclerosis) వ్యాధి వలన ఈ రక్త అవరోధాలు ఏర్పడి ఉండవచ్చు. కనుక దీనికి CC3.5 Arteriosclerosis ని కూడా కలపవచ్చు.
దీర్ఘకాలికమైన అలసట మరియు నొప్పి 02779...Japan
65 సంవత్సరాల మహిళ దాదాపు దశాబ్ద కాలంగా వంటి నొప్పులు, అలసటతో బాధననుభవిస్తూ వైబ్రో నిపుణుడి వద్దకు వచ్చారు. గతంలో ఆమె అలోపతి వంటి ఎన్నో వైద్య చికిత్సలు తీసుకున్నా అవి ఏవి బాధనుండి ఉపశమనం ఇవ్వలేదు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
C12.1 Adult tonic + CC 12.4 Chronic fatigue + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు రోజులు ఈ డోసేజ్ తీసుకున్న తర్వాత ఆమెకు బలమైన పులౌట్ వచ్చ్చింది. ఎంత ఉధృతంగా వచ్చిందంటే ఆమె శరీరం మీద ముఖం మీద ఎక్జిమా, విపరీతమైన తలపోటు, గొంతులో, వీపు పైనా ఛాతీపైనా, నడుము వద్ద, విపరీతమైన నొప్పి, అలా 2 ½ రోజులు ఈ బాధ అనుభవించవలసి వచ్చింది. ధ్యానం ద్వారా ఈ బాధల నుండి ఉపశమనం పొందాలని ప్రయత్నించింది. కానీ నొప్పి భరింపరానిదిగా ఉండేసరికి చికిత్సా నిపుణుడు ఎక్కువగా నీరు త్రాగమని, ఈ లక్షణాలు పూర్తిగా తగ్గే వరకు డోసేజ్ ఆపమని సలహా ఇచ్చాడు. 9 రోజులకు ఆమెకు ఉపశమనం లభించేసరికి ఆమె OD గా డోసేజ్ తీసుకోవడం ప్రారంభించింది. రెండు వారాల వరకు ఎటువంటి పులౌట్ రాకపోయేసరికి డోసేజ్ ని TDS కు పెంచడం జరిగింది. 3 నెలల తర్వాత ఆమెకు 70% తగ్గింది. 6 నెలలు గడిచే సరికి ఆమెకు 90% తగ్గేసరికి ఇక కంటిన్యూ గా OD గా తీసుకొనడానికి నిర్ణయించుకున్నది.
చికిత్సా నిపుణుల వివరాలు 10228...India
చికిత్సా నిపుణుడు 10228...ఇండియా నేను వృత్తి రీత్యా మైనింగ్ ఇంజినీర్ ను. 1973 నుండి మా కుటుంబ సభ్యులంతా స్వామి భక్తులము. నిరాశా, నిస్పృహలతో అలమటిస్తున్నవిపత్కర పరిస్థితులలో స్వామి మా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నాగపూర్ సమితి కార్యకలాపాలు అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని. కానీ 1980 లో మైనింగ్ లో చేరిన తర్వాత 27 సంవత్సరాల పాటు సేవాకార్యక్రమాలలో నేను పాల్గొనడం చాలా తక్కువనే చెప్పాలి. నా ఉద్యోగ రీత్యా తరుచూ బదిలీలు అవుతున్నందున మరియు నేను పనిచేస్తున్న ప్రాంతంలో సమితి లేకపోవడంతో సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కుదరలేదు. 2007 లో తిరిగి ఉద్యోగమార్పు పైన నాగపూర్ వచ్చిన తర్వాత తిరిగి సేవాకార్యక్రమాలలో పాల్గొనసాగాను.
అప్పుడప్పుడు సమితి భజనల్లో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ యొక్క అనుభూతి పొందేవాడిని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. కానీ ఇదంతా నా క్షేమం కోసం స్వామి చేసే లీల గా భావించేవాడిని.
ఒకానొక సందర్భంలో నాగపూర్ లో ఉన్న నారాయణ విద్యాలయం అనే పాఠశాల 2008 మే నెలలో EHV సదస్సును ఏర్పాటు చేసింది. నేను ముంబాయి నుండి వచ్చే శిక్షకులకు సహాయం చేసేందుకు వాలంటీర్ గా ఉన్నాను. ఇదే సంవత్సరం అక్టోబర్ నెలలో ముంబాయి లోని ధర్మక్షేత్రం లో వైబ్రియోనిక్స్ వర్క్ షాప్ ఉంటుందని తెలిసి దానికి నేను దరఖాస్తు చేసుకోవడమే కాక నా శ్రీమతి ని కూడా ప్రోత్సహించి తీసుకు వెళ్ళాను.
ఈ సదస్సులో విశ్వం లో ప్రతీ ఒక్క వస్తువు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు (వైబ్రేషణ్) ఉద్గారం చేస్తుందని అవి దేహంలో కూడా ఉంటాయని ఈ ప్రకంపనల అసమతుల్యం వల్లనే వ్యాధి కలుగుతుందని తెలిసింది. నేను భజనలో పొందిన అనుభవాన్ని దీనితో పోల్చి చూసుకొని ఉత్సాహంగా ఇది స్వామి అనుగ్రహమని భావించి వైబ్రో సేవను ప్రారంభించాను. నేను నా శ్రీమతి ఇద్దరం విజయవంతంగా శిక్షణ ముగించుకొని అద్భుత ఫలితాలతో 11000 పైచిలుకు పేషంట్లకు సేవలందించండం జరిగింది.
వైబ్రో విజయాలు నాగపూర్ లోని ఎందరో సాయిసోదరులకు ప్రేరణ ఇచ్చి వైబ్రో శిక్షణ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇదే సమయములో 3 వైబ్రో సదస్సులు కూడా జరగడంతో పూనా మరియు ముంబాయి శిక్షకుల ద్వారా 50 మంది సాయి భక్తులు శిక్షణ పొందారు.
నాగపూర్లో 63 మంది అభ్యాసకులు ఉండగా వీరిలో 18 మంది నిత్యమూ సత్యసాయి మెడికేర్ వ్యాన్ కు తమ సేవలందిస్తున్నారు. వీరు పుట్టపర్తి లో జరిగిన మొదటి అంతర్జాతీయ వైబ్రో సదస్సుకు కూడా హాజరయ్యారు. మాలో ఇద్దరు SVP కోర్సును కూడా పూర్తిచేసి SRHVPను కూడా పొందారు. మిగతావారు 9 ఆలయాలలోను, ఒక గురుద్వారాలోను, ఓక కమ్యునిటీ సెంటర్ లోనూ పక్షానికి ఒకసారి తమ సేవలందిస్తున్నారు. నేను నెలవారీ రిపోర్టును ముంబాయి లోని మా కోఆర్డినేటర్ కు పంపిస్తాను. మేము నాగపూర్లో ప్రతీ నెలలో సుమారు 2,700 పేషంట్లకు సేవలందిస్తాము.
స్వామి నాకు సాయివైబ్రియోనిక్స్ వార్తా లేఖలను హిందీలోకి అనువదించే అవకాశం కూడా కల్పించారు. ఒక విషయం మీతో తప్పనిసరిగా పంచుకోవాలి. ఎప్పుడయినా నాతో పాటు పనిచేసే నా సహ అభ్యాసకులు ప్రశాంతినిలయం వెళ్ళినప్పుడు డాక్టర్ అగ్గర్వాల్ గారిని, శ్రీమతి హేమ అక్కయ్యను కలిసినప్పుడు ఎంతో ప్రేరణ ప్రోత్సహాలను పొందుతారు.
నా వైబ్రో సేవద్వారా నేను పొందిన రెండు ఆసక్తిదాయక మైన అనుభవాలను ఉదహరిస్తాను:
మొదటి అనుభవం:
ఈ సంఘటన మే 2009 లో జరిగింది. ఒక మహిళ తీవ్రమైన మోకాలి నొప్పులతో బాధ పడుతూ ఉంది. ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులు దర్శన సమయంలో స్వామి హస్త చేలనంతో సృష్టించిన విభూతి పొందిన ధన్యజీవులు. నిరాశ, నిస్పృహలతో ఉన్నపుడు, పిల్లలు అనారోగ్యముతో బాధ పడుతున్నప్పుడు నివారణ కోసం ఈ విభూతిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ విభూతి డబ్బా అడుగున ఉన్న కొద్దీమొత్తం తప్ప మరేమీ లేదు. కనుక ఈ పేషంటుకు ఆ విభూతి ఇవ్వడానికి తటపటాయిస్తూనే ఒకవారం వేచి ఉన్నారు.
చివరి రోజున మా నాగపూర్ జిల్లా అధ్యక్షులు ఈశ్వరమ్మ సెలబ్రేషన్స్ కోసం కార్డు ఇవ్వడానికి ఆ ఇంటికి వెళ్లి రెండు విభూతి పొట్లాలు కూడా కార్డు తో పాటు ఇచ్చారు. ఆ కుటుంబ మంతా ఈ సంఘటనకు ఆశ్చర్య పడి స్వామీనే ఈ రూపంలో పంపించారని భావించారు.
మా జిల్లా అధ్యక్షులు ఆ మహిళ ఆరోగ్యం గూర్చి ఆరా తీయగా ఆమె రెండు నెలల నుండి మంచానికే పరిమితమయి పోయిందని లోపల ఒక రూములో ఆమెను ఉంచామని వారు చెప్పారు. మా ప్రెసిడెంటు వారితో ఇటివలే 5 గురు సభ్యులు ధర్మ క్షేత్రం లో వైబ్రో శిక్షణ తీసుకొని సత్యసాయి మెడికేర్ వ్యాన్ లో దత్తత గ్రామాలకు వెళ్లి సేవ చేస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారని కనుక ఈ కుటుంబము వారు కూడా వైబ్రో మందులు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఆ పేషంటు భర్త నాకు ఫోన్ చేసి విషయం చెప్పి మందులు ఇవ్వాలంటే పేషంటు తప్పనిసరిగా అవసరమా అని అడిగారు. నేను అవసరం లేదని రోగి యొక్క వివరాలు తెలుసుకొని ఆమె తీవ్రమైన మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుసుకొని క్రింది రెమిడి ఇచ్చాను.
(CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS) సాధారణ సూచనలతో.
నేను వెళ్ళిన సమయంలో ఆ మహిళ లోపల నిద్రపోతూ ఉంది. ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఆమె భర్తకు రెమిడి బాటిల్ ఇచ్చి వాడే విధానం చెప్పాను. కానీ అతను అపనమ్మకంగా, అనుమానాస్పదంగా కనిపించడంతో ఈ మందులు 3 వారాల వరకు పనిచేస్తాయని రెండు రోజుల ముందుగానే తనకు ఫోన్ చేస్తే తిరిగి మందులు తీసుకొచ్చి ఇస్తానని నమ్మబలికాను.
మూడు వారాల తరవాత ఆమె భర్త ఫోన్ చేసి ఇంకా 5-6 గోళీలు మాత్రమే మిగిలిఉన్నాయని ఇంటి ఎడ్రస్ చెపితే వచ్చి తీసుకుంటానని చెప్పారు. అవసరంలేదు నేనేవచ్చి ఇస్తానని ఎంత చెప్పినా అతను ఎడ్రస్ చెప్పాల్సిందేనని గట్టిగా పట్టుబట్టడంతో కొంచం బాధాకరంగానే ఆ వివరాలన్నీ చెప్పి నా మేనల్లుడిని క్రింది ఫ్లోర్ లో ఉంచి వారు రాగానే నేనుండే మొదటి ఫ్లోర్ కు తీసుకురమ్మని చెప్పాను.
10 నిమిషాల తర్వాత చప్పుడు విని తలుపు తెరిచే సరికి బహుశా నాజీవితంలో అంతటి షాక్ ఎప్పుడూ కలగలేదేమో, నా కళ్ళని నేనే నమ్మలేని పరిస్థితి. నా పేషంటు ఆమె భర్తతో కలసి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్నారు. వాళ్ళకి క్షమార్పణ చెప్పి లోపలికి ఆహ్వానించాను. ఎందుకంటే కాళ్ళునొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆమెతో అన్ని మెట్లు ఎక్కించినందుకు నిజంగా నాకు చాలా బాధనిపించింది. ఐతే వారు లేదండి మూడు వారాల్లో జరిగిన ఈ ‘వైబ్రో అద్భుతాన్ని’ మీకు కళ్లారా చూపిద్దామనే ఎడ్రస్ కోసం పట్టుబట్టామని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆ మహిళ నెలల తరబడి సెలవుల్లో ఉండడం పద్దతి కాదని తన ఉద్యోగానికి రాజీనామా చేద్దామని కూడా నిర్ణయించుకున్నతరుణంలో ఆమె ఒoటరిగా కన్నీళ్ళతో స్వామిని వేడుకొన్న ప్రార్ధనలు ఫలించి ఈ వైబ్రోఅనే అమృతం రూపంలో తన అంగ వైకల్యము నుండి కాపాడారని చెప్పారు. జై సాయిరాం.
రెండవ అనుభవము:
ఆ రోజులలో (2007లో) మా నాగపూర్ సమితి ఇక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాన్వాడి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని సత్యసాయి మెడికేర్ వ్యాన్ ద్వారా నెలకు రెండుసార్లు అలోపతిక్ మందులు ఇచ్చేవారము. నేను వాలంటీర్ గా చురుకుగా ఆ సేవలో పాల్గొంటూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి మా వ్యాన్లో మందులు ఐ పోయేవి. మేము వినయంగా ఆ గ్రామస్తులతో విషయం చెప్పి త్వరలోనే మందులు తెచ్చిఇస్తామని చెప్పేవారము.
మా నాగపూర్ సేవాదళ్ ప్రతీ సంవత్సరం (ఇప్పటికీ కూడా) మార్చి మరియు సెప్టెంబర్లో ప్రశాంతినిలయం సేవకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినపుడు వీరిలో కొందరు డాక్టర్ అగ్గర్వాల్ గారివద్ద నుండి వైబ్రో రెమిడి లు తెచ్చుకొని అద్భుతాలు సాధించేవారు.
ఇదే సమయంలో వైబ్రో శిక్షణ కోసం ఆసక్తి ఉన్న సాయి భక్తులు రావచ్చని పిలుపు రావడం 2008 నాగపూర్ నుండి ఐదుగురు ధర్మక్షేత్రంలో AVP శిక్షణ విజయవవంతంగా ముగించుకొనడం జరిగింది. ఆనందకరమైన విషయం ఏమిటంటే పేషంటుకు నయాపైసా కూడా ఖర్చు లేదు, మందులిచ్చే వారి ఖర్చు నామమాత్రమే. ఇప్పుడు మేము మెడికల్ క్యాంపులకు వెళ్ళినపుడు మందులు ఐపోయాయని తెల్లమొహం వేసుకొని రావక్కరలేదు. ఈ వైబ్రో మందులతో ఎంతమందికైనా వైద్యం అందించవచ్చు.
ముంబాయి నుండి వచ్చిన తర్వాత మా సత్యసాయి మెడికేర్ వ్యాన్ తో పాన్వాడి గ్రామంలో మొట్టమొదటిసారిగా వైబ్రో క్యాంపు పెట్టాము. మాకివ్వబడిన 54 CC కిట్లు (ఆ రోజుల్లో AVPలకు 54 CC బాక్స్ లు ఇచ్చేవారు), గోళీలు, మందు సీసాలు, స్టిక్కర్లు, రెడ్ బుక్ (మాకిచ్చిన గైడ్) అన్నీ తీసుకొని పాన్ వాడి గ్రామం వెళ్ళాము. మొదటిసారిగా ఎవరినీ నిరాశతో పంపకుండా 36 మందికి వైబ్రో మందులు, 100 మందికి అలోపతి మందులు ఇచ్చి ఆనందంతో ఇంటికి చేరాము. మా ఐదుగురము మాలో మేము ఎటువంటి స్వానుభవాలు, అభిప్రాయాలూ, వ్యక్తపరుచుకోకుండా తర్వాత క్యాంపు ఎప్పుడువస్తుందా అని ఎదురు చూడసాగాము. ఎందుకంటే ఈసారి క్యాంపులో పేషంట్లు అలోపతి వైపు మొగ్గు చూపుతారా, వైబ్రో మందులు అడుగుతారా తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది.
మాకెంత ఆశ్చర్యం అయ్యిందంటే మేము వైబ్రో మందులు ఇచ్చిన 36 మంది పేషంట్లకు నయమయ్యింది. ముఖ్యంగా మలబద్ధకం, చర్మవ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, జలుబు దగ్గు ఇటువంటి వాటికి మేమిచ్చిన రెమిడి లు అందరికీ చక్కగా పనిచేశాయి. దీనితో వైబ్రో పేషంట్ల సంఖ్య 54కు పెరిగింది. ఆవిధంగా తరువాత క్యాంపులలో వైబ్రో పేషంట్ల సంఖ్య అలోపతి పేషంట్ల సంఖ్యకంటే పెరుగుతూ వచ్చింది.
ఒకసారి క్యాంపులో మా అలోపతి డాక్టర్ పేషంట్లను చూడడం త్వరగా ముగించుకొని వైబ్రో మందులిస్తున్న మా పక్కకి వచ్చి కూర్చున్నారు. తర్వాత తనకి కూడా వైబ్రో మందులు కావాలని అడిగి తీసుకోవడం మాకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.
ఈ విధంగా 12 గ్రామాలలో క్రమం తప్పకుండా వైబ్రో మరియు అలోపతి మందులు ఇస్తూ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాము. ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. జై సాయిరాం.
ప్రశ్నలు సమాధానాలు
1. ప్రశ్న: నా పేషంటులలో చాలా వరకు 60 సంవత్సరాల వయసు దాటిన వారే. వారందరికీ అనివార్యంగా మూత్రం/మలం వచ్చే సమస్య ఉండడంతో బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వారు పెద్దవారు ధరించే డయాపెర్స్ ధరించడం కానీ, మరుగు దొడ్లు ఉన్న ప్రదేశానికి మాత్రమే పనిమీద వెళ్ళడం గానీ లేదా తొందరగా పని ముగించుకొని ఇంటికి రావడం గానీ చేయవలసి వస్తోంది. అందువల్ల వీరు ఆత్మవిశ్వాసం కోల్పోయి సిగ్గుపడుతూ ఇంటిలోనే బందీగా ఉండిపోతున్నారు. వీరికోసం ఎదైనా రెమిడి ఉందా ?
జవాబు: వీరికి CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue (లేక SRHVP మీ వద్ద ఉన్నట్లయితే NM7 CB7 ) + CC4.6 Diarrhoea నీళ్ళవిరోచనాలు కూడా ఉన్నట్లయితే + CC13.1 Kidney & Bladder tonic ఒక వేళ మూత్ర విసర్జన స్వాధీనంలో లేకపోయినట్లయితే ఈ రెమిడి లు ఇవ్వండి.
వీటితో పాటుగా పేషంటు మాలా ద్వారం వద్ద నున్న స్ఫింక్తెర్లు (సంవరణి కండరాలు), మూత్రాశయ, మూత్రనాళములకు, బలం చేకూర్చే విధంగా ఎక్సర్సైజులు అనగా మలద్వారమును 9 సార్లు గట్టిగా పైకి లాగడం వదలడం ఇలా ఉదయము, రాత్రి పడుకునే ముందు చేసినట్లయితే ఫలితం ఉంటుంది. అలాగే బయటకు వెళ్లేముందు కూడా ఈ కసరత్తు రెండు సార్లు చేయడం, ఏమీ తినకుండా తాగకుండా వెళ్ళడంవల్ల కూడా ఫలితం ఉంటుంది.
_____________________________________
2. ప్రశ్న: హైపోథైరాయిడిజం వ్యాధి లేకుండా అధిక బరువుతో బాధ పడుతున్న వారికి ఏమైనా రెమిడి ఉందా? CC6.2 అనేది హైపోథైరాయిడిజం వ్యాధి ఉండి అధిక బరువు ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని నా అభిప్రాయం.
జవాబు: వాస్తవానికి CC6.2 Hypothyroid, హైపోథైరాయిడిజం వ్యాధి ఉన్నా లేకపోయినా అధిక బరువు తగ్గించడానికి ఉపయోగకరమైనదే. ఏ రెమిడి ఐనా 108CC పుస్తకంలో చేర్చిన ఆ రెమిడి తాలూకు అన్ని వ్యాధులకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు కావాలనుకుంటే CC15.4 Eating disorders ను కూడా కలపవచ్చు. రెమిడితో పాటు మీ పేషంటుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి, ఎక్సెర్సైజ్ అనగా కసరత్తుల గురించి చెప్పాలి. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగడం తాజా సలాడ్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది. భోజనం పూర్తి చేయడానికి తగినంత సమయం తీసుకోవడం, అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతీ ముద్దను 32 సార్లు నమిలి మింగడం మంచిది.
_____________________________________
3. ప్రశ్న: 108CC బాక్స్ లో కార్పాల్ టన్నెల్ సిండ్రోం (CTS) అనగా మీడియన్ నరం వత్తిడికి నలిగిపోవడం జరిగితే దానికి రెమిడి ఇవ్వబడింది. ఈ రెమిడి ఏవిధంగా అ నరాన్ని తిరిగి మాములు స్థితికి తీసుకు వస్తుంది ?
జవాబు: CTS, అనగా మీడియన్ నరం ఎముకల లో ఒక వెడల్పైన పట్టీ గుండా (దీనినే కార్పాల్ టన్నెల్ అంటారు) పోతుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ స్నాయువు త్రోవలో (టన్నెల్ లో) కణజాలమునకు వాపు కలిగినప్పుడు ఈ నరము వత్తిడికి గురయ్యి CTS కలిగిస్తుంది. CC20.3 Arthritis ద్వారా మనం అందించిన ఆరోగ్యకరమైన కంపనాలు దానికి సంబంధించిన మైనర్ చక్రాలను సమతుల్యం చేస్తుంది. ఫలితంగా వాపు తగ్గిపోయి నరము సాధారణ స్థితికి చేరుతుంది. ఇలా వైబ్రేషణ్ను వ్యాధి ప్రారంభ దశ లోనే ఇచ్చినట్లయితే ఇంకా బాగా పనిచేస్తుంది.
_____________________________________
4. ప్రశ్న: వైబ్రేషణ్ ను నీటితో తయారు చేస్తున్నప్పుడు ఈ రెమిడిని ఓపెన్ గ్లాస్ లో ఉంచవచ్చా? ఇలా ఉంచడం వల్ల రెమిడి ఆవిరై పోయే ప్రమాదం ఉందా?
జవాబు: లేదు, రెమిడి ని ఓపెన్ గ్లాస్ లో ఉంచడం వల్ల వైబ్రేషణ్ ఆవిరి కావు. అవి ఉన్న మీడియం లో అంతర్భాగమై పోతాయి. ఐతే ఈ మీడియం ఆవిరై పొతే దానితో పాటు వైబ్రేషణ్ కూడా ఆవిరై పోయే ప్రమాదం ఉంది.
_____________________________________
5. ప్రశ్న: మా ఇంట్లో టివి మరియు వైఫై పక్క పక్కనే ఉన్నాయి. వీటి కనెక్షన్ స్విచ్ లను చాలా దళసరిగా ఉండే ప్లాస్టిక్ కవర్ తో ముసేసాను. ఇప్పుడు వీటి దగ్గరగా SRHVP మరియు 108CCబాక్స్ లను ఉంచవచ్చా?
జవాబు: వైఫై మోడెమ్ కనుక స్విచ్చులతోకలిపి ఉన్నట్లయితే అప్పుడు రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక SRHVP మరియు 108CCబాక్స్ లను వీనికి దగ్గర లో ఉంచరాదు. స్వల్ప వ్యవధి కోసం ఐతే మాత్రం SRHVPఉంచవచ్చు కానీ శాశ్వతంగా మాత్రం ఉంచరాదు. దళసరిగా ఉండే కవర్ వల్ల స్విచ్చులను మూసినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. రేడియేషన్ దగ్గరగా లేకుండా చేయడం అనేది ప్రధానం.
_____________________________________
6. ప్రశ్న: నా కేన్సర్ పేషంటు రెమిడి తీసుకుంటున్న రోజులలో మాంసాహారం, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చా ?
జవాబు : మాంసాహారము, పాలఉత్పత్తులు వైబ్రేషన్లను తటస్తికరించలేవు. అందువలన అవి ప్రభావవంతంగానే పని చేస్తాయి. కానీ కేన్సర్ పేషంట్లు వీటిని తిసుకోవచ్చా అనేది ప్రత్యేక అంశము.
వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
“నీవు ఇతరులెవరికైనా నమస్కరిస్తే నీకు నీవే నమస్కరించినట్లు ఔతుంది. ఎందుకంటే ఆ ‘’ఇతరులు’’ నీ ప్రతిబింబమే కనుక. కనుక దర్పణం లో నిన్ను నీవు చూసుకున్నట్లే ఇతరులను కూడా నీ ప్రతిబింబమే అనే భావనతో చూడు. నీ చుట్టూ ఎన్నో అద్దాలు ఉన్నప్పుడు నీ ప్రతిబింబములు కూడా ఎన్నో కనిపిస్తాయి. కానీ నీవు ఒక్కడివే కదా. ప్రతిబింబాలు వేరు, రూపం ఒకటే. ప్రతిబింబాలు, ప్రతిచర్యలు, ప్రతిధ్వనులు వేరు కానీ వాస్తవం ఒకటే. అలాగే రూప నామాలు వేరు కావచ్చు. కానీ అన్నింటిలో ఉన్న దివ్యత్వము ఒక్కటే. ఆ దివ్యసూత్రానికే ఈ దృశ్య ప్రపంచమంతా కట్టుబడిఉంది. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నా వాక్కు ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్క లౌడ్ స్పీకరులోనూ వినిపిస్తూ ఉంది. అలాగే అందరి హృదయాలలోనూ ఉన్న దివ్యత్వము ఒక్కటే అనేది మీరు గుర్తించి వర్తించాలి. ”
…శ్రీ సత్యసాయిబాబా దివ్య ప్రవచనము మే 13, 2006
ప్రకటనలు
రాబోయే కాలంలో సదస్సులు
- ఇండియా బెంగుళూర్ , కర్ణాటక: వార్షిక శిక్షణా శిబిరము, 19 జూలై 14, సంప్రదించాల్సిన వ్యక్తి [email protected]
- ఇండియా కొచ్చిన్, కేరళ: AVP శిక్షణా శిబిరం 2-3 జూలై 2014 , సంప్రదించవలసిన వ్యక్తి రాజేష్, ఈ-మెయిలు: [email protected]. లేదా ఫోను నంబెర్: 8943-351 524 / 8129-051 524
ట్రైనర్లకు సూచన: మీ యొక్క వర్క్ షాప్ వివరాలను మాకు పంపండి : [email protected]
అదనపు సమాచారం
ఆరోగ్య చిట్కాలు
సాయి వైబ్రియోనిక్స్ అందించే ఆరోగ్య సమాచారము, కథనాలు విజ్ఞానము నిమిత్తమే. దీనిని వైద్య సలహాలుగా భావించరాదు. మీ పేషంట్ల యొక్క ప్రత్యేక వైద్య పరిస్థితి నిమిత్తం తమ తమ వైద్య నిపుణులని సంప్రదించ వలసిందిగా సూచించండి.
మెగ్నీషియం ఖనిజం యొక్క ఉపయోగాలు మరియు మీ ఆరోగ్య పరిరక్షణలో దీని ప్రాముఖ్యత
మెగ్నీషియం ఇది మన శరీరంలో పుష్కలంగా లభించే ఈ ఖనిజము సహజంగా ఎన్నో ఆహార పదార్ధాలలోనూ అనుబంధ ఆహార ఉత్పత్తులలోనూ, కొన్ని రకాల ఔషధాల లోనూ (యాంటాసిడ్స్& లాక్జేటివ్స్) లభ్యమవుతుంది. మెగ్నీషియం లేకపోతే మన దేహం శక్తిని ఉత్పత్తి చేయలేదు, మన కండరాలు శాశ్వతంగా కుంచించుకుపోయి ఉంటాయి, ఇంకా మన రక్తం లోనికి విడుదలయ్యే కొవ్వు శాతాన్ని నియంత్రించడం కూడా అసాధ్యమే.
ఇది మనశరీరం లో జరిగే శక్తి స్థాయిలను క్రమబద్ధీకరించడం, విశ్రాంతిగా ఉండడానికి దోహద పడడం, గుండె మరియు రక్త నాళముల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం వంటి 300 రకాల రసాయనిక చర్యలకు అవసరం.
మెగ్నీషియం లోపం మన శరీరంలో అస్తమా, మధుమేహం, బోలుఎముకలవ్యాధి వంటి అనేక రుగ్మతలను కలిగిస్తుంది. తగు పాళ్ళలో దీనిని తీసుకున్నట్లయితే గుండెజబ్బులకు దూరంగా ఉంచుతుంది.
మెగ్నీషియం మన DNAను సంరక్షిస్తుంది
మెగ్నీషియం లోపం మన DNA సంశ్లేషణను నెమ్మదింప చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. DNA పటుత్వము మనం తీసుకునే మెగ్నీషియం మీదే ఎక్కువ ఆధారపడిఉంటుంది. మెగ్నీషియం DNA నిర్మాణాలను స్థిరపరచడమే కాక జన్యుపరమైన లోపo వల్ల DNA క్షయమవడం నిరోధించడంలో సహాయకారిగా పనిచేస్తుంది. మెగ్నీషియం ATP తో కలిసి మన శరీరంలో ప్రోటీన్ల ఉత్పత్తికి, DNA నిర్మాణం చదవడానికి కారణమైన RNA ఉత్పత్తికి కూడా కారణమవుతున్నది.
మెగ్నీషియం మన శరీరంలోని విద్యుత్వాహక సమతౌల్యమును క్రమబద్ధీకరిస్తుంది
మన శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల సమతౌల్యం కాపాడడం ద్వారా విద్యుత్వాహకత్వానికి, కండరాల సంకోచ వ్యాకోచాలకు, హృదయ స్పందనకు ఈ మెగ్నీషియం ప్రధాన భూమిక నిర్వహిస్తోంది.
రక్తము, హృదయము, ఎముకల పటిష్ట స్థితికి మెగ్నీషియం
ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం బాగా తీసుకోవాలని మనం తరుచుగా వింటూఉంటాము. అలాగే ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణానికి మెగ్నీషియం పాత్ర కూడా ఎంతో ఉంది. సాధారణంగా ఎముకల గట్టిదనానికి కాల్షియం మాత్రలు తీసుకుంటూ ఉంటారు కానీ బోలుఎముకల వ్యాధి రాకుండా ఉండాలంటే కాల్షియం కంటే మెగ్నీషియం ఎక్కువ తీసుకోవడం మంచిది.
మానవ హృదయానికి మెగ్నీషియం అతి ముఖ్యమైన పోషక పదార్ధము. గుండె కండరాలు పటిష్టంగా పనిచేయడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. రక్తకణాల నిర్మాణంలోనూ, రక్తాన్ని పలచన పరచడం లోనూ దీని పాత్ర ఎంతో ఉంది కనుక గుండెజబ్బుల నిరోధానికి ఇదెంతో ఉపకరిస్తుంది.
మెగ్నిషియం మరియు మధుమేహ వ్యాధి
మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ప్రత్యేకంగా మధుమేహ సమస్య నుండి దూరంగా ఉంచుతుంది ఎందుకంటే గ్లూకోజ్ జీవక్రియలో మెగ్నీషియంకి ప్రముఖ పాత్ర ఉంది. హైపోమెగ్నీసేమియా (మెగ్నీషియంలోపం) ఇన్సులిన్ సమస్యకు దోహద పడుతుంది తిరిగి ఇదే మధుమేహ వ్యాధికి దారితీస్తుంది. మధుమేహం మూత్రం ద్వారా ఎక్కువ మెగ్నీషియం శరీరం నుంచి వెళ్లిపోయేటట్లు చేస్తుంది. ఆవిధంగా ఏర్పడే మెగ్నీషియంలోపం ఇన్సులిన్ తగు మోతాదులో శరీరంలో ఉండకుండా చేస్తుంది. అందువలన మధుమేహం అదుపులో ఉండకుండా ఇంకా జటిలమైయ్యే అవకాశం ఉంది.
మెగ్నిషియం లోపం లక్షణాలు
- జాయింట్లు మరియు కండరాల నొప్పులు
- వాపు
- ఆకలి లేకపోవడం వికారము
- తిమ్మిరులు మరియు వళ్ళు జలదరింపు
- మైగ్రేన్ తలనొప్పి
- అలసట
- సాధారణమైన నీరసం
- బోలు ఎముకల వ్యాధి
- రక్తంలో చక్కర శాతం నిలకడ లేమి
- అధిక రక్త పోటు
ఇటివలే వెలువడిన నూతన అధ్యయనాలు మెగ్నీషియం లోపం మన మానసిక భావోద్వేగములపైన కూడా ప్రభావం కలిగిస్తుందని తెలుపుచున్నాయి. ఎవరైతే నిద్రలేమితో, డిప్రెషన్, భావోద్వేగ అలజడులతో బాధ పడుతున్నారో వారి ఆహారంలో మెగ్నీషియం శాతం పెంచడం ద్వారా మంచిఫలితాలు కలిగాయి. అలాగే వారి భయాందోళనలు అభద్రతా భావం ఇవికూడా తగ్గుముఖం పట్టాయని సూచిస్తున్నాయి. శాస్త్రవేత్తలు మెగ్నీషియంను తక్కువ అంచనా వేయడానికి దాని ప్రాముఖ్యత గ్రహించలేకపోవటానికి మరో కారణం రక్తపరీక్ష ద్వారా మెగ్నీషియంశాతం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే రక్తంలో మెగ్నీషియంశాతం ఉండేది ఒక్క శాతమే. కనుక రకరకాల తాజా పళ్ళు తినడంవల్ల మెగ్నీషియంలోపం నుండి దూరంగా ఉండవచ్చు.
మెగ్నీషియం లోపానికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు
- 55 సంవత్సరాలకు పైబడినవారు
- ప్రతీరొజూ ఆల్కహాల్ తీసుకునేవారు, కెఫీన్ తో కూడిన పానీయాలు లేదా సోడాలు తీసుకునే వారు
- మూత్ర విసర్జనకు సంబంధించిన, గుండెజబ్బులకు, ఆస్తమాకు, సంతాన నియంత్రణ, ఈస్ట్రోజెన్ భర్తీకి చెందిన మందులు, ఇటువంటివాటికి సంబంధించిన మందులు తీసుకునేవారు
- మానసికమైన, శారీరక మైన వత్తిడికి గురైన వారు, లేదా శస్త్రచికిత్స, కాలిన గాయాలు, లివరుకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు
- జీర్ణ సంబధమైన వ్యాధులున్నవారు
మెగ్నీషియం ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్ధాలు
1. పొట్టు – ధాన్యము, గోధుమలు, ఓట్లు
2. మూలికలు – ధనియాలు, కొత్తిమిర, కింజల్కము, పుదీనా, మెంతులు, సబ్జాలు మరియు తులసి
3. విత్తనాలు – గుమ్మడి, ప్రొద్దుతిరుగుడు, అవిశగింజలు, నువ్వులు
4. గింజలు – బాదం గింజలు, బ్రెజిల్ నట్ లు, జీడిపప్పు మరియు దేవదారు గింజలు
5. నల్లని చాక్లెట్లు
మెగ్నీషియం పుష్కలంగా లభించే ఇతర పదార్ధాలు: పాలకూర, క్యాబేజీ, ఎండిన చిక్కుడు విత్తనాలు, ధాన్యములు, బ్రెడ్, అపరాలు.
ఇంతేకాక తగినంత కాల్షియం, విటమిన్ D మరియు విటమిన్ K ఉన్నట్టి ఆహారము తీసుకొన్నట్లయితే మెగ్నీషియం యొక్క పూర్తి ఫలితాలు పొందవచ్చు. సమతుల్యం గల ఆహారం, సంధ్యా సమయాలలో సూర్య రాశ్మికి లోనుకావడం ఇవికూడా మన దేహానికి అవసరమే.
ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకొనుటకు ఆ ఆహార పధార్ధాల నుట్రీయేంట్ రేటింగ్ చార్ట్ ను చూడండి
మూలములు:
http://ods.od.nih.gov/factsheets/Magnesium-HealthProfessional/
http://www.ancient-minerals.com/magnesium-benefits/what-is-function/
http://www.doctoroz.com/blog/daniel-heller-nd/magnesium-miracle-mineral
http://en.wikipedia.org/wiki/Magnesium
http://undergroundhealthreporter.com/magnesium-health-benefits/#axzz34AqqR6IE
http://www.whfoods.com/genpage.php?tname=nutrient&dbid=75
డెంగ్యు జ్వరమా! నీవు ప్రమాదంలో ఉన్నావా ?
డెంగ్యు అనే అత్యంత బాధాకరమైన జ్వరం ( డెంగ్-గే అని పలకబడుతుంది) శతాబ్దాల తరబడి మానవాళికి హాని కలిగిస్తూ ఉన్నప్పటికీ 1980లో అనూహ్యంగా ఇది ఉధృతంగా విస్తరించ సాగింది. ఇటీవలి దశాబ్దాలలో డెంగ్యు కేసులు కూడా నాటకీయంగా పెరగసాగాయి. ప్రపంచ వ్యాప్తంగా 2.5 మిలియన్ల ప్రజలు అనగా సుమారు 40% డెంగ్యు బారిన పడినట్లు అంచనా. ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధి గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.
డెంగ్యు అంటే ఏమిటి? డెంగ్యు అనేది ఏడిస్ ఎజిప్టి అనే ఉష్ణమండలపు ఆడ దోమ ద్వారా తీసుకుపోబడే నాలుగు రకాల వైరస్ లలో ఏ ఒక్కదానితో నైనా కలిగే ఫ్లూ వంటి జ్వరము. ఈ దోమలు డెంగ్యు, చికెన్గున్యా, ఎల్లో ఫీవర్ మరియు ఇతర వ్యాధులను కలిగించే వైరస్లను చేరవేస్తాయి. ఈ దోమలను తెల్లనిమచ్చలు గల కాళ్ళు రొమ్ముభాగంలో గీతలలాంటి వాటి ద్వారా గుర్తించవచ్చు. ఈ దోమలు ఆఫ్రికా ఖండంలో ప్రవర్ధమానమైనా ఆ తర్వాత ప్రపంచములోని ఇతర ఉష్ణమండల, ఉప ఉష్ణమండలపు ప్రాంతాలకు విస్థరించాయి.
ఉత్తరాది ప్రాంతంలో ఈ దోమ ఆసియా టైగర్ దోమ లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే చల్లని వాతావరణానికి కూడా ఇది తట్టుకోగలదు. దీనికి నలుపు తెలుపు మచ్చలు గల కాళ్ళు, అదేరంగు గీతలు గల శరీరము ఉంటుంది. ఇది దక్షిణాసియా ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతానికి చెందినప్పటికీ గత రెండు దశాబ్దాలలో అంతర్జాతీయంగా ఎగుమతి దిగుమతి చేయబడే వస్తువులద్వారా ప్రపంచమంతా విస్తరించింది. ఈ దోమ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతుల వారికి ఇబ్బంది కలిగించే రీతిగా తయారవడానికి కారణం ఇది ఉష్ణమండల (చిత్తడి ప్రాంతాలకంటే కూడా) ప్రాంతాలలో ప్రబలుతోంది. ఇది రాత్రిపూట కంటే పగలే వ్యాధికారక వైరస్ ను చేరవేస్తుంటుంది. ఈ దోమను టైగర్ మస్కిటో అనడానికి ప్రధాన కారణం దీనికున్న చారలు పులిని పోలిఉంటాయి. వ్యాధి బారిన పడ్డ మానవులు మరొకరికి నేరుగా హాని కలిగించలేరు. కానీ వీరిని కుట్టిన దోమలు ఆ వైరస్ ను ఆరోగ్యవంతమైన వారికి చేరవేయడం ద్వారా హానికలిగిస్తాయి.
ఎక్కడ ఈ వ్యాధి ఎక్కువగా ఉంది? ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికాలో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే ఉష్ణమండలపు వాతావరణం ఈ దోమలు ప్రబలడానికి అనుకూలంగా ఉందికనుక. ఇంతేకాకుండా ఈ సమస్య ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికామరియు పడమర పసిఫిక్ ప్రాంతాలలో కూడా ఉంది. ఇంకా ఈ సమస్య యూరప్ లోని కొన్ని భాగాలూ, రష్యా మరియు అమెరికాలోని మెక్సికన్ సరిహద్దుకు సమీపముగా ఫ్లోరిడా ప్రాంతంలో కూడా ఉంది.
వ్యాధి లక్షణాలు ఏమిటి? అమెరికాలోని సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షణ్ సంస్థ ప్రకారము ఈ వ్యాధికి గురైన వారిలో సగం మందికి వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించవు. కాన్ని మిగతా సగం మంది అంతా అదృష్ట వంతులు కారు. ఎందుకంటే దీని బారిన పడ్డవారికి తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు శిశువులకు, పిల్లలకు, పెద్దవారికి కూడా కలుగుతున్నాయి.
డెంగ్యు గురించి ఎప్పుడు ఆలోచించాలంటే జ్వర తీవ్రత (40°C/ 104°F) ఉండి తీవ్రమైన తలపోటు, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు జాయింట్లు నొప్పులు, తలతిప్పుడు, వాంతులు, గ్రంధుల వాపు లేదా దద్దుర్లు, వీటిలో ఏ రెండు లక్షణాలు ఉన్నా అది డెంగ్యుగా భావించవచ్చు. ఈ వ్యాధి కలిగినప్పుడు ఎముకలు విరిగి పోతున్న బాధ కలుగుతుంది కనుకనే దీనిని ఎముకలు పగిలే వ్యాధి (బ్రేక్ బోన్ ఫీవర్) అని కూడా అంటారు. వ్యాధి కారక దోమ కరిచిన 4-10 రోజుల వరకు రోగ లక్షణాలు రాకుండా ఆ తరువాత సుమారు 2-7 రోజుల వరకూ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
తీవ్రమైన డెంగ్యు వ్యాధి వలన రక్తంలో ప్లాస్మాతగ్గిపోవడం, ద్రవ శాతం పెరుగుదల, శ్వాశకోశ ఇబ్బంది, తీవ్ర రక్తస్రావం, అంగలోపము ఇలాంటిది ఏదో ఒకటి కలిగి ప్రాణాంతకమవుతుంది. తీవ్ర వ్యాధి యొక్క హెచ్చరిక లక్షణాలు తొలి వ్యాధి లక్షణాలు కనపడిన3-7 రోజులకు కనపడతాయి. అవి శరీర ఉష్ణోగ్రత తగ్గుదల (38°C/ 100°F కంటే తక్కువ ) తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు, వేగంగా శ్వాశ తీసుకోవడం, రక్తం పడడం, నీరసం, రక్తవాంతులు వంటివి. ఆ పైన 24–48 గంటలు చాలా విలువైనవి. ఈ సమయంలో సరియైన వైద్యం అందకపొతే ప్రాణానికే ప్రమాదం.
ఎంత తీవ్రమైనది? ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రతీ సంవత్సరం ఈ వ్యాధి బారిన పడుతుంటే వీరిలో చాలామంది 2-7 రోజులలో కోలుకుంటున్నారు. కొందరికి మామూలు జ్వరం కొంచం తగ్గగానే, ఈ వ్యాధి యొక్క ఇంకో తీవ్రమైన రకం - హీమోరేజిక్ ఫీవర్ అనేది వస్తోంది. దీనివల్ల అత్యంత ప్రాముఖ్యత గల అవయవాలు పాడయి పోవడం, రక్తస్రావము, డిహైడ్రేషన్ కలుగుతాయి. చివరికి మరణము కూడా సంభవించవచ్చు. కానీ డెంగ్యుకు తొందరగా వైద్యం తీసుకున్నట్లయితే డెంగ్యు వ్యాధి శొకిన వారిలో ప్రస్తుతం నూటికి ఒక శాతం కంటే తక్కువ మందికి మాత్రమే మరణం సంభవించే అవకాశం ఊంది.
చికిత్స మరియు నివారణ? పేషంట్లకు వ్యాధి లక్షణాలను బట్టి మందులు ఇవ్వబడతాయి. వారు ఎక్కువగా నీరు త్రాగవలసి ఉంటుంది. ఐతే దీనికి ఇంకా సరయిన మందు కనుగొనబడలేదు. పరిశోధకులు తగిన వాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. (వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు మీ రెఫెరెన్స్ పుస్తకాలు పరిశీలించి డెంగ్యు జ్వరానికి సరిపడే కొమ్బో ను ఎంచుకోండి)
ఒకసారికన్నా ఎక్కువ సార్లు వస్తుందా? ఒకసారి మీరు డెంగ్యుకు గురయ్యి నివారణ పొందితే ఆ ప్రత్యేకమైన వైరస్ నుండి వ్యాధి నిరోధకత సాధించినట్లే, కానీ మిగతా మూడు వైరస్ ల నుండి కాదు. చాలా దేశాలు ఈ నాలుగు రకాల వైరస్ లకు స్వగృహాలు కనుక ఎవరైన రెండవసారి ఈ వ్యాధికి గురైతే వ్యాది లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పరిస్థితులను మరింత దిగజార్చడానికి డెంగ్యు వైరస్ ను చేరవేసే దోమలు, ఎల్లో ఫీవర్ మరియు చికెన్గున్యాలను కలిగించే వైరస్ లను కూడా చేరవేస్తాయి. అంటే ఒక్క కాటు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందన్నమాట.
ప్రస్తుత సంఖ్య ఎంత? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 50 నుండి 100 మిలియన్ల జనాభా (2013 అధ్యయనం ప్రకారం ఈ సంఖ్య 400 మిలియన్ల వరకూ ఉండొచ్చని అంచనా) ఈ ఇన్ఫెక్షన్ కి గురిఔతున్నట్లు అంచనా. ఒక్క అమెరికాలోనే 2003లో 5,20,000 గా ఉన్న సంఖ్య 2013 నాటికి 2.3 మిలియన్లకు పెరిగిందని అంచనా. 2014 జూన్ మధ్యలో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ల కోసం ఆతిధ్య దేశం బ్రెజిల్ వెర్రిగా డెంగ్యు చేరవేసే దోమలతో యుద్ధం చేసిందనే చెప్పాలి.
ఎందుకంత ఎక్కువ? ఈ విషయంలో మనం ప్రపంచీకరణ (గ్లోబలైజేషణ్)ను తప్పుపట్టవచ్చునేమో. దోమలు వ్యాపార సంబంధిత వస్తువులద్వారా ఒక చోటనుండి మరోచోటుకు బదిలీ ఐపోతున్నాయి. ఇలా దోమకాటుకు గురయిన ప్రయాణికుడు కూడా తనుండే ప్రాంతంలో ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాడు. నగరాలలో భవంతుల నిర్మాణంలో గొట్టాల ద్వారా నీటి సరఫరా ఉండదు కనుక నీరు నిలబడి దోమల వ్యాప్తికి కారణ మవుతున్నాయి.
ఎలా నిరోధించగలము? వీధులు, పరిసరాలు, చుట్టుపక్కల ఇళ్ళు వీటిలో దోమల మందులు చల్లటం, జెనిటిక్ గా అభివృద్ధి చేసిన దోమలు, దోమ కాటు నుంచి తప్పించుకోవడానికి దోమతెరలు, స్ప్రేయర్లు, పొడవైన చేతులు గల చొక్కాలు వాడడం మొదలైన పద్దతుల ద్వారా డెంగ్యు వ్యాధి బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
మూలములు:
www.WBUR.org
http://www.ask.com/wiki/Aedes_aegypti?o=2801&qsrc=999
http://www.ask.com/wiki/Aedes_albopictus?o=2801&qsrc=999
http://www.who.int/mediacentre/factsheets/fs117/en/
అల్పము & మధురము 1
వైబ్రియో నిపుణురాలు 10375...ఇండియా నా చిన్నప్పటినుండి కూడా డాక్టర్ లను వారు పేషంట్ లకు చేసే సేవలను చూసి విస్మ్యయం పొందేదాన్ని. నేను కూడా వారిలో ఒకరినై డాక్టర్ గా సేవలందించాలని కలలు కన్నప్పటికీ భగవంతుడికి మాత్రమే తెలిసిన కొన్ని కారణాలవల్ల నా ప్రస్థానం ఇంజినీరింగ్ వైపు మరలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గాస్థిరపడ్డాను.
చాలా సంవత్సరముల తర్వాత భగవదనుగ్రహం వల్ల రెకీ విధానం నేర్చుకునేందుకు అవకాశం రావడంతో ప్రత్యమ్నాయ వైద్య విధానాల వైపు నా దృష్టి మరలింది. తదుపరి 2008 డిసెంబర్ లో మొదటి వైబ్రో వర్క్ షాప్ గురించి ప్రకటన విన్నప్పుడు ఆఘ మేఘాల మీద AVPకోర్సుకు నమోదు చేయించుకుని దానిని పూర్తి చేశాను. 9 నెలల్లో JVP కోర్సు పూర్తి చేసి 2013లో SVP కోర్సు కూడా పూర్తి చేశాను. వైబ్రో థెరపీని ఆచరించడం నా జీవితానికి ఒక క్రొత్త అర్ధాన్ని ఇచ్చి పేషంట్లను చూసిన ప్రతీ సందర్భంలోనూ ఒక క్రొత్త అభ్యాసనానుభవాన్ని కలిగించేది. పేషంట్లు తిరిగి వచ్చి మీరిచ్చిన ‘’బాబామందు‘’ ఎంతో బాగా పనిచేసిందని కృతజ్ఞత తెలపడానికి వస్తే చెప్పలేని ఆనందం కలిగేది. పేషంట్ల ఫోన్ కాల్స్ స్వీకరించడం, వారి బాధలను ఓపికతో వినడం, వారికి స్వాంతన చేకూర్చే ప్రియవచనాలు చెప్పడం, మెడికల్ క్యాంపులకు హాజరు కావడం, ప్రతీ ఒక్కటీ అనందాన్ని రేకెత్తించేవే. పేషంట్ల యొక్క సమస్యలు విని దానికి కారణాలు అన్వేషించే ప్రతీ సందర్భంలోనూ నాకది కొత్త అనుభవమే, ఒకకొత్త పాఠమే. ఈ విధానం నాలో నా ప్రమేయం ఏమీ లేకుండానే సూక్ష్మమైన మార్పులు తీసుకువస్తున్నట్లు అనుభవమైనది.
SRHVP మిషన్ ఉపయోగిస్తూ బ్రాడ్ కాస్ట్ చేయడం ద్వారా ప్రతీ కార్డు ఎంత శక్తివంతమైనదో అవగాహన చేసుకోగలిగాను. అలాగే పేషంట్ల సమక్షంలో రెమిడి తయారుచేస్తునప్పుడు దీనిలో కేవలం వైబ్రేషణ్ తప్ప మందు ఏమిలేదని తెలుసుకొని వారెంతో ఆనందించేవారు.
నేను నేర్చుకున్న కొన్ని అంశాలు మీ ముందుంచుతున్నాను:
- నా 5 ½ సంవత్సరాల వైబ్రో సాధనలో నేను నేర్చుకున్న గొప్ప అంశం ఏమిటంటే పవిత్ర హృదయంతో ప్రార్ధిస్తే స్వామి తప్పక వింటారు, అద్భుతాలు సృస్టిస్తారు.
- రెమిడిల విషయంలో SM39 Tension దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు నేను తెలుసుకోగాలిగాను. ఎందుకంటే నా విషయంలోనే ఇది ఉపయోగించిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చింది. నా పేషంట్లు దీనిని ఉపయోగించిన తర్వాత వారిలో ఎంతో మార్పు వచ్చిందని, వారిలో ప్రేమ, అనురాగం ఆప్యాయంగా మాట్లాడడం ఇలా ఎంతో మార్పు వచ్చిన్నట్లు చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈవిధంగా వారి అభిప్రాయం తెలుసుకోవడం వైబ్రో విధానంలో ఒక ముఖ్యమైన విషయము. దీనివల్ల స్వామి ప్రతీ ఒక్కరిలోనూ ఏ విధంగా మార్పు తీసుకువస్తున్నారు అనేది అర్ధమవుతుంది.
- పేషంటు చెప్పిన విషయాలను ఓపికతో వినడం, వారిలో నమ్మకాన్ని కలిగించడం, ప్రేమతో మాట్లాడడం చేయడం వల్ల వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగి సగం జబ్బు అప్పుడే మాయమైపోతుంది.
- పేషంట్లను చూసేటప్పుడు, కౌన్సలింగ్ నిర్వహించే సందర్భంలోనూ నాకు కొత్త ఐనప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల అంతా తెరిచిన పుస్తకం లా ఉండేది. నేను వైద్యశాస్త్రరీత్యా ప్రావీణ్యత కలిగిన డాక్టర్ని కాకపోయినప్పటికీ వైబ్రో విధానం ద్వారా నా కోరిక తీర్చిన స్వామికి ఎంతో కృతజ్ఞతలు. స్వామి ఈ రోజు వరకూ 4200 పేషంట్లను చూసే అవకాశం ఇచ్చారు. ఈ విధంగా సేవచేయడం ద్వారా నాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పగలను.
ప్రాక్టీ షనర్ 01616...క్రొయేషియ మా అమ్మ వైబ్రో విధానాన్ని నమ్మేవారు కాదు. ఆమెకు 79 సంవత్సరాల వయసులో ఒకరోజు సాయంత్రం 9 గంటలకు పంటినొప్పి వచ్చింది. తక్షణమే ఆమెకు ఎదైనా చికిత్స చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు గుండెలో కృత్రిమ వాల్వ్ ఏర్పాటు చేయబడింది. పంటిని తొలగించాలంటే ౩ రోజులముందు నుండి సిద్ధము చేసుకుంటూ రావాలి. నేను ఆమెకు CC11.6 Tooth infections ఇచ్చి ప్రతీ 15 నిమిషాలకు వేసుకోవాలని సూచించాను. వెంటనే పంటి నొప్పి మాయమయ్యింది. కొద్దీ రోజులకు మంట కూడా పోయింది. ఆమె కనీసం ఒక్కసారి కూడా దంత వైద్యుని దగ్గరకి వెళ్ళే అవసరం రాలేదు. ఈ సంఘటన తో మా అమ్మలో ఎంతో మార్పు వచ్చి ప్రతీ ఆరోగ్య సమస్యకు వైబ్రియోనిక్స్ తీసుకోవడంతో పాటు తనకు తెలిసిన వారందరికీ ఈ మందులు తీసుకోమని ప్రోత్సహిస్తోంది.
కొంత కాలం తర్వాత ఆమెకు గుండెకు సంభందించిన సమస్యలు వచ్చి హాస్పిటల్లో చేరింది. అక్కడ ఆమె పరిస్థితి విషమం గామారడంతో ఇంటికి తీసుకురాబడింది. కానీ కనీసం కళ్ళు తెరిచి చూసే పరిస్తితి లేదు. దీనితో ఒక నెల పూర్తిగా CC7.1 Eye tonic + SR291 Gelsemium + SR359 Zincum Met…TDS. ఇచ్చాను. ప్రతీ ఒక్కరూ ఆశర్య పడే విధంగా ఆమె చక్కగా కోలుకునే సరికి నా కుటుంబ సభ్యులు ఇది ఒక అద్భుతంగా భావించారు. ఇప్పుడు నేను కేవలం ఏవో చిన్న గోళీలు ఇచ్చే వ్యక్తిగా కాక అద్భుతాలు చేసే వైబ్రియోనిక్స్ ప్రతినిధిగా భావిస్తున్నారు.
వైబ్రియో నిపుణురాలు 01626...గ్రీస్ ను పరిచయం చేస్తున్న వైబ్రియో నిపుణురాలు 03101...గ్రీస్ గ్రీస్ లో జరిగే ఒక సదస్సుకు హాజరయ్యి జూనియర్ ప్రాక్టీషనర్ గా కావలసిన ఈమె దురదృష్టవశాత్తూ కాలు విరిగి పేషంటుగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. సదస్సు జరుగుతున్నంత కాలము ఆమె బహుశా తను ఇక వైబ్రో సేవను కొనసాగించలేకపోవడమో లేక చాల తక్కువ స్థాయి లో చేయవలసి రావడమో ఔతుందని భావించారు. కానీ స్వామి అనుగ్రహం మరోలా ఉండడంతో సదస్సు మొదటి రోజునే ఆమె అద్భుత 108 బాక్స్ ను ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చేసరికి తనకు కాలు విరిగినందుకు సహాయం అందించాలని భావించిన ఈ ప్రాక్టీషనర్ మరిలినా అత్తగారు వాంతులతో ముఖం అంతా పాలిపోయి పచ్చగా మారిపోయి పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నారు. గత రాత్రంతా ఆమెకు వాంతులు, విరోచనాలు కావడంతో నిర్జలీకరణ –డిహైడ్రేషన్ కు గురయ్యి నీరసంగా నేలమీద పడిఉన్నారు. మెరిలినా వెంటనే CC4.8 Gastroenteritis మరియు CC10.1 Emergencies 200 ml నీటిలో రెండు చుక్కలు వేసి అత్తగారి చేత త్రాగించారు. అలా రెండుసార్లు ఇచ్చిన తర్వాత ఆ రోజుకు 6TD గానూ మరునాటికి TDS గానూ ఆ తర్వాత రోజు OD గానూ ఇవ్వడంతో ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఆమె క్రింద పడినప్పుడు దెబ్బ తగలడంతో రెండు గంటల తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో మెరిలినా CC10.1 Emergencies + CC20.7 Fractures…TDS వారం రోజుల పాటు ఇవ్వడంతో అది కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ మొదటి అనుభవంతో ప్రాక్టీషనర్ కు సంశయములన్నితొలగి ఏ సందర్భంలో నైనా వైబ్రియోనిక్స్ ఎంత బాగా పనిచేస్తాయో అనుభవమయ్యింది.
అల్పము & మధురము 2
“ఓం మంత్రం ద్వారా పొందగలిగే ఉపశమనము”: ఈ మంత్రోచ్చారణ ద్వారా వాపులు తగ్గుతాయి. సైఖోన్యూరోఎండోక్రినాలజి పత్రికలో అచ్చైన ఒక చిన్న అధ్యయనం ప్రకారం 2012 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చిత్త వైకల్యము (డిమెంషియా)తో బాధపడే 45 మందిని రెండు గ్రూపులుగా చేసి ఒక గ్రూపుకు 8 వారాలపాటు రొజూ 12 నిమిషాలసమయం ఓంకార ధ్యానంతోనూ మరొక గ్రూపుకు 12 నిమిషాల సమయం విశ్రాంతి కలుగజేసే CDని వినిపించారు. రక్త పరిక్షల ద్వారా తెలిసిన అంశం ఏమంటే ఓంకార ధ్యానం చేసిన వారి వాపులు చాలా వరకు తగ్గినట్లు సూచికలు తెలిపాయి.
Om Sai Ram