Vol 17 సంచిక 3
మే / జూన్ 2026
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
2011 ఏప్రిల్ 24న మన ప్రియమైన సత్యసాయి బాబా మహాసమాధిని స్వీకరించి పదిహేనేళ్లు గడిచాయి. అయినప్పటికీ, తన అనంత ప్రేమ మరియు కరుణతో, మన జీవితాలకు మార్గదర్శకంగా నిలిచే, అలాగే మన జీవితాలను ఆయన దివ్య కార్యానికి అంకితం చేయడానికి స్ఫూర్తినిచ్చే సరళమైన, గంభీరమైన మరియు ఆచరణాత్మకమైన బోధనలనే అమూల్య నిధిని మనకు అందించారు. “ఈ ప్రపంచంలో భగవంతునికంటే ఎక్కువ ప్రేమను మనకు ఇవ్వగలవారు ఎవరూ లేరు. భగవంతుని ప్రేమను పొందడానికే మనం భజనలు చేస్తాము, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. భగవంతుని ప్రేమ మనలో అపారమైన శక్తిని నింపుతుంది. ... కాబట్టి భగవంతుని ప్రేమించండి; భగవంతుని సంతానమైన ప్రతి మనిషిని ప్రేమించండి. ... దానధర్మాలు మరియు దయాగుణం ధర్మంలో (నీతియుక్తమైన జీవన విధానంలో) ముఖ్యమైన భాగాలు.”.... 27 జనవరి 2007, తిరువాన్మయూర్, చెన్నై, శ్రీ సత్యసాయి స్పీక్స్, సంపుటి 40 (2007).
ఈ దివ్య వాక్యాలు నిస్వార్థ సేవ ద్వారా వ్యక్తమయ్యే ప్రేమే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి సారాంశమని గుర్తుచేస్తున్నాయి. వైబ్రియానిక్స్ సేవ మనలో ప్రతి ఒక్కరికీ ఈ బోధనలను దైనందిన జీవితంలో ఆచరించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ భావనతో, ప్రధాన ఉత్సవాల సమయంలోనూ, అలాగే ఆయా రాష్ట్రాల సేవాదళ సభ్యులు ప్రశాంతి నిలయంలో సేవలందించే వారాల్లోనూ, ప్రాక్టీషనర్లు వైబ్రియానిక్స్ చికిత్సా సేవలను అందించగలిగే విధంగా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాము. ఎందుకంటే అనేక మంది భక్తులు మరియు స్వచ్ఛంద సేవకులు తమ ప్రాంతీయ భాషనే మాట్లాడతారు. కాబట్టి అదే రాష్ట్రానికి చెందిన ప్రాక్టీషనర్లు వారితో సులభంగా సంభాషించి, మరింత సమర్థవంతంగా సేవలందించగలరు. ప్రస్తుతం, ఈ కార్యక్రమంపై ఆసక్తి స్థాయిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఈ విధంగా మీ సేవను అందించడానికి ప్రేరణ పొందినట్లయితే, దయచేసి [email protected] కు వ్రాయండి. మీ స్పందన ఆధారంగా, తదుపరి సంచికలో మరిన్ని వివరాలను తెలియజేస్తాము.
క్షేత్రస్థాయి సేవా కార్యక్రమాల నుండి కొన్ని స్ఫూర్తిదాయకమైన గణాంకాలను మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇమ్యూనిటీ బూస్టర్ (IB) ప్రవేశపెట్టి ఇప్పటికి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో 12,75,000 కంటే ఎక్కువ సీసాలు పంపిణీ చేయబడటం ఒక విశేషమైన మైలురాయి. అదనంగా, సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సేవలందించే శిబిరాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు, 14 రాష్ట్రాలకు చెందిన 183 మంది ప్రాక్టీషనర్లు, 134 కేంద్రాలలో 1,926 శిబిరాలను నిర్వహించి, 62,683 మంది రోగులకు సేవలందించారు. మన ప్రాక్టీషనర్ల అంకితభావం నిజంగా ప్రశంసనీయమైనది.
ప్రాక్టీషనర్లు అందరూ ప్రతి సంవత్సరం ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్‌లోని ఫారమ్‌ను పూర్తి చేసి, స్విర్ట్ (SVIRT) తో తమ సభ్యత్వ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. అలా చేసిన తర్వాత, ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు మీకు అందజేయబడుతుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రాక్టీషనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇంకా పూర్తి చేయని వారు వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. స్విర్ట్ గుర్తింపు కార్డు కేవలం సంస్థతో అనుబంధ భావనను కలిగించడమే కాకుండా, అధికారిక గుర్తింపును కూడా అందిస్తుంది. అలాగే, స్విర్ట్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. సహాయం అవసరమైతే, దయచేసి [email protected] కు వ్రాయండి.
శతజయంతి కానుకలో భాగంగా స్వామికి సమర్పించిన మూడు పుస్తకాలు ఎంతో మంచి ఆదరణ పొందాయి. కొంతకాలం నిల్వలు లేక అందుబాటులో లేకపోయిన తర్వాత, ఇప్పుడు అవి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాలను ఫ్రెంచ్ భాషలోకి అనువదించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఫ్రాన్స్‌కు చెందిన మన ప్రాక్టీషనర్లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పుస్తకాలు ఇతర భాషల్లోకి కూడా అనువదించబడి, మరింత విస్తృత పాఠక వర్గానికి చేరుకోవడం ఎంతో ఆనందదాయకం అవుతుంది. ప్రాక్టీషనర్స్ కార్నర్ కోసం తమ అనుభవాలు, అవగాహనలు, ఆత్మపరిశీలనలు మరియు విశేషమైన కేసుల విజయాలను పంచుకోవాలని ప్రాక్టీషనర్లను ప్రోత్సహిస్తున్నాము. మీ రచనలు తోటి ప్రాక్టీషనర్లకు స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించగలవు. మీ రచనలను [email protected] కు పంపవచ్చు.
అత్యున్నత శిక్షణా ప్రమాణాలను కొనసాగించాలనే మా నిబద్ధతలో భాగంగా, వార్షిక రిఫ్రెషర్ కోర్సులు ప్రవేశపెడుతున్నాము. ఈ సందర్భంగా, శిక్షణ విభాగం 2026 మే 30-31 తేదీలలో వైబ్రియానిక్స్ యొక్క ప్రాథమిక సూత్రాలు మరియు ఆచరణపై రెండు రోజుల ఆన్‌లైన్ రిఫ్రెషర్ కోర్సును నిర్వహిస్తున్నట్లు సంతోషంతో తెలియజేస్తోంది. ఈ కోర్సు అన్ని ప్రాక్టీషనర్లకు అందుబాటులో ఉంటుంది. వివరాలు మరియు నమోదు కోసం [email protected] కు వ్రాయండి. మన ప్రాక్టీషనర్ల సంఖ్యను మరింత పెంచేందుకు, ప్రాంతీయ భాషలలో మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించబడతాయి. హిందీ భాషలో ఒక AP శిక్షణా శిబిరం సెప్టెంబరు మధ్యలో ఢిల్లీలో నిర్వహించేందుకు ప్రతిపాదించబడింది. ప్రవేశ అర్హతల వివరాల కోసం [email protected] కు వ్రాయండి. అదేవిధంగా, ఈ సేవలో చేరాలనే ఆసక్తి కలిగిన రోగులు, స్నేహితులు, బంధువులు మరియు ఇతరులను సంప్రదించాలని ప్రాక్టీషనర్లను ప్రోత్సహిస్తున్నాము. ఆసక్తి గల వ్యక్తులు మా వెబ్‌సైట్‌లోని “Contact Us” ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మనం స్వామి వారి అపార ప్రేమ నుండి నిరంతరం స్ఫూర్తిని పొందుతూ, ఈ పవిత్రమైన దైవ కార్యానికి సంపూర్ణ హృదయంతో అంకితమవుదాం. వినయం, కరుణ మరియు అచంచలమైన విశ్వాసంతో సేవ చేస్తూ, ఆయన దివ్య సంకల్పానికి నిజమైన సాధనాలుగా మారుదాం. ఈ సందర్భంలో స్వామి వారి ఈ అమూల్యమైన బంగారు వాక్యాలను స్మరించుకుందాం: “ముందుగా నిన్ను నీవు మెరుగుపరచుకో, నిన్ను నీవు బోధించుకో, నిన్ను నీవు పునర్నిర్మించుకో. ఆ తర్వాత ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు సాగు. ... ఏ కార్యమైనా ఆనందాన్నో లేదా దుఃఖాన్నో కలిగిస్తుంది; అది ఆ కార్యాన్ని ఏ విధమైన ఆసక్తి, అనుబంధంతో చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ‘నేను’ మరియు ‘నాది’ అనే భావాలే సర్పం యొక్క రెండు విషదంతాలు. వాటిని తొలగించు. అప్పుడు నీవు ఆ సర్పాన్ని సురక్షితంగా చేతబట్టి దానితో ఆడుకోగలవు. కార్యాలను విడిచిపెట్టవలసిన అవసరం లేదు. వాస్తవానికి, నీవు అత్యంత చురుకుగా కార్యాచరణలో పాల్గొనాలి. ఈ పవిత్ర కర్మభూమిలో, కర్మను అధిగమించగలిగేది కర్మ ద్వారానే!”...26 అక్టోబర్ 1963, దివ్య ప్రసంగం, సత్యసాయి స్పీక్స్, సంపుటి 3 (1963): https://saispeaks.sathyasai.org/discourse/will-not-last
సాయికి ప్రేమపూర్వక సేవలో,
డా. జిత్ కె. అగర్వాల్
మద్యానికి వ్యసనం, కడుపు నొప్పి 11650...India
28 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి, RMP (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) గా పనిచేస్తూ, 16 సంవత్సరాల వయస్సు (2013 సంవత్సరం) నుంచే మద్యం సేవనానికి బానిసయ్యాడు. అతను కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే గ్రామీణ ప్రాంతంలో RMPగా పనిచేస్తున్న తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికే అతను స్వయంగా రోగులను చూడడం మొదలుపెట్టాడు. రోగుల నుండి వచ్చిన డబ్బును తన వద్దే ఉంచుకోవడానికి అతని తండ్రి అనుమతించాడు. చిన్న వయస్సులోనే వచ్చిన ఈ ఆర్థిక స్వాతంత్ర్యం కారణంగా అతనిలో తరచుగా వీధి ఆహారం తినడం, మద్యం సేవించడం మరియు అప్పుడప్పుడు ధూమపానం చేయడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు పెరిగాయి. కాలక్రమేణా అతని మద్యం సేవనం మరింత అధికమై, ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగేది. దీని వల్ల అతని మొత్తం ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.
2025 సెప్టెంబర్‌లో అతనికి నిరంతర కడుపు నొప్పి ప్రారంభమైంది. తనకు ఉన్న పరిమిత వైద్య పరిజ్ఞానంపై ఆధారపడి స్వయంగా మందులు వాడటానికి ప్రయత్నించినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారింది. 2025 అక్టోబర్‌లో అతను వైద్య పరీక్షలు చేయించుకోగా, అతనికి పెప్టిక్ అల్సర్లు (కడుపులో పుండ్లు) ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులు సూచించిన అలోపతి మందులను సుమారు ఒక నెల పాటు వాడినప్పటికీ, అతనికి పెద్దగా ఉపశమనం కలగలేదు. అతని పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఒక శ్రేయోభిలాషి అతనిని మద్యం మానాలని పలుమార్లు ఒప్పించడానికి ప్రయత్నించినా, అతను మద్యం విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. అందువల్ల, అతను ఒక ప్రాక్టీషనర్‌ను సంప్రదించాడు. ఆ ప్రాక్టీషనర్ 2025 నవంబర్ 4న, అతని అల్సర్లకు చికిత్స చేస్తున్నాననే నెపంతో, అతనికి:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.5 Ulcers + CC4.11 Liver & Spleen + Dopamine Potentised 1M ను… నీటిలో కలిపి రోజంతా కొద్దికొద్దిగా తాగమని సూచించారు.
చికిత్స పురోగతి
➤ 11 నవంబర్ 2025:
మందు ప్రారంభించినప్పటి నుండి మద్యం తాగాలనే కోరిక (urge) లేదని తెలిపాడు.
➤ 13 నవంబర్ 2025:
ఒక మద్యం దుకాణం పక్కగా వెళ్తుండగా తాగాలనే కోరికను అదుపు చేసుకోలేక అధికంగా మద్యం సేవించాడు. అనంతరం స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు.
➤ 14 నవంబర్ 2025:
అతని శ్రేయోభిలాషి రోజుకు మూడుసార్లు రెమెడీ ఇచ్చాడు.
➤ 20 నవంబర్ 2025:
కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఇతరులు మద్యం సేవిస్తున్నప్పుడు వారి మధ్య ఉన్నప్పటికీ, వారికి మద్యం పోసి ఇస్తున్నప్పటికీ తాను తాగాలనే ప్రలోభానికి లోనుకాలేదు. అతను పదేపదే ఇలా చెప్పాడు: “నాకు తాగాలనిపించడం లేదు; మద్యం తాగాలనే కోరిక పూర్తిగా పోయింది.”
2026 మార్చి నాటికి, అతనికి మళ్లీ మద్యం సేవించాలనే కోరిక కలగలేదు. అలాగే అతను ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా అలవర్చుకున్నాడు. రెమెడీను తగ్గించే ముందు మరో ఒక నెల పాటు TDS (రోజుకు మూడుసార్లు) కొనసాగించాలని అతను కోరుకుంటున్నాడు.
కాలి నొప్పి, గురక 11650...India
ఒక 71 సంవత్సరాల గృహిణి, స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా సేవాదళ్ సేవలో పాల్గొంటున్నప్పుడు, అనుకోకుండా ఒకొరిని ఢీకొనడంతో కిందపడిపోయింది. దీనివల్ల ఆమె ఎడమ మోకాలు మరియు కింది కాలికి గాయం అయింది. ఆ గాయంతో రక్తగడ్డ ఏర్పడింది. అలోపతి మందుల వలన ఒక వారంలో ఆ రక్తగడ్డ కరిగిపోయింది. అయితే తీవ్రమైన నొప్పి మాత్రం కొనసాగింది. మరో నాలుగు వారాల తర్వాత, ఒక కుటుంబ కార్యక్రమంలో ఆమె ప్రాక్టీషనర్‌ను కలిసినప్పుడు, నాలుగు కాళ్ల ఆధారంతో ఉండే నడక కర్ర (క్వాడ్ కేన్) సహాయంతో కూడా కుంటుకుంటూ నడుస్తూ కనిపించింది.
అదనంగా, గత ఆరు సంవత్సరాలుగా ఆమె గురక సమస్యతో బాధపడుతోంది. ఆమె గురక నిరంతరంగా మరియు చాలా పెద్ద శబ్దంతో ఉండేది. కుటుంబ సభ్యులు వేరే గదుల్లో నిద్రించినప్పటికీ వారికి ఇబ్బంది కలిగేది. ఈ సమస్యకు ఆమె ఎప్పుడూ ఎలాంటి చికిత్స తీసుకోలేదు. 27 డిసెంబర్ 2024న, ముందుగా కాలి నొప్పి కోసం ఈ క్రింది మందులు ఇవ్వబడ్డాయి:
#1. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive Tissue…ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, రెండు గంటల పాటు, తరువాత 6TD
చికిత్స పురోగతి
➤ 28 డిసెంబర్ 2024:
నొప్పి 25% తగ్గింది.
➤ 4 జనవరి 2025:
నొప్పిలో 50% మెరుగుదల కనిపించింది. కుంటుతూ నడవడం లేదు. ఇంట్లో కర్ర అవసరం లేకుండా నడవగలుగుతోంది. మోతాదును TDS కు తగ్గించారు.
➤ 10 జనవరి 2025:
నొప్పి 80% తగ్గింది. బయట ఎక్కువసేపు సౌకర్యంగా నడవగలుగుతోంది.
➤ 11 జనవరి 2025:
నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మోతాదును OD కు తగ్గించారు.గురక కోసం ఇవ్వబడిన రెమిడీ:#2. CC15.6 Sleep Disorders … BD సాయంత్రం 6 గంటలకు మరియు రాత్రి 10 గంటలకు నిద్రపోయే ముందు. 1–2 గంటల తర్వాత కూడా నిద్ర రాకపోతే అదనపు మోతాదు తీసుకోవాలని సూచించారు.
➤ 15 జనవరి 2025:
కుటుంబ సభ్యులు గురక తీవ్రత 50% తగ్గిందని తెలిపారు.
➤ 20 జనవరి 2025:
గురక పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోగలిగారు. మోతాదును రాత్రి OD కు తగ్గించారు.
➤ 31 జనవరి 2025:
#1 రెమిడీ పూర్తిగా అయిపోవడంతో నిలిపివేయబడింది.
➤ 30 మార్చి 2025:
#2 రెమిడీ మోతాదును క్రమంగా తగ్గించిన తర్వాత నిలిపివేయబడింది.
మార్చి 2026 నాటికి, రోగి ఆరోగ్యంగా కొనసాగుతోంది. అయితే, రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటే అప్పుడప్పుడు గురక వస్తోంది. అందువల్ల, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట విరామం తీసుకుని, పడుకునే ముందు 15 నిమిషాలు నడవాలని ఆమెకు సూచించారు.
పొడి, దురదతో కూడిన చర్మం మరియు హైపర్పిగ్మెంటేషన్, మలబద్ధకం 11687...India
58 సంవత్సరాల వయస్సు గల ఒక ట్రక్ డ్రైవర్ 10 సంవత్సరాలుగా ఒక చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధిలో చేతి కీళ్లపై, మోచేతులపై మరియు పొట్ట భాగంలో దురదతో కూడిన, పొడిబారిన, నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చలికాలంలో దురద చాలా ఎక్కువగా ఉండేది. గత అనేక సంవత్సరాలుగా అతను వివిధ అలోపతి ఆయింట్‌మెంట్‌లను ఉపయోగించినప్పటికీ, వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించింది.
అదనంగా, గత మూడు సంవత్సరాలుగా అతను మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతున్నాడు. మలవిసర్జన క్రమబద్ధంగా కాకుండా వారానికి 4–5 సార్లు మాత్రమే జరుగుతోంది. కొన్నిసార్లు మలం చాలా గట్టిగా ఉండి, విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి కలిగించేది. అతని ఉద్యోగం కారణంగా ఎక్కువసేపు వాహనం నడపాల్సి వచ్చేది. దీనివల్ల భోజన సమయాలు క్రమబద్ధంగా ఉండేవి కావు. తరచుగా రోడ్డు పక్కన లభించే జంక్ ఫుడ్ తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అలాగే దీర్ఘ ప్రయాణాల తర్వాత అప్పుడప్పుడు మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉండేవి. మలబద్ధకం కోసం అతను తరచుగా విరేచన మందులు, ఆయుర్వేద రెమిడీలు వాడేవాడు మరియు ప్రయాణాల్లో కూడా విరేచన మందులను వెంట తీసుకెళ్లేవాడు.
29 సెప్టెంబర్ 2021న, అతను ప్రాక్టీషనర్‌ను సంప్రదించే సమయానికి, చర్మంపై ఉన్న మచ్చలు పిరుదుల వరకు కూడా వ్యాపించాయి. అప్పుడు అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
చర్మంపై మచ్చల కోసం:
#1. CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic + CC21.2 Skin Infections + CC21.3 Skin Allergies + CC21.10 Psoriasis … TDS
అదే రెమిడీని కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా రాయడానికి OD మోతాదులో కూడా ఇవ్వబడింది.
మలబద్ధకం కోసం:
#2. CC4.4 Constipation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies … ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక గంట పాటు ఇవ్వబడింది. ఆ తరువాత 6TD.
అదనంగా, అతనికి ఈ సూచనలు కూడా ఇవ్వబడ్డాయి: రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు భోజన సమయాలను క్రమబద్ధంగా పాటించాలి.
చికిత్స పురోగతి
➤ 13 నవంబర్ 2021:
దురద 50% తగ్గింది. మలం గట్టిగా ఉండడం 25% తగ్గింది. అవసరమైనప్పుడు ఇంకా విరేచన మందులు ఉపయోగించేవాడు. #2 రెమిడీ మోతాదును QDS కు తగ్గించారు.
➤ 16 డిసెంబర్ 2021:
దురద పూర్తిగా తగ్గిపోయింది. చర్మరంగు 70% వరకు మెరుగుపడింది. మలం గట్టిగా ఉండడం మరియు విసర్జన సమయంలో నొప్పి 60% వరకు తగ్గాయి. #2 రెమిడీ మోతాదును TDS కు తగ్గించారు.
➤ 31 డిసెంబర్ 2021:
చర్మరంగు దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది. మలం గట్టిగా ఉండడం 90% తగ్గింది. ప్రతిరోజూ క్రమంగా మలవిసర్జన జరుగుతోంది.
➤ 18 ఫిబ్రవరి 2022:
అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి.
➤ 31 మార్చి 2022:
రెండు రెమిడీల మోతాదును క్రమంగా తగ్గించిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు.
నవంబర్ 2025లో, ఈ రోగి మరొక రోగితో కలిసి తదుపరి సమీక్ష కోసం వచ్చినప్పుడు, తనకు ఎటువంటి లక్షణాలు మళ్లీ రాలేదని ధృవీకరించాడు.
శ్వాసకోశ అలెర్జీ 11618...India
14 సంవత్సరాల వయస్సు గల ఒక బాలిక గత రెండు సంవత్సరాలుగా 2021 జూలై నుండి పునరావృతమయ్యే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతోంది. ప్రతి ఎపిసోడ్ ముక్కు మూసుకుపోవడంతో ప్రారంభమయ్యేది. ఆ తరువాత తల మరియు ముఖంలో, ముఖ్యంగా చెంపలు మరియు నుదురు ప్రాంతంలో బరువుగా అనిపించేది. ముఖ్యంగా నిద్ర సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్వల్ప దగ్గు మరియు ఊపిరితిత్తుల్లో కఫం ఉన్నట్లుగా అనిపించేది. జలుబుతో పాటు ఎల్లప్పుడూ తలనొప్పి కూడా ఉండేది. ఈ తలనొప్పి కనుబొమ్మల మధ్య భాగంలో ప్రారంభమై, నుదురు మరియు వెంట్రుకలు మొదలయ్యే భాగం వరకు వ్యాపించి, తరువాత తల వెనుక భాగానికి చేరేది. నొప్పి కొట్టుకుంటున్నట్లుగా (throbbing) ఉండి, తల రెండు వైపులా తీవ్రంగా ఉండేది. ఈ సమస్యలు చల్లటి వాతావరణం, దుమ్ము, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం, అలాగే నీరు మారడం వంటి కారణాల వల్ల ప్రేరేపించబడేవి. నెలకు 2 నుండి 3 సార్లు ఈ ఎపిసోడ్‌లు వచ్చి, ఒక్కోసారి సుమారు ఒక వారం పాటు కొనసాగేవి. నవంబర్ 2021 నుండి, ఆమెకు ఉదయం సమయంలో వరుసగా 8 నుండి 10 సార్లు తుమ్ములు వచ్చే సమస్య కూడా ప్రారంభమైంది.
గోరువెచ్చని నీరు తాగడం, ఉప్పునీటితో పుక్కిలించడం మరియు ప్రేరేపించే కారణాలను నివారించడం వలన కొంత ఉపశమనం లభించేది. డిసెంబర్ 2021లో, వైద్యుడు ఆమె పరిస్థితిని శ్వాసకోశ అలెర్జీగా నిర్ధారించి, రెండు వారాల పాటు వైద్య చికిత్సతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార సూచనలు కూడా ఇచ్చాడు. లక్షణాలు సుమారు మూడు నెలల పాటు తగ్గిపోయినా, తరువాత మళ్లీ తిరిగి వచ్చాయి. తదుపరి చికిత్సలు కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. దాంతో ఆమె మళ్లీ ఆవిరి పీల్చడం, ఉప్పునీటితో పుక్కిలించడం వంటి సహాయక చర్యలపై ఆధారపడింది మరియు సమస్యను ప్రేరేపించే కారణాలను వీలైనంత వరకు నివారించసాగింది.
ఒక స్నేహితురాలి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని, ఆమె 21 డిసెంబర్ 2023న ప్రాక్టీషనర్ను సంప్రదించింది. ఆ సమయంలో, ఆమెకు అదనంగా ఈ సమస్యలు కూడా ఉన్నాయి: జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండటం, రాబోయే బోర్డు పరీక్షల గురించి ఆందోళన, గత ఒక నెలగా కడుపులో మంట. అప్పుడు ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
పరీక్షల ఒత్తిడి మరియు కడుపులో మంట కోసం:
#1. CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional Tonic + CC17.3 Brain & Memory Tonic … 6TD
తలనొప్పి కోసం:
#2. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC18.1 Brain Disabilities + CC18.5 Neuralgia … TDS
శ్వాసకోశ లక్షణాల కోసం:
#3. CC9.2 Infections Acute + CC19.2 Respiratory Allergies + CC19.3 Chest Infections Chronic + CC19.5 Sinusitis + CC19.6 Chronic Cough … TDS
#4. IB … OD (Vol 15 #2 ప్రకారం)
ఇచ్చిన సూచనలు: ఆమెకు సానుకూల దృక్పథంతో ఉండాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే ప్రతిరోజూ తాజా పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి, రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి, ఒత్తిడి లేదా ఆందోళన కలిగినప్పుడు తన శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి అని సూచించారు.
చికిత్స పురోగతి
➤ 01 జనవరి 2024:
రెమిడీలు ప్రారంభించినప్పటి నుండి మానసికంగా ప్రశాంతంగా అనిపించింది. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.
➤ 21 జనవరి 2024:
తీపి పదార్థాలు మరియు ఐస్‌క్రీమ్‌లు తీసుకున్న తర్వాత ఒక స్వల్ప ఎపిసోడ్ వచ్చింది. అయితే అది రెండు రోజులలోనే తగ్గిపోయింది.
➤ 01 ఫిబ్రవరి 2024:
అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి.
➤ 18 ఫిబ్రవరి 2024:
#1 రెమిడీ మరియు #2 రెమిడీ మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత నిలిపివేశారు.
➤ 07 మార్చి 2024:
సమస్యను ప్రేరేపించే కారణాలకు గురైనప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.
➤ 10 ఏప్రిల్ 2024:
#3 రెమిడీ మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత నిలిపివేశారు.
➤ 07 జూలై 2024:
#4 రెమిడీ రోగి సౌకర్యాన్ని బట్టి నిలిపివేయబడింది.
మార్చి 2026 నాటికి, ఈ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
* ప్రతి నీటి వనరులో సహజంగా ఉండే, హానికరం కాని సూక్ష్మజీవులు ఉంటాయి. అత్యంత సున్నితత్వం ఉన్న కొందరు వ్యక్తులలో ఇవి లక్షణాలను ప్రేరేపించవచ్చు.
సోరియాసిస్ 11627...India
61 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ మార్చి 2020 నుండి గత మూడు సంవత్సరాలుగా పాదాల అరికాళ్లపై పొడిబారిన, పొలుసుల్లా ఊడే (scaly), దురదతో కూడిన చర్మ సమస్యతో బాధపడుతోంది.
దురద చాలా తీవ్రంగా ఉండేది. దీనివల్ల ఆమె నడకలు మరియు రోజువారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఆమె వైద్యుడు ఈ సమస్యను సోరియాసిస్ గా నిర్ధారించి మందులు సూచించాడు. అయితే, ఆమె హోమియోపతి చికిత్సను ఎంచుకుని ఆగస్టు 2021 వరకు కొనసాగించినప్పటికీ ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. తర్వాత ఆమె మరో హోమియోపతి వైద్యుడిని సంప్రదించగా, రెండు నెలల్లో 50% ఉపశమనం లభించింది. అయితే చికిత్సను నిలిపివేసిన కొద్ది రోజులకే లక్షణాలు మళ్లీ తిరిగి వచ్చాయి. జనవరి 2022 నుండి, ఆమె మూడు నెలల పాటు అలోపతి చికిత్స కూడా తీసుకుంది. అయినప్పటికీ పాక్షిక ఉపశమనం మాత్రమే లభించింది.
వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత, ఆమె 12 జనవరి 2023న ప్రాక్టీషనర్ను సంప్రదించింది. ఆ సమయంలో ఆమె మరే ఇతర చికిత్సను తీసుకోవడం లేదు. ఆమెకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC21.10 Psoriasis … 6TD
అదే రెమిడీని వైట్ పెట్రోలియం జెల్లీ లో కలిపి, బాహ్యంగా రాయడానికి OD మోతాదులో కూడా ఇవ్వబడింది.
చికిత్స పురోగతి
➤ 31 మార్చి 2023:
అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. రెమిడీ మోతాదును TDS కు తగ్గించారు.
➤ 14 ఏప్రిల్ 2023:
రెమిడీ మోతాదును OD కు తగ్గించారు. బాహ్యంగా రాసే రెమిడీని నిలిపివేశారు.
➤ 14 జూన్ 2023:
రెమిడీ మోతాదును క్రమంగా తగ్గించిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు.
మార్చి 2026 నాటికి, ఈ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
కళ్లకు రసాయన గాయం 10001...India
35 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళా దర్జీ ఫిబ్రవరి 2023లో ప్రమాదవశాత్తూ గోరింటాకు పేస్ట్‌ను రెండు కళ్లలో చల్లుకుంది. గోరింటాకు ఉన్న పాత్ర ఆమె చేతి నుండి జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
దీని ఫలితంగా ఆమెకు కళ్లలో మంట, దురద, నీటివంటి స్రావం, ఎర్రబడటం, చీము ఏర్పడటం, చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.
ఆమె ఫిబ్రవరి 2023 నుండి అక్టోబర్ 2023 వరకు, అంటే ఎనిమిది నెలల పాటు అలోపతి చికిత్స తీసుకుంది. దాని వల్ల చీము మరియు మంట సమస్యలు తగ్గిపోయాయి.
అయితే నిరంతర దురద, కళ్ల ఎర్రబడటం, నీటివంటి స్రావం, చూపు బలహీనపడటం వంటి సమస్యలు మాత్రం కొనసాగాయి. దురద క్రమంగా చెంపల వరకు కూడా వ్యాపించింది. ఈ సమస్యలు, ముఖ్యంగా చూపు బలహీనపడటం వల్ల, ఆమె జీవనోపాధికి ఆధారమైన కుట్టు పనిని నిలిపివేయాల్సి వచ్చింది.
1 నవంబర్ 2023న, ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా, అతను ఆమెకు క్రింది రెమిడీని ఇచ్చాడు:
#1. CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.6 Eye injury + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies...6TD
ఆమె ఎలాంటి ఇతర మందులు తీసుకోవడం లేదు.
చికిత్స పురోగతి:
➢ 15 నవంబర్ 2023: రెండు కళ్లలో దురద, ఎర్రదనం మరియు నీరు కారడం 50% తగ్గాయి; మోతాదు TDS కు తగ్గించబడింది.
➢ 2 జనవరి 2024: దురద, ఎర్రదనం మరియు నీరు కారడం పూర్తిగా తగ్గిపోయాయి; చూపు మెరుగుపరచడానికి రెమిడీని CC7.4 Eye defects + #1...TDS గా పెంచారు.
➢ 7 మార్చి 2024: రెండు కళ్లలో చూపు పూర్తిగా పునరుద్ధరించబడింది; ఆమె సంతోషంగా తిరిగి టైలరింగ్ పనిని ప్రారంభించింది.
➢ 1 ఏప్రిల్ 2024: #2 మోతాదును OD కు తగ్గించారు.
➢ 31 మే 2024: మోతాదును క్రమంగా తగ్గిస్తూ రెమిడీని నిలిపివేశారు.
మార్చి 2026 నాటికి, సమస్య మళ్లీ రాలేదు.
హెచ్చరిక: దాదాపు ఖచ్చితంగా ఆ పేస్ట్‌లో పారా-ఫెనైలీన్డయామైన్ (PPD) వంటి రసాయనం కలిసి ఉండవచ్చు; స్వచ్ఛమైన మెహందీ పొడి చాలా సురక్షితమైనది.
మొక్కలో ఎదుగుదల లోపం 11682...India
మాగ్నోలియా ట్యూలిప్ మొక్కను 28 జనవరి 2026న ఒక నర్సరీ నుండి నిద్రాణ (Dormant) స్థితిలో కొనుగోలు చేశారు. విక్రేత 15 రోజులలోపు మొక్క పుష్పించడం ప్రారంభిస్తుందని హామీ ఇచ్చాడు. కొన్ని కొమ్మల చివరల్లో అనేక మొగ్గలు కనిపించడంతో, 500కు పైగా మొక్కలను ఇంట్లో పెంచుతున్న అనుభవజ్ఞురాలు మరియు ఆసక్తిగల ప్రాక్టీషనర్ ఆ మొక్కను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
ఆమె తన అన్ని మొక్కలకు ప్రతి రెండు వారాలకు ఒకసారి CC1.2 Plant tonic ఇస్తూ ఉండేది; ఈ కొత్త మొక్కకు కూడా అదే విధానాన్ని అనుసరించింది. అయినప్పటికీ, 41 రోజుల తర్వాత కూడా మొక్క నిద్రాణ స్థితిలోనే ఉండి, పెరుగుదల యొక్క ఎలాంటి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు (చిత్రం 1). దీనివల్ల ఆమెకు ఎంతో నిరాశ కలిగింది.
10 మార్చి 2026న, క్రింది మోతాదు ప్రారంభించబడింది:
CC1.2 Plant tonic...OD, 5 మి.లీ. నీటి రెమిడీని కాండం అడుగు భాగంలో పోశారు.
చికిత్స పురోగతి:
➢ 15 మార్చి 2026: ప్రాక్టీషనర్‌కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ, పెరుగుదల యొక్క మొదటి సంకేతం కనిపించింది – కాండం అడుగు భాగం నుండి చిన్న ఆకుపచ్చ మొలక బయటకు వచ్చింది.
➢ 18 మార్చి 2026: ప్రధాన కాండం వెంట ఆరోగ్యకరమైన ఆకుపచ్చ ఆకులు మరియు మొగ్గలు ఏర్పడి అభివృద్ధి చెందాయి.
➢ 22 మార్చి 2026: రెండు పుష్పాలు పూర్తిగా వికసించాయి (చిత్రం 2); మోతాదును OW కు తగ్గించారు.
ఏప్రిల్ 2026 నాటికి, మొక్క చక్కగా పెరుగుతూ ఆరోగ్యంగా వర్ధిల్లుతోంది.
చికిత్సకు ముందు చికిత్స తరువాత

మెడ మరియు భుజం నొప్పి 11529...India
60 ఏళ్ల మహిళకు ఏప్రిల్ 2022 నుండి ఐదు నెలలుగా మెడ మరియు కుడి భుజంలో నిరంతర వాపు, అలాగే ఎడతెరిపి లేని నొప్పి ఉండేది. ఈ నొప్పి కీళ్లతో పాటు చుట్టుపక్కల కండరాలను కూడా ప్రభావితం చేసి, భుజం నుండి పై చేతి వరకు వ్యాపించేది. ఆమె కుడి వైపున పడుకోలేకపోయేది. ఈ సమస్య రోజువారీ పనులకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రను కూడా భంగపరచేది.
ఆమెకు గతంలో మెడ నొప్పి, స్పాండిలైటిస్ లేదా ఉదయం వేళల్లో బిగుతుదనం వంటి చరిత్ర లేదు. ఫ్రోజెన్ షోల్డర్‌ను సూచించే లక్షణాలు కూడా లేవు. చేతిని కదిలించినప్పుడు నొప్పి మరింత పెరిగేది. ఎడమ భుజం పూర్తిగా సాధారణంగా ఉండేది. ఈ సమస్యకు కారణమైన ఏదైనా ప్రత్యేక సంఘటన తనకు గుర్తులేదని, వయస్సుతో వచ్చే క్షీణత కారణంగానే ఈ లక్షణాలు వచ్చాయని ఆమె భావించింది.
ఆమె ఎలాంటి అలోపతి మందులు వాడకుండా, బామ్, నూనెతో మర్దన, వేడి కాపడం మరియు కార్యకలాపాలను తగ్గించడం ద్వారా ఉపశమనం పొందేందుకు ప్రయత్నించింది.
ఆమె 11 సెప్టెంబర్ 2022న వారానికి ఒకసారి నిర్వహించే వైబ్రియోనిక్స్ శిబిరంలో ప్రాక్టీషనర్ ను సంప్రదించగా, క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…QDS
చికిత్స పురోగతి:
➢ 20 నవంబర్ 2022: నొప్పి 40% తగ్గింది మరియు వాపు 60% తగ్గింది. అదనంగా, బాహ్య వినియోగం కోసం ఆవ నూనెలో రెమిడీ కలిపి TDS గా ఉపయోగించమని సూచించారు.
➢ 19 మార్చి 2023: వాపు పూర్తిగా తగ్గిపోయింది, నొప్పి 80% మెరుగుపడింది. నోటిద్వారా తీసుకునే మోతాదును TDS కు, బాహ్య వినియోగాన్ని OD కు తగ్గించారు.
➢ 11 జూన్ 2023: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆమె ఆనందం మరియు కృతజ్ఞతను వ్యక్తం చేసింది. నోటిద్వారా తీసుకునే మోతాదును OD కు, బాహ్య వినియోగాన్ని 3TW కు తగ్గించారు.
➢ 12 ఆగస్టు 2023: చికిత్స నిలిపివేయబడింది.
రోగి ప్రాక్టీషనర్ తో క్రమం తప్పకుండా సంప్రదింపులో ఉన్నప్పటికీ, పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ స్థిరంగా కొనసాగిందని గమనించాలి.
ఏప్రిల్ 2026 నాటికి, ఆమె పూర్తిగా నొప్పి రహితంగా ఉంది. ప్రస్తుతం ఆమె తన చర్మ సమస్యకు చికిత్స పొందుతోంది.
సంపాదకుని వ్యాఖ్య: అనుభవం ప్రకారం, బాహ్యంగా రెమిడీని ఉపయోగించడం నోటిద్వారా తీసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. అందువల్ల చికిత్స ప్రారంభం నుంచే బాహ్య వినియోగాన్ని కూడా ప్రారంభించాలి. అలాగే, పూర్తిస్థాయి ఉపశమనం లభించే వరకు దాని వినియోగ మోతాదును తగ్గించకూడదు.
నాలుకపై పుండు (అల్సర్) 11646...India
63 ఏళ్ల వ్యక్తి మార్చి 2025 నుండి ఆరు నెలలుగా నాలుకలో నిరంతర నొప్పితో బాధపడుతున్నాడు. ఆహారాన్ని నమలడం మాత్రమే కాకుండా, నీరు తాగడం కూడా అతనికి అసౌకర్యంగా ఉండేది. నోరు తెరిచిన వెంటనే నొప్పి ప్రారంభమయ్యేది. ఉప్పు లేదా కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు మంట కలిగేది.
అతను కొద్దికొద్దిగా మాత్రమే మెత్తటి (సెమీ-సాలిడ్) ఆహారం తీసుకోగలిగేవాడు. దీని వల్ల క్రమంగా బలహీనత కూడా వచ్చింది. అతను వైద్యుడిని సంప్రదించగా, బయాప్సీ పరీక్షలో నాలుకపై జ్ఞానదంతం ప్రాంతంలో మానని పుండు మరియు దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్) ఉన్నట్లు తేలింది. సుమారు ఆరు నెలల పాటు అతను అలోపతి మరియు ఆయుర్వేద చికిత్సలు తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు.
15 సెప్టెంబర్ 2025న, అతని కుటుంబ సభ్యులు ప్రాక్టీషనర్ ను సంప్రదించగా, క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM16 Drawing + NM36 War + NM63 Back-up + NM86 Immunity + NM89 Mouth & Gum + SR252 Tub-Bac + SR261 Nat Mur + SR271 Arnica 200C + SR301 Mercurius 30C + SR307 Phytolacca 200C + SR317 Sulphur 30C…QDS
చికిత్స పురోగతి:
➢ 30 సెప్టెంబర్ 2025: నొప్పిలో 50% మెరుగుదల కనిపించింది.
➢ 10 అక్టోబర్ 2025: పుండు పూర్తిగా మానిపోయింది. అతను సాధారణంగా ఆహారం తినగలిగాడు. మోతాదును BD కు తగ్గించారు.
➢ 15 నవంబర్ 2025: రెమిడీని క్రమంగా తగ్గించి పూర్తిగా నిలిపివేశారు. వైద్యుని పునఃసమీక్ష (ఫాలో-అప్) పరీక్షలో నాలుక పూర్తిగా సాధారణ స్థితికి చేరినట్లు నిర్ధారించబడింది.
ఏప్రిల్ 2026 నాటికి, సమస్య మళ్లీ రాలేదు.
సోరియాసిస్, ఆహార అలర్జీ 11632...India
55 ఏళ్ల వ్యక్తి 2007 నుండి 15 సంవత్సరాలుగా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. మొదట్లో తలపై దురద మరియు తెల్లటి పొలుసులు ఏర్పడేవి. ఒక వైద్యుడు దీనిని సోరియాసిస్ గా నిర్ధారించి చుండ్రు నిరోధక చికిత్స ఇచ్చాడు, కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. తరువాత వ్యాధి మరింత తీవ్రమై, మొత్తం తలపై వ్యాపించి, అనంతరం రెండు మోకాళ్లకు కూడా విస్తరించింది. రెండు నెలల తర్వాత అతను అలోపతి చికిత్సను నిలిపివేసి, ఎలాంటి చికిత్స లేకుండానే కొనసాగాడు.
అక్టోబర్ 2010లో, అతను ఆరు నెలల పాటు ఆయుర్వేద చికిత్స తీసుకున్నాడు. దీని వల్ల సుమారు మూడింట రెండొంతుల ఉపశమనం లభించింది. అయితే, ఆరు నెలల తర్వాత లక్షణాలు మళ్లీ ప్రారంభమై, పొట్ట మరియు వీపుకు కూడా వ్యాపించాయి. గోకడం వల్ల గాయాలు కూడా ఏర్పడేవి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు రెండవసారి ఆయుర్వేద చికిత్స తీసుకోగా పూర్తిగా కోలుకున్నాడు. కానీ మళ్లీ ఆరు నెలల తర్వాత లక్షణాలు తిరిగి వచ్చాయి.
జూన్ 2013లో, అతను ఆరు నెలల పాటు హోమియోపతి చికిత్స తీసుకున్నప్పటికీ ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. అనంతరం దురద తగ్గించుకోవడానికి ఓటీసీ (ఓవర్ ది కౌంటర్) ఆయింట్‌మెంట్‌ను ఉపయోగించసాగాడు. దాని వల్ల దురదలో సుమారు 25% ఉపశమనం లభించింది. జనవరి 2021లో, మరో వైద్యుని వద్ద హోమియోపతి చికిత్స ప్రారంభించాడు. అయితే అక్టోబర్ 2021 నాటికి, స్వల్ప దురదతో పాటు వ్యాధి శరీరమంతా వ్యాపించడంతో ఆ చికిత్సను కూడా నిలిపివేశాడు.
14 అక్టోబర్ 2022న, అతను ప్రాక్టీషనర్ ను సంప్రదించగా, క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions...OD 3 రోజులు, తరువాత BD 3 రోజులు, ఆపై TDS
(ఓటీసీ ఆయింట్‌మెంట్‌ను కొనసాగించారు)
చికిత్స పురోగతి:
➢ 19 అక్టోబర్ 2022: పొలుసులు 10% తగ్గాయి.
➢ 15 నవంబర్ 2022: దురద పూర్తిగా తగ్గిపోయింది.
➢ 12 డిసెంబర్ 2022: పొలుసులు మరియు చర్మ రంగులో 50% మెరుగుదల కనిపించింది.
➢ 25 డిసెంబర్ 2022: మూడు రోజుల క్రితం ఆవాల పొడి కలిగిన ఆహారం అనుకోకుండా తీసుకోవడంతో పొలుసుల మందం పెరిగింది. రోగి తనకు ఆవాలు, వంకాయ, గోంగూర మరియు చేపల పట్ల అలర్జీ ఉందని తెలిపాడు. అయితే, అతను ఊరికి దూరంగా ఉండటం వల్ల కొత్త రెమిడీ ఇవ్వడం సాధ్యపడలేదు.
➢ 4 జనవరి 2023: మెరుగుపరచిన రెమిడీ క్రింది విధంగా ఇవ్వబడింది:
#2. CC4.10 Indigestion + #1…TDS.
➢ 9 జనవరి 2023: పొలుసులు మరియు చర్మ రంగులో 50% మెరుగుదల కనిపించింది. చేపలు తిన్నప్పటికీ ఎలాంటి అలర్జీ ప్రతిచర్య రాలేదు.
➢ 30 మే 2023: పొలుసులు, చర్మ రంగు మరియు గాయాలలో 80% మెరుగుదల వచ్చింది. ఓటీసీ ఆయింట్‌మెంట్ అవసరం లేకుండా పోయింది.
రోగి ప్రాక్టీషనర్ తో నిరంతరం సంప్రదింపులో ఉండేవాడు.
➢ 21 నవంబర్ 2023: ఇకపై ఎలాంటి అదనపు మెరుగుదల కనిపించలేదు. దీంతో అతను చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి, సూచించిన నోటిద్వారా తీసుకునే స్టెరాయిడ్లు మరియు ఆయింట్‌మెంట్లు వాడడం ప్రారంభించాడు. అయితే, రెండు రోజులలోనే వికారం, వాంతులు మరియు విరేచనాలు ప్రారంభమయ్యాయి. అందువల్ల నోటిద్వారా తీసుకునే మందులను ఆపివేశాడు, కానీ ఆయింట్‌మెంట్‌ను కొనసాగించాడు. జీర్ణకోశ సంబంధిత లక్షణాలు రెండు రోజులలో పూర్తిగా తగ్గిపోయాయి.
➢ 5 డిసెంబర్ 2023: రెమిడీని క్రింది విధంగా సవరించారు:
#3. CC17.2 Cleansing + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions... కొబ్బరి నూనెలో కలిపి బాహ్య వినియోగానికి BD మరియు #4. CC4.10 Indigestion + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + #3...నోటిద్వారా TDS
➢ 9 జనవరి 2024: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయింట్‌మెంట్ వినియోగాన్ని నిలిపివేశారు.
ఏప్రిల్ 2026 నాటికి, వ్యాధి మళ్లీ రాలేదు. సౌకర్యం కోసం రోగి ఇప్పటికీ #3 మరియు #4 రెమిడీలను మోతాదు తగ్గించకుండా కొనసాగిస్తున్నాడు.
సంపాదకుని వ్యాఖ్య:
అనుభవం ప్రకారం, బాహ్యంగా రెమిడీని ఉపయోగించడం నోటిద్వారా తీసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. కాబట్టి చికిత్స ప్రారంభం నుంచే బాహ్య వినియోగాన్ని కూడా ప్రారంభించాలి. ఈ కేసులో, బాహ్య వినియోగం ఆలస్యంగా ప్రారంభించడం వల్లనే పురోగతి నెమ్మదిగా సాగి ఉండవచ్చు. వాస్తవానికి, 30 మే 2023 తర్వాత ఆరు నెలల పాటు ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. చివరకు బాహ్య వినియోగాన్ని ప్రారంభించిన తర్వాత కేవలం నాలుగు వారాల్లోనే లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి.
చికిత్సకు ముందు

చికిత్స సమయంలో

చికిత్స తరువాత

భుజం నొప్పి, తిమ్మిరి మరియు వెన్నునొప్పి 11648...India
43 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి, 2024 ఏప్రిల్‌లో భారతదేశానికి తన వార్షిక పర్యటన సందర్భంగా వారాంత వైబ్రియానిక్స్ శిబిరాన్ని సందర్శించారు. గత సంవత్సరం ఈ చికిత్స ద్వారా ప్రయోజనం పొందిన ఆయన, ఈసారి ఒక కొత్త సమస్యకు ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చారు.
2024 జనవరి నుండి ఆయన ఎడమ భుజంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి సూదులు గుచ్చుతున్నట్లుగా ఉండటంతో పాటు, నిరంతర తిమ్మిరితో కూడా ఉండేది. ఒక నెల తరువాత, ఫిబ్రవరిలో, ఎడమ భుజం నుండి చేతి వేళ్ల వరకు తిమ్మిరి వ్యాపించింది.
రాత్రి సమయానికి వేళ్లు వాపుతో, బరువుగా మరియు నొప్పిగా మారేవి. అదే సమయంలో, వెన్ను మధ్య భాగంలో కూడా నొప్పి ప్రారంభమైంది. మూడు నెలల కాలంలో ఈ లక్షణాలు క్రమంగా తీవ్రమవుతూ, 2024 ఏప్రిల్ మొదటి వారానికి భరించలేని స్థాయికి చేరుకున్నాయి.
ఈ సమస్యకు స్పష్టమైన కారణాన్ని ఆయన గుర్తించలేకపోయారు. అయితే, ఆయన ఉద్యోగంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఉండేది. మొదట్లో భుజం నొప్పికి తన నిద్రించే భంగిమ కారణమేమోనని భావించారు. కానీ తరువాత కుడి వైపు పడుకున్నప్పటికీ ఎడమ భుజంలోని నొప్పి మరియు తిమ్మిరి కొనసాగుతుండగా, కుడి చేతికి ఎలాంటి సమస్య లేదని గమనించారు.
2024 ఏప్రిల్ 28న, ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమిడీని ఇచ్చారు:
CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive Tissue + CC20.5 Spine ... TDS
అదనంగా, బాహ్య వినియోగం కోసం ఆవ నూనెలో కలిపి రోజుకు రెండుసార్లు (BD) రాయమని సూచించారు.
అలాగే, ఏవైనా పోషకాహార లోపాలను సరిచేయడానికి ఆహారంలో ఎక్కువ పండ్లను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
చికిత్స పురోగతి
➤ 12 మే 2024:
నొప్పి, తిమ్మిరి, వేళ్లలో బరువుగా అనిపించడం మరియు వాపులో 60% మెరుగుదల కనిపించింది.
➤ 30 మే 2024:
అన్ని లక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి.
➤ 30 జూన్ 2024:
రెమిడీని నిలిపివేశారు.
2026 ఏప్రిల్ నాటికి, రోగి భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చారు. సమస్య మళ్లీ పునరావృతం కాలేదని ఆయన ధృవీకరించారు.
మెనోరేజియా (అధిక రుతుస్రావం) 11604...India
40 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ, రుతుస్రావం ప్రారంభమైనప్పటి నుండి గత 25 సంవత్సరాలుగా ప్రతి నెలా 10 రోజుల పాటు కొనసాగే అధిక రుతుస్రావం తో బాధపడుతున్నారు. అదే సమయంలో, ఆమె హీమోగ్లోబిన్ (Hb) స్థాయి ఎల్లప్పుడూ 6 నుండి 9 గ్రా./డెసిలీటర్ మధ్య ఉండేది (సాధారణ స్థాయి 12–15 గ్రా./డెసిలీటర్).
ఈ సమస్యతో పాటు ఆమెకు నిరంతర అలసట, ముఖ్యంగా రుతుస్రావ సమయంలో మరింత తీవ్రమయ్యే నీరసం, చేతులు మరియు కాళ్లలో బలహీనత, చర్మం మరియు కళ్లలో పాలిపోయిన రంగు వంటి లక్షణాలు ఉండేవి. రుతుస్రావ సమయంలో శారీరక శ్రమ చేస్తే రక్తస్రావం మరింత పెరిగేది.
అల్లోపతి చికిత్సను నివారించాలని భావించినందున, ఆమె ఎప్పుడూ వైద్యుడిని సంప్రదించలేదు.
గర్భధారణ సమయంలో ఆమె Hb స్థాయి 9 గ్రా./డెసిలీటర్ వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రసవం అనంతరం అది 5 నుండి 6 గ్రా./డెసిలీటర్‌కు పడిపోయింది. 2024 అక్టోబర్ 26న, ఆమె Hb స్థాయి 6.4 గ్రా./డెసిలీటర్గా నమోదైంది.
కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె ఒక వైద్యుడిని సంప్రదించగా, మూడు వారాల వ్యవధిలో నాలుగు ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవాలని సూచించారు. మొదటి ఇంజెక్షన్‌ను 2024 డిసెంబర్ 20న తీసుకున్నారు.
వైబ్రియానిక్స్ ద్వారా ప్రయోజనం పొందిన ఆమె సోదరి ఈ చికిత్సను సూచించగా, ఆమె వెంటనే అంగీకరించారు. అనంతరం 2024 డిసెంబర్ 27న, దూర ప్రయాణం చేసి SVIRT క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ ఆమెకు క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
#1. IB ... OD
#2. CC3.2 Bleeding Disorders + CC8.5 Vagina & Cervix + CC8.7 Menses Frequent + CC10.1 Emergencies + CC12.1 Adult Tonic ... TDS
అదనంగా, ప్రతిరోజూ వివిధ రంగుల పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా ఇనుము (ఐరన్) అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఆమె ఈ సూచనలను ఎంతో క్రమశిక్షణతో పాటించారు.
చికిత్స పురోగతి
➤ 7 జనవరి 2025:
• రుతుస్రావం కేవలం 4 నుండి 5 రోజులకే పరిమితమైంది
• Hb స్థాయి 11.9 గ్రా./డెసిలీటర్‌కు పెరిగింది*
• అలసట, అవయవాలలో బలహీనత, చర్మం మరియు కళ్ల పాలిపోవడం పూర్తిగా తొలగిపోయాయి
• #2 రెమిడీ మోతాదును BD కు తగ్గించారు
➤ 25 మార్చి 2025:
• రుతుస్రావం 4 నుండి 5 రోజులే కొనసాగుతోంది
• పై లక్షణాలు ఏవీ తిరిగి కనిపించలేదు
• మందులు పూర్తయిన తర్వాత రోగి స్వచ్ఛందంగా రెమిడీలను నిలిపివేశారు
2026 ఏప్రిల్ నాటికి, రుతుస్రావం వ్యవధి ఇంకా 4 నుండి 5 రోజులుగానే కొనసాగుతోంది. ఆమె పూర్తిగా రోగ లక్షణరహితంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నందున తదుపరి ఫాలో-అప్ సంప్రదింపుల అవసరం కూడా ఆమెకు అనిపించలేదు.
* కేవలం 18 రోజుల్లో Hb స్థాయి ఇంతగా పెరగడం చూసి ఆమె వైద్యుడు ఆశ్చర్యపోయారు. అదనంగా ఏదైనా చికిత్స తీసుకున్నారా అని ప్రశ్నించారు. అనంతరం ఐరన్ ఇంజెక్షన్లను నిలిపివేశారు.
ప్రాక్టీషనర్ల వేదిక 11650...India
ప్రాక్టీషనర్ 11650...ఇండియా ఈ ప్రాక్టీషనర్ 1976లో వైట్‌ఫీల్డ్‌లోని స్వామి కళాశాల నుండి బి.కామ్. పట్టా పొందారు. అనంతరం వినియోగ వస్తువులు, ఔషధాలు, నిర్ధారణ పరికరాలు (డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్), మరియు కాన్సెప్ట్ సెల్లింగ్
వంటి విభిన్న రంగాలలో మార్కెటింగ్ విభాగంలో సుదీర్ఘమైన, వైవిధ్యభరితమైన వృత్తి జీవితాన్ని గడిపారు. పదవీ విరమణకు ముందు, వైట్‌ఫీల్డ్ మరియు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ (SSSIHMS) లో సమన్వయం (కోఆర్డినేషన్) మరియు ప్రజా సంబంధాల (పబ్లిక్ రిలేషన్స్) విభాగాలలో సేవ చేసే భాగ్యాన్ని పొందారు.
1960లో, ఆయన నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఆయన మేనమామ బాబా వారి చిత్రపటంతో పాటు స్వామి వారి లీలలను కథలుగా ఇంటికి తీసుకురావడం ద్వారా స్వామి వారి ప్రవేశం ఆయన జీవితంలో జరిగింది. ఆ తరువాతి సంవత్సరం, వారి కుటుంబానికి పుట్టపర్తిలో స్వామి వారి దర్శనం మరియు ఇంటర్వ్యూ పొందే దివ్య భాగ్యం కలిగింది. చిన్న వయస్సు నుంచే ఆయన బాలవికాస్ తరగతులకు హాజరయ్యేవారు. కాలక్రమేణా, ఆ ప్రారంభ అనుబంధం ఒక స్థిరమైన ఆధ్యాత్మిక జీవన విధానంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆయన క్రమం తప్పకుండా భజనల్లో పాల్గొంటూ, తన స్థానిక సాయి సమితి ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వైబ్రియానిక్స్‌తో ఆయన అనుబంధం చాలా కాలం తరువాత, 2018లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన యాదృచ్ఛికంగా డా. అగర్వాల్ గారి పరిచయ వీడియోను చూశారు. ఈ వైద్య విధానాన్ని స్వామి స్వయంగా ఆశీర్వదించారని తెలుసుకోవడం ఆయనను ఎంతో లోతుగా ప్రభావితం చేసింది. వెంటనే తాను కూడా ఒక ప్రాక్టీషనర్ కావాలనే బలమైన కోరిక ఆయనలో కలిగింది. అయితే, ఆ సమయంలో ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి ముందుకు సాగలేకపోయారు. కొద్దికాలానికే, తన 93 సంవత్సరాల తల్లి ద్వారా వైబ్రియానిక్స్ శక్తిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఆయనకు లభించింది. పదేళ్లకు పైగా ఆమె ఒకేసారి గంటకంటే ఎక్కువసేపు నిద్రపోలేక బాధపడుతూ ఉండేవారు. వైద్యపరంగా ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ, తన బాల్యం లోని బాధాకరమైన జ్ఞాపకాలు రాత్రివేళల్లో మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చి ఆమెను కలవరపరచేవి. ఒక రోజు, అకస్మాత్తుగా ఆమె నిద్రపోవడానికి సహాయపడే హోమియోపతి మందు తీసుకురావాలని ఆయనను కోరారు. అప్పుడు ఆయన వైబ్రియానిక్స్ వెబ్‌సైట్ ద్వారా సమీపంలోని ఒక ప్రాక్టీషనర్ను సంప్రదించారు. ఆయన ఆశ్చర్యానికి అవధులు లేకుండా, పడుకునే ముందు కేవలం ఒకే మోతాదు తీసుకున్న తర్వాత, ఆమె వరుసగా ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోయారు! ఈ అనుభవం ఆయనకు వైబ్రియానిక్స్ ప్రభావశీలతపై మరింత దృఢమైన విశ్వాసాన్ని కలిగించింది.
ఈ అనుభవం వైబ్రియానిక్స్ నేర్చుకోవాలనే ఆయన కోరికను మళ్లీ రగిలించి, మరింత బలపరిచింది. అయితే, ఆ సమయంలో వైబ్రియానిక్స్ సేవకు అవసరమైన సమయాన్ని కేటాయించలేని పరిస్థితిలో ఉండటంతో, ఒక ప్రాక్టీషనర్ నిర్వహిస్తున్న శిబిరాలలో ఆమెకు సహాయకుడిగా సేవ చేయడం ప్రారంభించారు. తరువాత, 2022 ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఆన్‌లైన్ కోర్సులో చేరి, 2023 ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన శిక్షణా శిబిరం లో పాల్గొన్నారు. అలా, ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో ఉన్న సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ కావాలనే కోరికను చివరకు నెరవేర్చుకున్నారు. తాను ఈ అర్హతను పొందడం ఒక గొప్ప దైవానుగ్రహంగా భావిస్తున్నారు. వైబ్రియానిక్స్‌ను సులభంగా అర్థం చేసుకుని, సులభంగా ఆచరించగలగడం ఆయనను ఎంతో ఆకట్టుకుంది. రోగులకు చికిత్స అందించడం ద్వారా ఆయన అపారమైన ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా, ఏదైనా రోజు తన వద్ద చికిత్స కోసం రోగులు లేకపోతే, ఏదో లోటు ఉన్నట్లుగా అనిపిస్తుందని చెబుతారు. అందువల్ల, ఇప్పటికే తన సంరక్షణలో ఉన్న రోగులను స్వయంగా సంప్రదించి వారి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకుంటుంటారు. రోగులు పొందుతున్న ఉపశమనం, ఆనందం ఆయనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. అదే ఆయనకు మరింత ప్రేరణనిస్తూ, తన సేవా కార్యక్రమాలను విస్తరించి, అవసరంలో ఉన్న మరింత మంది ప్రజలకు చేరువ కావాలనే సంకల్పాన్ని బలపరుస్తోంది.
అనేక కేసులలో, కొన్నిసార్లు కేవలం ఒక్క మోతాదుతోనే వేగవంతమైన ఉపశమనం కలగడాన్ని ఆయన ప్రత్యక్షంగా గమనించారు. 2025 జూన్ 12న, అదృశ్య శక్తి ఆవహించినట్లుగా కనిపించే లక్షణాలను పోలిన సమస్యలతో బాధపడుతున్న 60 సంవత్సరాల మహిళకు CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing కాంబోను ఇచ్చారు. గత ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా ఆమె ప్రతి రాత్రి ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉండేది. ఆ సమయంలో ఆమె శరీరం తన నియంత్రణ లేకుండానే ఒక వైపు నుండి మరొక వైపుకు బలంగా కదిలిపోతుండేది. ఆమె కేవలం నాలుగు గంటల వ్యవధిలో రెండు మోతాదులు తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అప్పటి నుండి ఆ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు. ఈ కాంబోను నీటిలో కలిపి నోటిద్వారా తీసుకున్నప్పటికీ, లేదా ఇంట్లో స్ప్రేగా ఉపయోగించినప్పటికీ, మంచి ఫలితాలను ఇస్తుందని ప్రాక్టీషనర్ నిరంతరం గమనించారు. అనేక కుటుంబాలలో ఆయన గణనీయమైన సానుకూల మార్పులను కూడా చూశారు. వాటిలో: కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడటం, అహంభావం మరియు ప్రవర్తనా సమస్యల వల్ల ఏర్పడే విభేదాలు తగ్గిపోవడం, 28 సంవత్సరాల యువకునిలో మద్యపానానికి సంబంధించిన తీవ్రమైన దూకుడు ప్రవర్తన తగ్గిపోవడం, కుటుంబంలో ఒక సభ్యుని బలవంతపు (అబ్సెసివ్) ఆలోచనలు మరియు మితిమీరిన విమర్శనాత్మక ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదల కనిపించడం వంటి ఫలితాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ప్రస్తుతం మరింత ప్రశాంతమైన, సామరస్యపూరితమైన జీవితాన్ని గడుపుతున్నాయి.
58 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రాణిక్ హీలర్, 16 సంవత్సరాలుగా కుడి మణికట్టులో నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive Tissue + CC20.5 Spine రెమెడీను రోజుకు ఆరు సార్లు (6TD) ఇవ్వబడింది. రెండు వారాల తర్వాత సంప్రదించినప్పుడు, మొదటి రోజే కేవలం రెండు మోతాదులు తీసుకున్న తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. సమస్య మళ్లీ రాకపోవడంతో, మరో రెండు రోజులు మాత్రమే రెమెడీను కొనసాగించి ఆపివేశారు.
2026 జనవరి 6న, 18 సంవత్సరాల యువకుడు చిన్ననాటి నుంచీ తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతూ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాడు. అతనికి నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి మాత్రమే మలవిసర్జన జరిగేది. కడుపు ఉబ్బరంతో ఆకలి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, క్రీడల్లో పాల్గొనడం తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా ఉండేవి. అతనికి CC4.4 Constipation + CC4.10 Indigestion రెమెడీను రోజుకు ఆరు సార్లు (6TD) తీసుకోవడానికి నీటిలో కలిపి ఇచ్చారు. అదనంగా, కొబ్బరి నూనెలో ఒక చుక్క మందు కలిపి బొడ్డుపై (నాభిపై) రాసి, ఐదు నిమిషాల తర్వాత నాభి చుట్టూ మృదువుగా మసాజ్ చేయమని సూచించారు. జనవరి 13న అతను 80% మెరుగుదల ఉందని తెలిపాడు. జనవరి 18 నాటికి 100% కోలుకున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు సమస్య మళ్లీ రాలేదు.
గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాక్టీషనర్ వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. సుమారు 30 మంది స్వచ్ఛంద సేవకులతో కూడిన బృందంలో భాగంగా, ప్రభుత్వ మానసిక ఆసుపత్రిని క్రమం తప్పకుండా సందర్శించి, రోగుల దైనందిన అవసరాలలో సహాయపడుతున్నారు. అదనంగా, ఆయన ప్రతి నెల రెండు వైబ్రియానిక్స్ క్యాంపులను, అలాగే ప్రతి వారం మూడు క్యాంపులను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని ఆయన నివాసానికి చాలా దూరంలో ఉంటాయి. ఈ క్యాంపులలో ఒకదానిలో, ప్రజలు తమ పశువులను మరియు పెంపుడు జంతువులను కూడా చికిత్స కోసం తీసుకురావాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు.
తన వైబ్రియానిక్స్ సేవతో పాటు, ప్రస్తుతం ఆయన నలుగురు వైబ్రియానిక్స్ అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అలాగే, బాబా వారి శతజయంతి సందర్భంగా విడుదలైన పుస్తకాలకు వ్యాసాలను కూడా అందించారు. ఈ ప్రాక్టీషనర్ అభిప్రాయం ప్రకారం, వైబ్రియానిక్స్ అనేది కేవలం ఇతరులకు సేవ చేసే అవకాశమే కాకుండా, అంతర్గత ఆత్మవికాసానికి కూడా ఒక విలువైన సాధనం. రోగులతో తన అనుబంధం ద్వారా ఆయన మరింత అవగాహన, సహనం మరియు కరుణను పెంపొందించుకున్నారు. ప్రతి రోగితో జరిగే సంభాషణ తనకు ప్రజలతో మరింత లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి, వారి క్లిష్ట పరిస్థితుల్లో వారికి తోడ్పడడానికి, అలాగే స్వస్థతను ప్రసాదించే దైవిక సాధనంగా సేవ చేస్తూనే వ్యక్తిగతంగా ఎదగడానికి సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారు.
ఉదహరించిన కేసులు:
ప్రాక్టీషనర్ల వేదిక 00002...UK
పాట్ హంట్ గారికి నివాళులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి…
సునీల్ అగర్వాల్ 00033…యుకె
1994లో, వైట్‌ఫీల్డ్ ఆశ్రమం సమీపంలో నివసిస్తూ హోమియోపతితో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆచరిస్తున్న “ఒక ఆంగ్ల మహిళ” గురించి మొదటిసారి విన్న సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. కొద్ది కాలానికే, నేను
ఇంకా యుక్తవయస్సులో ఉన్నప్పుడు, మా నాన్నగారితో కలిసి వైట్‌ఫీల్డ్‌లోని సాయి కాలనీలో ఉన్న పాట్ ఆంటీ నివాసానికి వెళ్లాము. ఆ సమయంలో మేము వివిధ సహాయక చికిత్సా విధానాలను (Complementary Therapies) అన్వేషించడం ప్రారంభించాము. హోమియోపతిపై ఆమెకు అసాధారణమైన పరిజ్ఞానం ఉండేది. అతి తక్కువ కాలంలోనే ఆమె మా సాయి కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయారు. అవసరమైనప్పుడు తన పెండ్యులమ్ సహాయంతో నాకు మరియు మా కుటుంబ సభ్యులకు ఔషధాలను రూపొందించి ఇవ్వడానికి ఆమె ఎల్లప్పుడూ తన సమయాన్ని ఎంతో ఉదారంగా కేటాయించేవారు. గత 30 సంవత్సరాలలో ఆమె ఈ విధంగా రూపొందించిన అనేక కాంబినేషన్ల వల్ల నేను వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనం పొందాను.
కాలక్రమేణా, మా సంబంధం పరస్పర ఆలోచనల మార్పిడిగా అభివృద్ధి చెందింది. ఒకవైపు అల్లోపతి వైద్యంలో నా నేపథ్యం, మరోవైపు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై ఆమెకున్న లోతైన అవగాహన - ఇవి మా చర్చలను మరింత సార్థకంగా మార్చాయి. నా తల్లిదండ్రులు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఆమె ఎల్లప్పుడూ అపారమైన సహకారం మరియు ప్రోత్సాహాన్ని అందించారు. నేడు వైబ్రియానిక్స్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె పాత్ర ఎంత ముఖ్యమో చెప్పడం కష్టం; ఆమె లేకపోతే వైబ్రియానిక్స్ ఈ రూపంలో ఉండేదో లేదో ఊహించడం కూడా కష్టమే. మేము ఆమెను ఎంతగానో మిస్ అవుతున్నాము. అయితే, వైబ్రియానిక్స్ రంగానికి ఆమె చేసిన అమూల్యమైన సేవ, అలాగే ఆమె ఆప్యాయత, స్నేహపూర్వకత మరియు దయాగుణం మా హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.
జూడిత్ ఎల్. ఒలివర్ 00696…యుయెస్ఎ
1994 సెప్టెంబరులో, పాట్ హంట్ అనే అద్భుతమైన మహిళను కలిసే దైవానుగ్రహం నాకు లభించింది. ఆమె ప్రేమ, ఆప్యాయత మరియు శ్రద్ధకు ప్రతిరూపంగా ఉండేవారు. వైట్‌ఫీల్డ్ కళాశాల ప్రధాన ద్వారం సమీపంలోని తన నివాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించేవారు. కొద్ది కాలానికే, ఆమె తన క్లినిక్‌లో పనిచేయమని నన్ను ఆహ్వానించారు. అక్కడ నేను రోగులకు జిన్ షిన్ జ్యుట్సు, క్రేనియో-సాక్రల్ థెరపీ మరియు ఇతర శక్తి-ఆధారిత చికిత్సా విధానాలను అందించాను.
పాట్ గారి ద్వారా, సాయి బాబా ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చే అనేక మంది విశిష్ట వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. దాని ఫలితంగా నా సేవలను మరింత విస్తృతంగా అందించే అవకాశాలు ఏర్పడ్డాయి. ఆమె ద్వారానే నేను జిత్ గారు, హేమ గారిని కలిశాను. అలా క్రమంగా వైబ్రియానిక్స్ సేవలో భాగస్వామిని అయ్యాను. స్వస్థతా సేవల పట్ల ఆమెకున్న అపారమైన జ్ఞానం, అంకితభావం కారణంగా అనేక సంవత్సరాల పాటు మేము కలిసి అనుభవాలను పంచుకునే అవకాశం పొందాము.
ఆమె చిరునవ్వు అసాధారణమైనది. అది ఆమె వ్యక్తిత్వమంతటినీ ప్రకాశింపజేసేది. ఆమె దయ, నిస్వార్థతను ప్రత్యక్షంగా చూడడం ఒక వినయపూర్వకమైన అనుభవంగా ఉండేది. స్వామి వారి 70వ జన్మదిన వేడుకల సమయంలో, మేమంతా భారీ జనసందోహంలో చిక్కుకుపోయాము. అయితే, చేతులు లేని ఒక మహిళ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి పాట్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అది ఆమె సహజమైన కరుణ మరియు మానవతా భావానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.
మా పరిచయం క్రమంగా నిజమైన స్నేహంగా మారింది. మేము కలిసి అనేక ప్రయాణాలు చేశాము. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమీ లేకపోయినా, పరస్పర సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ గడిపిన ఆ క్షణాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి. అలాంటి ఒక సందర్భంలో బెంగళూరుకు వెళ్లినప్పుడు, విశ్వసనీయమైన ప్రదేశంలో భోజనం చేసినప్పటికీ, మేమంతా ఆహార విషతుల్య సమస్యకు (Food Poisoning) గురయ్యాము. మాతో వచ్చిన ఒక స్నేహితురాలు అస్వస్థతకు గురికావడంతో, మేమిద్దరం కలిసి ఆమెను చూసుకున్నాము. ఆ సమయంలో స్వామి వారి కరుణామయమైన రక్షణకు మేము కృతజ్ఞతతో నిండిపోయాము. తరువాతి సంవత్సరాల్లో జరిగిన ఒక టాక్సీ ప్రయాణం నాకు ఇప్పటికీ గుర్తుంది. తన కెమెరా వెనుక నుంచి ప్రకృతిని ఎంతో ఉత్సాహంగా చిత్రీకరించడంలో పాట్ గారికి ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. దృశ్యంలో కనిపించే చిన్నచిన్న లోపాల గురించి నవ్వుకుంటూనే, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆమె ఫోటోలు తీసేవారు. ఆమెతో చేసిన ప్రతి ప్రయాణం ఆప్యాయత, ఆనందంతో నిండి ఉండేది. ఆ తరువాత, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని ఆమె ఇంటిలో, స్వామి వారితో తనకు కలిగిన అనేక అనుభవాలను పంచుకునేవారు. ఒకసారి, విశ్రాంతి తీసుకునే ముందు “బ్రేస్‌లెట్ పాము” ను చూసిన సంఘటనను వివరించారు. ఆ సమయంలో తోటమాలి అక్కడే ఉండి ఏమి చేయాలో తెలిసి ఉండటం వల్ల, స్వామి వారి కృప తనను ఎలా రక్షించిందో చెబుతున్న ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
నా దృష్టిలో, పాట్ గారు వినయానికి ప్రతిరూపమైన నిజమైన గురువు. అనేక ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ నిరాడంబరంగా ఉండేవారు. ఇతరులకు సేవ చేయాలనే ప్రేమ మాత్రమే ఆమెకు మార్గదర్శకంగా ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, ఆమెను నా స్నేహితురాలిగా పిలిచే భాగ్యం నాకు లభించడం ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆమె హృదయపూర్వకమైన, ప్రేమతో నిండిన వ్యక్తిత్వం ఆమెను కలిసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేది.
సునీల్ సైనీ11573…ఇండియా
కాంబో క్వెరీల (Combo Queries) ద్వారా పాట్ హంట్ గారితో నాకు మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆమె అందించిన మార్గదర్శకత్వం ఎప్పుడూ అత్యంత ఖచ్చితంగా, సముచితంగా ఉండేది. SVP ఈ-కోర్సులో ఆమె విద్యార్థిగా ఉండే భాగ్యం నాకు లభించడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను అడిగే చిన్నచిన్న, కొన్నిసార్లు అమాయకంగా అనిపించే ప్రశ్నలను కూడా ఆమె ఎప్పుడూ తక్కువగా చూడలేదు. ప్రతిసారీ ప్రేమపూర్వకంగా, వివరంగా సమాధానం ఇచ్చేవారు. సాధారణంగా నేను అధ్యాయాలను నిర్ణీత సమయానికి ముందుగానే పూర్తి చేసేవాడిని. అయితే, ఒకసారి నా సమాధానం ఆలస్యమైంది. అప్పుడు ఒక అపరిచిత నంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. అది పాట్ గారిదే. ఆమె నా ఆరోగ్యం, క్షేమం గురించి నిజమైన ఆందోళనతో అడిగారు. ఆమె చూపిన ఆప్యాయతకు నేను ఎంతో హృదయపూర్వకంగా స్పృశించబడ్డాను. నా వల్ల ఆమె ఆందోళన చెందాల్సి వచ్చినందుకు కొంత అపరాధ భావన కూడా కలిగింది. భవిష్యత్తు కోసం తన ఫోన్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలని కూడా ఆమె నన్ను కోరారు. (తరువాత తెలిసింది ఏమిటంటే, ఆమె సాధారణంగా విద్యార్థులతో ఇలా చేయడం చాలా అరుదు.) నా దృష్టిలో, ప్రత్యక్ష శిక్షణా శిబిరంలో అత్యంత విశేషమైన ఘట్టం ఏమిటంటే, నా అభ్యర్థన మేరకు ఆమె దయతో శిక్షణా శిబిరంకు విచ్చేసి పాల్గొన్నవారిని ఆశీర్వదించడం. డా. అగర్వాల్ గారు కూడా దీనిని చూసి ఆనందకరమైన ఆశ్చర్యానికి గురైనట్లు అనిపించింది, ఎందుకంటే ఆమె ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చేయలేదని తెలిసింది.
అనేక ఇతర సందర్భాల్లో కూడా ఆమెతో మమేకమయ్యే భాగ్యం నాకు కలిగింది. క్లిష్టమైన కేసుల విషయంలోనూ, ధ్యానం, చక్రాలు మరియు కుండలినీ జాగృతి, బంధనాల నుంచి విముక్తి (Cutting Ties), అలాగే SM కార్డులలోని “గోల్డెన్ లైట్” (దీనిని ఆమె “భగవంతుని వరం”గా పేర్కొనేవారు) వంటి లోతైన ఆధ్యాత్మిక అంశాల విషయంలోనూ ఆమెతో చర్చించే అవకాశం లభించింది. ప్రతి విషయంలోనూ ఆమె అవగాహన, మార్గదర్శకత్వం అమూల్యమైనవి. ఆమె పంచుకున్న కొన్ని ముత్యాల వంటి వాక్యాలు నేటికీ నాకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినిస్తున్నాయి:
“స్వామి మీకు కుండలినీ శక్తిని మేల్కొలిపే వరాన్ని ప్రసాదించారు. అనేక సంవత్సరాల క్రితం ఆయన నా కుండలినీని మేల్కొలిపినట్లే, మీది కూడా మేల్కొల్పారు. దీని ద్వారా మీరు క్రమంగా గాఢమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు.”
“మీరు బాబా వారి దివ్యశక్తికి సంపూర్ణ శరణాగతి అవసరమయ్యే ఒక సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ సేవ మీలో ఇప్పటికే క్రియాశీలంగా ఉన్న దివ్యశక్తిని మరింత ఉజ్జీవింపజేస్తుంది.”
“వైబ్రియానిక్స్ ద్వారా మీరు ప్రేమతో నిండిన హృదయంతో అవసరంలో ఉన్నవారికి సేవ చేస్తారు.”
నా దృష్టిలో, మానవాళికి ఆమె అందించిన అత్యంత గొప్ప సేవ ఇమ్యూనిటీ బూస్టర్ (IB) రూపకల్పన. అదేవిధంగా, కాలక్రమేణా ఆమె CCs (కామన్ కాంబోలు) లో చేసిన అనేక మెరుగుదలలు కూడా విశేషమైనవే. వైబ్రియానిక్స్ అభివృద్ధి మరియు విస్తరణలో ఆమె వదిలిన వారసత్వం చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. ఆమె సేవలు, కృషి మరియు దూరదృష్టి వైబ్రియానిక్స్ చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
ప్రశ్నలు జవాబులు
Q1. తన వైబ్రియానిక్స్ సేవలో స్థిరమైన ఫలితాలను స్వయంగా చూడకపోతే, ఒక కొత్త ప్రాక్టీషనర్ వైబ్రియానిక్స్‌పై 100% విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకొని, తన రోగుల్లో విశ్వాసాన్ని ఎలా కలిగించగలడు?
A. ఒక కొత్త ప్రాక్టీషనర్ వైబ్రియానిక్స్‌పై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ముందుగా తనలోనే ఆ విశ్వాసాన్ని అనుభవించాలని కోరుకోవడం సహజమే. అప్పుడే అతను ఇతరులలో కూడా నమ్మకాన్ని కలిగించగలడు. కోర్సులో చేరే ముందు, ప్రతి అభ్యర్థిని వైబ్రియానిక్స్ స్వస్థత శక్తిని వ్యక్తిగతంగా అనుభవించమని ప్రోత్సహిస్తారు. ఈ ప్రారంభ అనుభవాలు, అలాగే అభ్యర్థులు అధ్యయనం చేయమని సూచించబడే అనేక నమోదు చేయబడిన కేసు చరిత్రలు, విశ్వాసానికి పునాది వేస్తాయి. అయితే, మనలో చాలామందికి అత్యంత బలమైన భరోసా ఏమిటంటే, ఈ వైద్య విధానం మన ప్రియమైన స్వామి వారి ప్రేమపూర్వక మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుందని తెలుసుకోవడం. ఆ దివ్య మూలమే విశ్వాసానికి తొలి జ్యోతిగా నిలుస్తుంది.
మీ స్వంత అనుభవాలు పెరిగే వరకు, వైబ్రియానిక్స్ కుటుంబం నుండి ప్రేరణ మరియు బలాన్ని పొందండి. న్యూస్‌లెటర్లు, అనుభవ సాక్ష్యాలు (టెస్టిమోనియల్స్), మరియు కాన్ఫరెన్స్ పుస్తకాలను మీ రోగులతో పంచుకోండి. సీనియర్ ప్రాక్టీషనర్ల మార్గదర్శకత్వాన్ని కోరండి. వారు క్లిష్టమైన కేసులలో ప్రేమతో మీకు సహాయపడుతూ, మీ ఎదుగుదలకు తోడ్పడతారు. కాలక్రమేణా, మీ విశ్వాసం కేవలం ఒక భావనగా కాకుండా, ప్రత్యక్ష అనుభవంగా మారుతుంది. మీ చిత్తశుద్ధి, భక్తి మరియు అంకితభావం సహజంగానే ఇతరులకు నమ్మకాన్ని కలిగిస్తాయి. మీ సేవ వెనుక ఉన్న దివ్యశక్తిని రోగులు కూడా అనుభూతి చెందుతారు. అప్పుడు వైబ్రియానిక్స్ కేవలం ఒక స్వస్థతా విధానంగా కాకుండా, స్వామి వారి పదపద్మాలకు సమర్పించే ఒక పవిత్రమైన అర్పణగా మారుతుంది. అయితే, నిజమైన విశ్వాసం ఆచరణ ద్వారా వికసిస్తుంది. ప్రతి రోగిని వినయంతో, పవిత్రతతో మరియు నిస్వార్థ సేవాభావంతో సమీపించినప్పుడు, మీరు క్రమంగా మెరుగుదలలను గమనించడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు అద్భుతాలుగా అనిపించే ఫలితాలను కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది.
____________________________________________________________________________
Q2. మన మాన్యువల్ ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులను ఒకేసారి ఒక్కటిగా చికిత్స చేయడం ఉత్తమమని సూచించబడింది. అయితే, చాలామంది రోగులకు అనేక ఇబ్బందికరమైన సమస్యలు ఉంటాయి మరియు వాటన్నింటికీ ఒకేసారి చికిత్స కావాలని కోరుకుంటారు. అలాంటి పరిస్థితిలో రోగికి గరిష్ట ఉపశమనం కలిగేలా ఎలా సమతుల్యత పాటించాలి?
A. దీర్ఘకాలిక వ్యాధులకు ఒక సమయంలో ఒకదానికి మాత్రమే చికిత్స చేయాలనే మార్గదర్శకత్వం లోతైన ఆచరణాత్మక జ్ఞానంపై ఆధారపడి ఉంది. తరచుగా, అత్యంత పాత వ్యాధియే మూల కారణంగా ఉండి, దాని నుంచే తరువాతి సమస్యలు ఉద్భవిస్తాయి. కాబట్టి, ఆ మూల సమస్యను పరిష్కరించినప్పుడు, తరువాత వచ్చిన సమస్యలు సహజంగానే తగ్గిపోవచ్చు. అయితే, అత్యంత పాత వ్యాధి రోగిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య కాకపోతే, ముందుగా అతనికి ఎక్కువ అసౌకర్యం కలిగిస్తున్న సమస్యను చికిత్స చేయడం మంచిది. ఇది రోగికి తన బాధను గౌరవిస్తున్నామనే భావనను కలిగించి, అతని స్వస్థత ప్రయాణంపై విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఒకేసారి చాలా దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స చేయడం గందరగోళాన్ని సృష్టించవచ్చు, ముఖ్యంగా పుల్లౌట్ సంభవించినప్పుడు. ఏ రెమిడీ శరీర శుద్ధి (క్లెంసింగ్) ప్రక్రియను ప్రేరేపించిందో గుర్తించడం కష్టమవుతుంది. అప్పుడు రోగికి ధైర్యంగా సరైన మార్గనిర్దేశం చేయడం కూడా క్లిష్టమవుతుంది. అనుభవం ఏమి చూపిందంటే, అనేక దీర్ఘకాలిక సమస్యలను ఒకేసారి చికిత్స చేసినప్పుడు పురోగతి మందగించవచ్చు. దాంతో రోగి తన విశ్వాసాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. స్వస్థత పొందటానికి సహనం, పట్టుదల మరియు వివేకం అవసరమైన ప్రక్రియలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
అయితే, ఈ సాంకేతిక వివరాలన్నింటితో రోగిని భారపరచాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యం ఏమిటంటే, రోగి మాటలను కరుణతో వినడం, అతనిని ఎక్కువగా బాధిస్తున్న సమస్యకు ప్రాధాన్యత ఇవ్వడం, మరియు రెమిడీలను వివేకంతో ఎంపిక చేయడం. ఉదాహరణకు, రోగి ప్రస్తుతం తీసుకుంటున్న వైద్య చికిత్సలను దృష్టిలో ఉంచుకొని, అంతర్గతంగా తీసుకునే రెమిడీతో పాటు బాహ్య వినియోగానికి మరో రెమిడీని కలిపి ఇవ్వవచ్చు. వైబ్రియానిక్స్ అనేది కఠినమైన నియమాలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థ కాదు; అది జీవంతో కూడిన, అంతర్‌ప్రేరణ ఆధారంగా పనిచేసే విధానం. పరిస్థితి నిజంగా ఒకటి కంటే ఎక్కువ సమస్యలను ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరాన్ని సూచిస్తే, ప్రాక్టీషనర్ తన అంతరంగ వివేకం మార్గదర్శకత్వంలో ముందుకు సాగవచ్చు. అయితే, అత్యంత ముఖ్యమైన విషయం సమగ్ర రికార్డు నిర్వహణ. మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో, ఏ రెమిడీలు ఇచ్చారో, వాటి తరువాత వచ్చిన ఫలితాలేమిటో అన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేయాలి.
____________________________________________________________________________
Q3. సాయి వైబ్రియానిక్స్ ద్వారా తెలిసిన లేదా తెలియని ఏ రకమైన వ్యాధినైనా నయం చేయవచ్చని నాకు చెప్పారు. ఇది నిజమేనా?
A. సాయి వైబ్రియానిక్స్ అనేది, శరీరంలోని సూక్ష్మ శక్తి క్షేత్రాలలో ఏర్పడే అసమతుల్యతల వల్లే వ్యాధులు ఉత్పన్నమవుతాయనే అవగాహనపై ఆధారపడి ఉంది. సరైన ప్రకంపన (వైబ్రేషన్) ద్వారా ఆ సమతుల్యతను పునరుద్ధరించి, శరీరంలోని సహజ స్వస్థత ప్రక్రియను చైతన్యవంతం చేయవచ్చని ఇది భావిస్తుంది. ఈ దృష్టికోణంలో చూస్తే, ఈ విధానానికి శారీరక, భావోద్వేగ లేదా శక్తి సంబంధిత ఏ అసమతుల్యతనైనా పరిష్కరించే సామర్థ్యం ఉందని భావించబడుతుంది. అందువల్లనే, వైబ్రియానిక్స్ ఏ వ్యాధినైనా నయం చేయగలదని చాలామంది విశ్వసిస్తారు. ఎందుకంటే దీని ప్రాథమిక సూత్రం సార్వత్రికమైనదిగా, ఆధ్యాత్మికంగా ఎంతో లోతైనదిగా పరిగణించబడుతుంది.
అయితే, ఆధునిక శాస్త్రం ఈ సూక్ష్మ శక్తులను అర్థం చేసుకునే విషయంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉందని మనం అంగీకరించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీషనర్లు వేలాది వాస్తవ జీవిత స్వస్థత అనుభవాలను గమనించినప్పటికీ, వాటికి సంబంధించిన శాస్త్రీయ ధృవీకరణ ప్రక్రియ ఇంకా అభివృద్ధి చెందుతోంది. సమాచారం మరియు అనుభవ ఆధారాలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, ఈ స్వస్థత ప్రకంపనల వెనుక పనిచేసే ఖచ్చితమైన యాంత్రిక ప్రక్రియలు ఇప్పటికీ పరిశోధనలో ఉన్న అంశాలుగానే ఉన్నాయి.
నిరంతర పరిశోధన, నిరంతర ఆచరణ, అలాగే బయోఎనర్జెటిక్స్ పై లోతైన అధ్యయనం ద్వారా వైబ్రియానిక్స్ యొక్క సంపూర్ణ పరిధి, సామర్థ్యం మరియు పరిమితులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము. అంతవరకు, మనం వినయంతో ఈ మార్గంలో ముందుకు సాగాలి. ఇతర స్వస్థతా విధానాలతో సహకార భావంతో కలిసి నడుస్తూ, ఈ వ్యవస్థ యొక్క దివ్య మూలాన్ని విశ్వసిస్తూ, తోటి ప్రాక్టీషనర్ల మరియు అనేక మంది రోగుల అనుభవాలను గౌరవిస్తూ, ఒక రోజు శాస్త్రం మన హృదయాలకు ఇప్పటికే తెలిసిన సత్యాన్ని ధృవీకరిస్తుందనే ఆశతో ముందుకు సాగాలి.
____________________________________________________________________________
Q4. హైపోనాట్రిమియా (రక్తంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండటం) వంటి వైద్య పరిస్థితిని వైబ్రియానిక్స్ ద్వారా పరిష్కరించవచ్చా?
A. వైబ్రియానిక్స్‌లో రక్తంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండే పరిస్థితి (హైపోనాట్రిమియా) కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రత్యక్ష రెమిడీ లేదు. అంతేకాకుండా, హైపోనాట్రిమియా కొన్నిసార్లు తీవ్రమైన అంతర్లీన వ్యాధికి సంకేతంగా ఉండవచ్చు. అందువల్ల, ఈ సమస్యకు మూల కారణం ఏమిటో గుర్తించడానికి రోగి తప్పనిసరిగా తగిన వైద్య పరీక్షలు మరియు వైద్యుల మూల్యాంకనం పొందడం చాలా అవసరం. అయితే, వైబ్రియానిక్స్ సహాయక పాత్రను పోషించగలదు. రోగికి సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సున్నితంగా సూచించవచ్చు. ఉదాహరణకు: బీట్ ఆకులు, సెలరీ, డబ్బాల్లో నిల్వ చేసిన బఠానీలు లేదా బీన్స్, ఊరగాయలు మరియు పులియబెట్టిన కూరగాయలు. ఇలాంటి ఆహారాలు శరీరంలో కనీస అవసరమైన సోడియం సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడవచ్చు. అదేవిధంగా, సోడియం అధికంగా పలుచబడిపోకుండా ఉండేందుకు, ద్రవాలను (నీరు మొదలైనవి) మితంగా మరియు జాగ్రత్తగా తీసుకోవాలని కూడా సూచించవచ్చు. ఈ చర్యలతో పాటు, NM34 Water Balance రెమిడీ శరీరంలోని అంతర్గత సమతుల్యతను కాపాడడంలో సహాయపడవచ్చు, అదే సమయంలో అంతర్లీన కారణానికి సంబంధించిన వైద్య చికిత్స కొనసాగుతుంది. అందువల్ల, హైపోనాట్రిమియా వంటి పరిస్థితులలో వైబ్రియానిక్స్‌ను ప్రధాన వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా కాకుండా, సహాయక విధానంగా ఉపయోగించడం సముచితం.
దివ్య వైద్యుని దివ్య వాణి
“మనిషి తెలిసో తెలియకో అనేక అపరాధాలు చేస్తుంటాడు. అవి ఈ జన్మలోనే కాక, పూర్వజన్మలలో చేసినవి కూడా ఉండవచ్చు. ఆ కర్మల ముద్రలను చిత్తం (జ్ఞాపకశక్తి) అనేక జన్మలపాటు మోస్తూ ఉంటుంది. మనస్సు అనే అద్దం ఇంతగా మలినమై ఉన్నప్పుడు, అది ఏ విషయాన్నీ యథార్థ రూపంలో గ్రహించలేదు. అందువల్లే మనిషి తన నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి, ఆ అద్దంపై పేరుకుపోయిన మలినాలను తొలగించి దానిని శుద్ధి చేయడం అవసరం. అది ఎలా సాధ్యమవుతుంది? ఆహారం మరియు వినోద సంబంధమైన అలవాట్లను నియంత్రించడం ద్వారా. మనం తీసుకునే ఆహారం ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించబడిందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. నేడు మనుషులు అనుభవిస్తున్న అనేక కష్టాలకు కారణం, వారు వినియోగించే వస్తువులు అధర్మ మార్గంలో సంపాదించబడినవే కావడం.”
...సత్యసాయి బాబా, “ప్యూరిటీ ఆఫ్ ది మైండ్”, దివ్య ప్రసంగం, 25 మే 1990 https://saispeaks.sathyasai.org/discourse/purity-mind-role-senses
“మీరు చేపట్టే ఏ సేవా కార్యక్రమానికైనా మీరే కర్తలమని భావించడం ఒక పొరపాటు. అలా ఎన్నటికీ జరగకూడదు. వాస్తవానికి, మీరు నిర్వహిస్తున్న ప్రతి సేవా కార్యక్రమం మీ స్వీయ ఉన్నతికోసమే. ఈ సేవా కార్యక్రమాలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మసంతృప్తితో, ఆత్మత్యాగంతో, చివరకు ఆత్మసాక్షాత్కారాన్ని లక్ష్యంగా చేసుకొని నిర్వహించబడాలి. ఈ విధంగా సేవాభావం ఆత్మ నుంచే వికసిస్తుంది.”
…సత్యసాయి బాబా, “అండర్‌స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్”, దివ్య ప్రసంగం, 11 ఏప్రిల్ 2005. https://sssbpt.info/ssspeaks/volume38/sss38-08.pdf
ప్రకటనలు
రాబోయే వర్క్‌షాప్‌లు
• యుకే, లండన్: సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ మీట్, 17 మే 2026, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
• భారతదేశం, పుట్టపర్తి: ప్రాక్టీషనర్ల కోసం అఖిల భారత వర్చువల్ రిఫ్రెషర్ కోర్సు, 30-31 మే 2026, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]#
• భారతదేశం, పుట్టపర్తి: తెలుగు AP* ప్రాక్టికల్ వర్క్‌షాప్, 9-13 జూలై 2026**, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
• భారతదేశం, పుట్టపర్తి: AVP* ముఖాముఖి వర్క్‌షాప్, 15-19 జూలై 2026**, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
• భారతదేశం, పుట్టపర్తి: SVP* వర్క్‌షాప్, 21-25 జూలై 2026**, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
• భారతదేశం, ఢిల్లీ: హిందీ AP* ప్రాక్టికల్ వర్క్‌షాప్, 22-26 సెప్టెంబర్ 2026**, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
• భారతదేశం, పుట్టపర్తి: AVP* ముఖాముఖి వర్క్‌షాప్, 26-30 నవంబర్ 2026**, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]
* ప్రవేశ ప్రక్రియ మరియు ఈ-కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే.
** తేదీలలో మార్పులు ఉండవచ్చు.
# రెండు రోజులూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.
అదనంగా
1. ఆరోగ్య వ్యాసం
పురుషులారా! మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి!
“పురుషులకు స్త్రీలకన్నా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. స్త్రీలు ఎదుర్కొనే అనేక పరిమితులు వారికి ఉండవు. అలాంటి స్వేచ్ఛను సమాజ సేవ కోసం ఉపయోగించకపోతే మీ విద్యకు ప్రయోజనం ఏమిటి? ప్రతి చోటా మనిషి సుఖంగా, శాంతిగా జీవించాలని కోరుకుంటాడు. అయితే, సుఖం మరియు శాంతి ప్రాపంచిక కార్యకలాపాల ద్వారా లభించవు. సుఖంగా, సురక్షితంగా ఉండాలని కోరుకునే ఈ శరీరం వ్యాధి, క్షీణత మరియు మరణానికి లోబడి ఉంటుంది. అయితే, శరీరంలో నివసించే ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అదే ఆత్మ, అదే భగవంతుడు. శరీరం భగవంతుని ఆలయం. కాబట్టి, ఆ ఆలయాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం ప్రతి మనిషి కర్తవ్యం.”… సత్యసాయి బాబా1,2
పరిచయం: మా న్యూస్‌లెటర్ గత సంచికలో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ గురించి విస్తృతంగా చర్చించాము. అలాగే, పురుషులు కూడా బాల్యం నుండి జీవితాంతం వివిధ శారీరక మరియు క్రియాత్మక మార్పులను అనుభవిస్తారు. కాబట్టి, ఎదుగుదలలో ఎదురయ్యే వివిధ శారీరక మార్పులు మరియు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వారు తమ పునరుత్పత్తి ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
1. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ
లైంగిక క్రియలు, పునరుత్పత్తి, మరియు మూత్ర విసర్జనకు బాధ్యత వహించే ముఖ్యమైన పునరుత్పత్తి అవయవాలు (జననేంద్రియాలు) శరీరంలో కటి ప్రాంతం (పెల్విస్) లోపల మరియు వెలుపల రెండింటిలోనూ ఉంటాయి.3-6
1.1 బాహ్య జననేంద్రియాలు : పురుషాంగం (పెనిస్); ఇది స్పాంజి వంటి కణజాలంతో నిర్మితమై ఉంటుంది. దీని కొన భాగాన్ని గ్లాన్స్ లేదా శిరస్సు అని పిలుస్తారు. ఇది ఫోర్‌స్కిన్ అనే చర్మపు పొరతో కప్పబడి ఉంటుంది. ఈ భాగంలో అనేక సున్నితమైన నాడీ చివరలు (నర్వ్ ఎండింగ్స్) ఉంటాయి. వృషణకోశం (స్క్రోటమ్) ; ఇది పురుషాంగం వెనుక భాగంలో వేలాడుతూ ఉండే, చర్మంతో ఏర్పడిన ఒక వదులైన సంచిలాంటి నిర్మాణం. ఇందులో రెండు అండాకార వృషణాలు (టెస్టిస్) స్థిరంగా ఉంటాయి. ఈ వృషణాలే లక్షలాది సూక్ష్మ వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. వృషణకోశం ఒక సహజ ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. సాధారణ వీర్యకణాల అభివృద్ధికి అవసరమైన విధంగా, వృషణాల ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువగా ఉంచుతుంది. శరీరానికి చలి అనిపించినప్పుడు, వృషణకోశం కుంచించుకొని బిగుతుగా మారి వేడిని నిలుపుకుంటుంది. శరీరం వేడిగా ఉన్నప్పుడు, అది విస్తరించి వదులుగా మారి అదనపు వేడిని బయటకు పంపిస్తుంది.
వృషణాలు అంతఃస్రావ గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్) లో కూడా భాగమే. ఇవి యుక్తవయస్సు సమయంలో మరియు తరువాత టెస్టోస్టెరోన్ సహా పలు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.³⁻⁶
1.2: అంతర్గత పునరుత్పత్తి అవయవాలు: ఎపిడిడిమిస్ అనేది ప్రతి టెస్టిస్ వెనుక భాగంలో, స్క్రోటమ్
లోపల ఉండే బిగుతుగా చుట్టుకుపోయిన గొట్టం. ఇది వీర్యకణాలు పరిపక్వం చెందడానికి, నిల్వ ఉండడానికి మరియు రవాణా చేయడానికి సహాయపడుతుంది
వాస్ డిఫెరెన్స్ అనేది ఎపిడిడిమిస్‌కు అనుసంధానమైన కండరాలతో కూడిన గొట్టం. ఇది పరిపక్వమైన వీర్యకణాలను పై భాగంలో ఉన్న ఆక్రోటు (వాల్‌నట్) పరిమాణంలో ఉండే ప్రోస్టేట్ గ్లాండ్ వరకు తీసుకెళ్తుంది. యూరేథ్రా అనే నాళం ఈ గ్రంథి మధ్య భాగం గుండా ప్రయాణిస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వీర్యంలో ఉండే అదనపు ద్రవాన్ని ఉత్పత్తి చేసి వీర్యకణాలకు పోషణ అందిస్తుంది. అలాగే, యూరేథ్రా ను స్నిగ్ధంగా (లూబ్రికేట్) చేయడంలో సహాయపడుతుంది. యూరేథ్రా ద్వారానే మూత్రం మరియు వీర్యం రెండూ పెనిస్ ద్వారా బయటకు వెళ్తాయి. సెమినల్ వెసికల్స్ అనేవి మూత్రాశయం కింద భాగంలో ఉండే రెండు చిన్న గ్రంథులు. ఇవి వాస్ డిఫెరెన్స్ కు అనుసంధానమై ఉంటాయి. వీర్యంలో ఉండే ద్రవంలో ఎక్కువ భాగాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. ఈ ద్రవమే వీర్యస్ఖలనం సమయంలో స్పె వీర్యకణాలను బయటకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.³⁻⁶
2. పురుషుల ఎదుగుదల దశలు
పురుషుల ఎదుగుదల వారి జన్యు లక్షణాలు మరియు ఇతర అంశాలపై ఆధారపడి వివిధ రేట్లలో జరుగుతుంది. సాధారణంగా ఎక్కువ శారీరక ఎదుగుదల యుక్తవయస్సు లో జరుగుతుంది. అయితే కొందరు వ్యక్తులు తమ 20వ దశకంలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటారు.⁷
2.1 యుక్తవయస్సు: యుక్తవయస్సు అనేది శరీరం సహజసిద్ధంగా శారీరకంగా వయోజన దశకు చేరుకునే
ప్రక్రియ. ఈ సమయంలో ప్రధాన అవయవాలు మరియు శరీర వ్యవస్థలు క్రమంగా పరిపక్వత చెందుతాయి. ఈ ప్రక్రియ ప్రధానంగా పిట్యూటరీ గ్లాండ్ ద్వారా ప్రేరేపించబడి నియంత్రించబడుతుంది. వృషణాలు సుమారు 95% టెస్టోస్టెరోన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. యుక్తవయస్సు ప్రారంభంలో, సాధారణంగా 11 సంవత్సరాల వయస్సు ప్రాంతంలో, టెస్టోస్టెరోన్ స్థాయిలు రక్తంలో సుమారు 25-30 ng/dL (నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్) నుండి వేగంగా పెరిగి, వయోజన పురుషులలో 300-1000 ng/dL వరకు చేరుకుంటాయి. దీని ఫలితంగా బాలుర శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి: స్క్రోటమ్ మరియు టెస్టీస్ పరిమాణం పెరుగుతాయి, పెనిస్ పొడవు పెరుగుతుంది, ప్యూబిక్ ప్రాంతం, చంకలు మరియు ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి, సెమినల్ వెసికల్స్ మరియు ప్రోస్టేట్ గ్లాండ్ అభివృద్ధి చెందుతాయి, వీర్యకణాలను ఉత్పత్తి ప్రారంభమవుతుంది, కండరాలు పెద్దవిగా మరియు బలంగా మారుతాయి, భుజాలు వెడల్పవుతాయి, గొంతు స్వరం గంభీరంగా మారుతుంది; కొంతకాలం స్వరంలో పగుళ్లు (వాయిస్ క్రాకింగ్) కనిపించవచ్చు, ఎత్తు మరియు బరువు పెరుగుతాయి, చెమట ఎక్కువగా పట్టడం ప్రారంభమవుతుంది, శరీర వాసన పెరుగుతుంది, చర్మం జిడ్డుగా మారడం మరియు మొటిమలు రావడం సంభవించవచ్చు. యుక్తవయస్సులో హార్మోన్ ఉత్పత్తి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటే, పై మార్పులు తక్కువగా కనిపించవచ్చు లేదా ఆలస్యంగా సంభవించవచ్చు. అదే హార్మోన్ ఉత్పత్తి అధికంగా ఉంటే, యుక్తవయస్సు సాధారణం కంటే ముందుగానే, సుమారు 9 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.7-11
యుక్తవయస్సు (ప్యూబర్టీ) సమయంలో బాలికల మాదిరిగానే, అయితే కొంత భిన్న స్థాయిలో, బాలురు కూడా వివిధ శారీరక మార్పులను ఎదుర్కొంటూ కొన్ని భావోద్వేగ అసౌకర్యాలను అనుభవిస్తారు. వారు కొన్నిసార్లు ఇబ్బందిగా, ఆత్మవిశ్వాసం లేనట్లుగా లేదా అసురక్షిత భావనతో కూడా ఉండవచ్చు. తల్లిదండ్రులు ఈ విషయాలను గమనిస్తూ, తమ పిల్లలతో సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడి, వారి శరీరంలో జరుగుతున్న మార్పులు మరియు వారు అనుభవిస్తున్న పరిస్థితుల గురించి వారికి సౌకర్యంగా అనిపించేలా చేయాలి. ఈ మార్పులకు అలవాటు పడే క్రమంలో, ఆందోళన, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ లేదా దూకుడు ప్రవర్తన వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. జాగ్రత్త! వారు ఎదుగుతున్న కొద్దీ, యువకులు మద్యం సేవించడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర ప్రవర్తనలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. 7-11
2.2 లేట్-ఆన్‌సెట్ హైపోగోనాడిజమ్: స్త్రీలు తమ 40లు, 50ల వయస్సులో అనుభవించే మెనోపాజ్ మాదిరిగా పురుషులు ఎటువంటి దశను అనుభవించరు. చాలా మంది పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడా సాధారణ పరిధిలోనే ఉంటాయి. 30లు, 40ల వయస్సు నుండి జీవక్రియ నెమ్మదించడం ప్రారంభమవడంతో, పురుషులలో ఫెర్టిలిటీ తగ్గుదల చాలా క్రమంగా జరుగుతుంది. సాధారణంగా 40 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి సంవత్సరం టెస్టోస్టెరోన్ స్థాయి సుమారు 1% చొప్పున తగ్గుతుంది. ఈ తగ్గుదల 50 సంవత్సరాల తరువాత వేగవంతమై స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. దీని ఫలితంగా: శరీరంలో కొవ్వు పంపిణీ విధానం మారుతుంది, నడుము మరియు పొట్ట చుట్టూ అదనపు బరువు పెరుగుతుంది, తలపై వెంట్రుకలు తగ్గుతాయి, చెవులు మరియు ముక్కులో వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత విశ్రాంతినిచ్చే నిద్ర లేకపోవడం లేదా అసమయ నిద్ర, అలాగే వ్యాయామం లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు.7,9,12-14
2.3 వృద్ధాప్య పురుషుల్లో ఆరోగ్య ముప్పులు: ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులలో సాధారణంగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధులు: హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు), అధిక కొలెస్ట్రాల్, ఆర్థ్రైటిస్, ఊబకాయం, వీటి తరువాత: డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే, వ్యక్తి జీవనశైలి మరియు అలవాట్లను బట్టి డిప్రెషన్, ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా సంభవించవచ్చు. భారతదేశంలో, ఎక్కువ మంది పురుషులు ప్రధానంగా: హృదయ మరియు రక్తనాళ సంబంధిత వ్యాధులు, హైపర్‌టెన్షన్తో బాధపడుతున్నారు. వీటి తరువాత: కండరాలు మరియు అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, డయాబెటిస్, ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాలలో వృద్ధులలో కంటి సంబంధిత వ్యాధులు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి.¹⁵⁻¹⁷
3. పురుషుల్లో పునరుత్పత్తి లేదా హార్మోన్ల సంబంధిత రుగ్మతలు
3.1 సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం: యువ పురుషులలో సంతానోత్పత్తి సమస్య అనగా తక్కువ
వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల కదలిక సామర్థ్యం తగ్గడం, లేదా వీర్యకణాల ఆకృతి అసాధారణంగా ఉండడం వల్ల గర్భధారణ జరగకపోవడం. ఇవి ప్రధానంగా వృషణాల చుట్టూ ఉబ్బిన సిరలు (వేరికోసీల్), ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల లేదా జన్యుపరమైన సమస్యలు, అలాగే మద్యపానం మరియు ధూమపానం వంటి జీవనశైలి కారణాల వల్ల సంభవిస్తాయి. 50 సంవత్సరాల వయస్సు తర్వాత, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. వీర్యకణాల DNA దెబ్బతినడం, వృషణాలు చిన్నవిగా మారడం లేదా మెత్తబడడం వంటి మార్పులు కనిపించవచ్చు. ఫలితంగా గర్భస్రావం జరిగే ప్రమాదం పెరగడమే కాకుండా, సంతానంలో ఆటిజం, స్కిజోఫ్రేనియా, మరియు ఇతర జన్యుపరమైన అసాధారణతలు వంటి అభివృద్ధి సంబంధిత రుగ్మతలు వచ్చే ప్రమాదం కూడా అధికమవుతుంది.18,19,20
3.2 అంగస్తంభన లోపం: సంతృప్తికరమైన లైంగిక కార్యాచరణకు అవసరమైనంత స్థాయిలో అంగస్తంభన
పొందలేకపోవడం లేదా దానిని కొనసాగించలేకపోవడాన్ని అంగస్తంభన లోపం అంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు పురుషాంగానికి రక్తప్రసరణ తగ్గడం, మధుమేహం, కొన్ని మందుల దుష్ప్రభావాలు, లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం. ఇటీవలి కాలంలో అనారోగ్యకర జీవనశైలి అలవాట్లు మరియు మానసిక కారణాల వల్ల యువకులలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.21,22
3.3 హార్మోన్ల అసమతుల్యత: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల శరీర విధులు, నిద్ర విధానాలు, శక్తి స్థాయిలు మారిపోవచ్చు. వేగవంతమైన జీవనశైలి, అధిక ఒత్తిడి, సరైన ఆహారం మరియు
వ్యాయామం లేకపోవడం వల్ల లైంగిక సమస్యలు కూడా కలగవచ్చు. ఇవి ప్రధానంగా క్రింది విధంగా ఉంటాయి: దీర్ఘకాలిక ఒత్తిడి: దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురికావడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కోర్టిసోల్ స్థాయిలలో మార్పులు సంభవించి, మెదడు మబ్బుగా అనిపించడం (బ్రెయిన్ ఫాగ్), శరీర నొప్పులు, మరియు నిద్రలో అంతరాయాలు వంటి సమస్యలు కలగవచ్చు. హైపోథైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం వల్ల కలిగే ఈ పరిస్థితిలో బరువు పెరగడం, అలసట, మరియు చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్‌థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల బరువు తగ్గడం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, మరియు వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టెస్టోస్టెరాన్ లోపం: దీని లక్షణాలలో కండరాల పరిమాణం తగ్గడం, శరీర కొవ్వు పెరగడం, కారణం తెలియని స్వల్ప రక్తహీనత, రొమ్ములలో నొప్పి లేదా వాపు, శరీర వెంట్రుకలు తగ్గిపోవడం, నిరాశ, వేడి అలజడులు (హాట్ ఫ్లాషెస్) లేదా చెమటలు, అంగస్తంభన లోపం, లైంగిక ఆసక్తి తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం, కీళ్ల నొప్పులు, అలసట, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి తగ్గడం, అధిక నిద్రమత్తు లేదా నిద్రలో అంతరాయాలు ఉంటాయి. అదనంగా, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, స్థూలకాయం, తీవ్రమైన అనారోగ్యం లేదా ఆసుపత్రిలో చేరడం వల్ల కలిగే ఒత్తిడి, అలాగే కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి.23-25
3.4 బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా - బిపిహెచ్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్: వయస్సు పెరుగుతున్న కొద్దీ, సాధారణంగా 50 సంవత్సరాల తర్వాత, ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. ఇది సుమారు 50% 
మంది పురుషులలో కనిపిస్తుంది. బిపిహెచ్ యొక్క లక్షణాలు: తరచుగా లేదా అకస్మాత్తుగా మూత్రవిసర్జన చేయాలనే అవసరం కలగడం, ముఖ్యంగా రాత్రివేళల్లో, మూత్రవిసర్జన ప్రారంభించడంలో లేదా ఆపడంలో ఇబ్బంది, మూత్ర ప్రవాహం బలహీనంగా, నెమ్మదిగా లేదా మధ్యలో ఆగిపోతూ ఉండడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన, మూత్రం చుక్కలుగా కారడం లేదా అదుపు తప్పి కారడం (ఇన్‌కాంటినెన్స్), మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం (ఇది క్యాన్సర్‌లో సాధారణ లక్షణం), మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట, మూత్ర రంగులో మార్పులు, బిపిహెచ్ వల్ల యూరేథ్రా అడ్డంకికి గురికావచ్చు. చికిత్స చేయకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ స్టోన్స్ లేదా కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యలు సంభవించవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో, పై లక్షణాలతో పాటు ఎముకలు, దిగువ వెన్ను, తుంటి (హిప్) పై, తొడలు లేదా ఛాతీలో తీవ్రమైన నొప్పి కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ ఎంతవరకు అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి గ్లీసన్ స్కోరింగ్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఇందులో ప్రోస్టేట్ క్యాన్సర్ స్కోరు 6 (తక్కువ గ్రేడ్ క్యాన్సర్) నుండి 10 (అధిక గ్రేడ్ క్యాన్సర్) వరకు ఉంటుంది. 26-29
3.5 ప్రోస్టాటైటిస్: ప్రోస్టేట్ గ్రంథి మరియు దాని చుట్టుపక్కల ఉన్న కణజాలాలు వాపుకు గురికావడాన్ని
ప్రోస్టాటైటిస్ అంటారు. ఇది వివిధ రకాలుగా ఉండవచ్చు: తీవ్ర ప్రోస్టాటైటిస్: జ్వరం, చలి వణుకులు వంటి లక్షణాలతో అకస్మాత్తుగా వస్తుంది. ఇది అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణించబడుతుంది. దీర్ఘకాలిక బ్యాక్టీరియల్ ప్రోస్టాటైటిస్: ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. తరచుగా పునరావృతమయ్యే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు దీనికి కారణమవుతాయి. క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్: ఇది ప్రోస్టాటైటిస్‌లో అత్యంత సాధారణ రూపం. ఇందులో క్రియాశీల ఇన్ఫెక్షన్ లేకపోయినా, పెల్విక్ ప్రాంతంలో నిరంతర నొప్పి ఉంటుంది. లక్షణాలు లేని వాపు: ఇందులో ఎటువంటి లక్షణాలు కనిపించవు. సంతానోత్పత్తి లేదా క్యాన్సర్ సంబంధిత పరీక్షల సమయంలో యాదృచ్ఛికంగా గుర్తించబడుతుంది.³⁰˒³¹
3.6 పీఎస్‌ఏ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత: పీఎస్‌ఏ (ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్) రక్త పరీక్ష ద్వారా రక్తంలో ప్రోస్టేట్ గ్లాండ్ ఉత్పత్తి చేసే ప్రోటీన్ స్థాయిని తెలుసుకోవచ్చు. పీఎస్‌ఏ స్థాయి 4 ng/mL కంటే తక్కువగా ఉంటే, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది. 4-10 ng/mL మధ్య ఉన్న స్థాయిలు, బిపిహెచ్ లేదా ప్రోస్టాటిటిస్ వంటి నిరపాయకర పరిస్థితులను సూచించవచ్చు మరియు తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు. 10 ng/mL కంటే ఎక్కువ విలువలు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాన్ని ఎక్కువగా సూచిస్తాయి. అయితే, పీఎస్‌ఏ అనేది క్యాన్సర్‌ను నిర్ధారించే పరీక్ష కాదని గుర్తుంచుకోవాలి; ఇది కేవలం ప్రమాద స్థాయిని సూచించే ఒక సూచిక మాత్రమే. పీఎస్‌ఏ పరీక్ష వల్ల ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, మరణాల రేటును తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: అవసరం లేని బయాప్సీలు చేయాల్సి రావచ్చు, నెమ్మదిగా పెరిగే ట్యూమర్లను అతిగా నిర్ధారించే అవకాశం ఉంటుంది, అవసరానికి మించిన చికిత్స జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.³²⁻³⁴
3.7 పురుషులలో కనిపించే ఇతర వ్యాధులు:
(i) బాలనైటిస్ - ఇది ఫోర్‌స్కిన్ మరియు పెనిస్ తల భాగంలో ఏర్పడే బాధాకరమైన, రంగు మారిన మరియు
దురదతో కూడిన ఇన్‌ఫ్లమేషన్. ఇది సాధారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుంది. కొన్నిసార్లు వైరస్, బ్యాక్టీరియా లేదా పరిశుభ్రత లోపం కారణంగా ఏర్పడే చర్మ సమస్య
ల వల్ల కూడా రావచ్చు. (ii) క్లమైడియా - ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే
అత్యంత సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందువల్ల, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్రమం తప్పకుండా యూరిన్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. (iii) పెనైల్ వార్ట్స్ - ఇవి తక్కువ ప్రమాద స్థాయి గల హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల
కలుగుతాయి. పెనిస్, స్క్రోటమ్ లేదా మలద్వారం పై చిన్న కాలీఫ్లవర్ గుత్తుల మాదిరిగా లేదా బూడిదరంగు గడ్డల మాదిరిగా కనిపిస్తాయి. ఇది సాధారణంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ మరియు మళ్లీ మళ్లీ రావచ్చు. (iv) హైడ్రోసీల్ - ఇది స్క్రోటమ్‌లో ఏర్పడే మృదువైన ద్రవంతో నిండిన గడ్డ. ఇది నవజాత శిశువులలో ఎక్కువగా కనిపిస్తుంది.
వాపు శరీరంలోని సున్నితమైన భాగంలో ఉండటం వల్ల ఆందోళన కలిగించవచ్చు, అయితే ఎల్లప్పుడూ నొప్పిని కలిగించకపోవచ్చు. (v) వెరికోసీల్ - ఇందులో స్క్రోటమ్‌లోని సిరలు (వీన్స్) పురుగుల సంచి లాగా విస్తరిస్తాయి. ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు ఎక్కువయ్యే మసక
నొప్పి ఉంటుంది. ఇది సిరలలోని వాల్వులు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తం అక్కడే నిల్వ కావడం కారణంగా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా ప్యూబర్టీ సమయంలో కనిపిస్తుంది మరియు వంధ్యత్వానికి దారితీయవచ్చు. 35-39
4. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం కోసం చిట్కాలు
➢ ఈ అమూల్యమైన జీవిత లక్ష్యాన్ని ఆనందంగా సాధించేందుకు, దైవత్వం నివసించే మీ శరీరం మరియు మనస్సు పట్ల శ్రద్ధ వహించండి. అవగాహనతో, సరైన జీవనశైలితో, పరిశుభ్రతతో పాటు ధూమపానం, మద్యపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండండి.
➢ ముఖ్యంగా 35 సంవత్సరాల వయస్సు తరువాత ప్రతి సంవత్సరం రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ మరియు టెస్టోస్టెరోన్ పరీక్షలు చేయించుకోండి. ముందస్తుగా గుర్తించడం ద్వారా గుండె జబ్బులు, డయాబెటిస్ మరియు హార్మోన్ల సంబంధిత సంక్లిష్టతలను నివారించవచ్చు. 50 సంవత్సరాల తరువాత (కుటుంబ చరిత్ర ఉన్నవారు 40 సంవత్సరాల వయస్సు నుంచే), వైద్యుని సలహా మేరకు పీఎస్‌ఏ రక్త పరీక్ష చేయించుకోండి.¹⁵⁻¹⁷˒³²⁻³⁴
➢ స్వీయ పరీక్ష ను ప్రతి నెలా చేయండి: పురుషులు తమ వృషణాలలో గడ్డలు, వాపు లేదా పరిమాణం/ఆకారంలో మార్పులు ఉన్నాయేమో పరిశీలించాలి. ఇది స్నానం చేసే సమయంలో చేయడం సులభంగా ఉంటుంది. వృషణాల (టెస్టిక్యులర్) క్యాన్సర్ 15-35 సంవత్సరాల వయస్సు గల పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలిగే అవకాశం చాలా ఎక్కువ. వేడి నీటి తొట్టెలను మరియు బిగుతైన లోదుస్తులను నివారించడం ద్వారా వృషణాలను చల్లగా ఉంచండి.⁴⁰˒⁴¹
➢ అవసరమైనప్పుడు త్వరగా సహాయం పొందండి: లైంగిక ఆరోగ్యం ఐచ్ఛిక విషయం కాదు. అంగస్తంభన లోపం (ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్) అనేది కేవలం “వృద్ధాప్యం” కారణంగా మాత్రమే కాకుండా, గుండె జబ్బులు లేదా డయాబెటిస్‌కు కూడా సంకేతం కావచ్చు. దీనికి చికిత్స అందుబాటులో ఉంది.²¹˒²²
➢ రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం లేదా అకస్మాత్తుగా మూత్రవిసర్జన అవసరం అనిపించడం వంటి మూత్ర సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.²⁶⁻²⁹
➢ డిప్రెషన్ లేదా ఆందోళనకు సంబంధించిన సహాయాన్ని పొందడాన్ని వాయిదా వేయవద్దు. మూడ్ స్వింగ్స్, చిరాకు లేదా ఏ పనిపట్లా ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు రెండు వారాలకంటే ఎక్కువ కాలం కొనసాగితే, ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించండి.
రిఫరెన్సెస్ మరియు లింక్స్
- Sathya Sai Speaks, Divine Discourse, vol 32, 25 Dec 1999: https://saispeaks.sathyasai.org/discourse/divine-love-true-religion
- Sathya Sai Speaks, Divine Discourse, Vol 15, Chapter 21 “ Good Health and Goodness”, 30 Sept 1981: https://saispeaks.sathyasai.org/discourse/good-health-and-goodness#
- Male reproductive system: https://www.healthdirect.gov.au/male-reproductive-system
- Male reproductive system in brief video: https://www.youtube.com/watch?v=5sYj_CcIsvw
- https://my.clevelandclinic.org/health/body/9117-male-reproductive-system
- https://kidshealth.org/en/teens/male-repro.html
- Stages in men health: https://www.henryford.com/blog/2024/11/mens-health-each-age-stage
- https://my.clevelandclinic.org/health/body/puberty
- https://my.clevelandclinic.org/health/articles/24101-testosterone
- https://www.healthforteens.co.uk/growing-up/puberty/7-puberty-changes-only-boys-experience/
- https://www.healthychildren.org/English/ages-stages/gradeschool/puberty/Pages/Delayed-Puberty.aspx#
- Hypogonadism: https://www.health.harvard.edu/healthy-aging-and-longevity/testosterone--what-it-does-and-doesnt-do#
- Male reproductive disorders of aging: https://medlineplus.gov/ency/article/004017.htm
- https://www.mayoclinic.org/healthy-lifestyle/mens-health/in-depth/male-menopause/art-20048056
- Health risks for aged men: https://www.ncoa.org/article/the-top-10-most-common-chronic-conditions-in-older-adults/
- https://www.downtoearth.org.in/health/almost-70-senior-citizens-in-india-have-a-chronic-illness-74944
- https://www.kauveryhospital.com/blog/geriatrics/understanding-common-age-related-health-issues-in-south-india/
- Male Infertility: https://www.who.int/news-room/fact-sheets/detail/infertility
- https://my.clevelandclinic.org/health/diseases/17201-male-infertility
- Fertility decline: https://utswmed.org/medblog/older-fathers-fertility/#
- Erectile dysfunction: https://my.clevelandclinic.org/health/diseases/10035-erectile-dysfunction
- https://www.mayoclinic.org/diseases-conditions/erectile-dysfunction/symptoms-causes/syc-20355776
- Hormonal imbalances: https://my.clevelandclinic.org/health/diseases/22673-hormonal-imbalance
- https://www.medanta.org/patient-education-blog/signs-youre-experiencing-a-hormone-imbalance-for-men
- https://www.sriramakrishnahospital.com/blog/diabetology-endocrinology/9-hormonal-imbalance-symptoms-in-men/
- Prostate: https://my.clevelandclinic.org/health/body/23965-prostate
- BPH: https://my.clevelandclinic.org/health/diseases/9100-benign-prostatic-hyperplasia
- Prostate cancer: https://my.clevelandclinic.org/health/diseases/8634-prostate-cancer
- Staging: https://www.urologyhealth.org/urology-a-z/p/prostate-cancer
- Prostatitis: https://my.clevelandclinic.org/health/diseases/15319-prostatitis
- https://www.mayoclinic.org/diseases-conditions/prostatitis/symptoms-causes/syc-20355766#
- PSA test: https://www.cancer.gov/types/prostate/psa-fact-sheet
- https://www.cancercenter.com/cancer-types/prostate-cancer/diagnosis-and-detection/prostate-specific-antigen-test#
- https://www.narayanahealth.org/blog/should-we-do-psa-test-routinely-in-males-above-50-years
- Balanitis: https://my.clevelandclinic.org/health/diseases/21186-balanitis
- Chlamydia: https://my.clevelandclinic.org/health/diseases/4023-chlamydia
- Genital warts: https://my.clevelandclinic.org/health/diseases/4209-genital-warts
- Hydrocele: https://my.clevelandclinic.org/health/diseases/16294-hydrocele
- Varicocele: https://www.urologyhealth.org/urology-a-z/v/varicoceles
- How to do testicular self-exam: https://my.clevelandclinic.org/health/diagnostics/testicular-self-exam
Slide show for teens for self-testing: https://kidshealth.org/en/teens/tse.html#
_____________________________________________________________________________
2. వర్క్‌షాప్‌లు & సెమినార్లు
తూర్పు మహారాష్ట్ర ప్రాక్టీషనర్ల ఆన్‌లైన్ సమావేశాలు – 22 ఫిబ్రవరి 2026 & 5 ఏప్రిల్ 2026
స్విర్ట్ యొక్క నిరంతర శిక్షణ విధానానికి అనుగుణంగా, తూర్పు మహారాష్ట్ర ప్రాంతీయ సమన్వయకర్త (10332) 22 ఫిబ్రవరి 2026న ప్రాక్టీషనర్ల కోసం ఒక ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గడ్చిరోలి, నాసిక్, యవత్మాల్, అమరావతి, అకోలా, చంద్రపూర్, భండారా మరియు సోలాపూర్ జిల్లాలకు చెందిన 15 మంది ప్రాక్టీషనర్లు పాల్గొన్నారు. విద్యా సంచాలకురాలు (10375) ప్రత్యేక వక్తగా పాల్గొని, సేవకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మార్గదర్శనం చేశారు. ఇందులో రోగులను చేరుకోవడం, ప్రాక్టీషనర్‌గా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ప్రార్థన యొక్క పాత్ర, అలాగే వైబ్రియానిక్స్ సేవగా పరిగణించబడే కార్యకలాపాలపై స్పష్టత ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి.
దీనికి కొనసాగింపుగా 5 ఏప్రిల్ 2026న మరో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో 19 మంది ప్రాక్టీషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంచాలకురాలు 108CC బాక్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా రీచార్జ్ చేయాల్సిన అవసరాన్ని, అలాగే మధ్యలో ప్రతి నెల స్వీయ రీచార్జింగ్ చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా, నెలవారీ నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించడం ద్వారా సేవా కార్యక్రమాల పర్యవేక్షణ, రోగుల రిఫరల్స్ సులభతరం కావడం, అలాగే 108CC బాక్స్ రీచార్జ్‌లకు అవసరమైన సహాయాన్ని అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే, స్విర్ట్ సభ్యత్వం యొక్క ఉద్దేశ్యం మరియు ప్రయోజనాలను వివరించి, ప్రాక్టీషనర్లు ద్వైమాసిక వార్తాలేఖను క్రమం తప్పకుండా చదవాలని, కేసు చరిత్రలను పంపించాలని, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ రెమిడీని తాము తీసుకోవడంతో పాటు ఇతరులకు కూడా పంపిణీ చేయాలని ప్రోత్సహించారు. మరాఠీ భాష మాట్లాడగల ఉపాధ్యాయులు మరియు అనువాదకుల అవసరంపై కూడా చర్చ జరిగింది. అదనంగా, నెలవారీ నివేదికలను స్వతంత్రంగా అప్‌లోడ్ చేయడం మరియు సభ్యత్వ సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడం గురించి ఆన్‌లైన్ ప్రదర్శన నిర్వహించబడింది.
ఇటువంటి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయి.

_____________________________________________________________________________
3. క్యాంప్స్ & క్లినిక్స్
3.1 శ్రీ సత్యసాయి సేవా సమితి, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, 1 మార్చి 2026:
ఈ సమితి చాలా కాలంగా కాకాని (గుంటూరు సమీపంలో) ఉన్న శంకర కంటి హాస్పిటల్ వైద్యుల సహకారంతో ప్రతి నెలా నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, అవసరమైన వారికి కంటి పరీక్షలు మరియు ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్సలను అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం నుండి ప్రేరణ పొందిన సమితి కన్వీనర్, ప్రాక్టీషనర్11542 తో సంప్రదించి, ఐ క్యాంప్‌తో పాటు ఒక వైబ్రియానిక్స్ క్యాంప్‌ను కూడా ప్రారంభించారు.
ప్రారంభ సమావేశంలో వైద్యులు ఐ క్యాంప్ నిర్వహణ విధానాన్ని వివరించగా, అనంతరం ప్రాక్టీషనర్ 11542 సాయి వైబ్రియానిక్స్ గురించి సంక్షిప్త పరిచయం అందించారు. ప్రాక్టీషనర్11683 సహకారంతో వారు మొత్తం 46 మంది రోగులకు చికిత్స అందించారు. వీరిలో కీళ్ల నొప్పులు, అసిడిటీ, ఆస్తమా, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, అలర్జీలు మరియు చర్మ వ్యాధుల వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇకపై ఈ క్యాంప్ ప్రతి నెల మొదటి ఆదివారం, ఐ క్యాంప్‌తో పాటు క్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది.

3.2 శ్రీ సత్యసాయి సేవా సమితి, రైల్వే కాలనీ, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, 19 మార్చి 2026:
సమితి కన్వీనర్ చొరవతో, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన ప్రాక్టీషనర్11542, ప్రాక్టీషనర్11592 సహకారంతో ఒక కొత్త వైబ్రియానిక్స్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో వారు మొత్తం 17 మంది రోగులకు చికిత్స అందించారు. వీరిలో పోస్ట్-క్యాన్సర్ రికవరీ, పార్కిన్సన్స్ వ్యాధి, వెర్టిగో, చెవి మరియు చర్మ సమస్యలు, ఆస్తమా, లివర్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇకపై ఈ క్యాంప్ ప్రతి నెల రెండవ ఆదివారం క్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది.

3.3 శ్రీ సత్యసాయి సమితి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, 24 ఏప్రిల్ 2026
సమితి కన్వీనర్ అభ్యర్థన మేరకు, ప్రాక్టీషనర్11632 ఒక ప్రత్యేక వైబ్రియానిక్స్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాక్టీషనర్లు11568, 11587, 11656, 11658, 11674 & 11676 సహకారం అందించారు. సులభంగా పంపిణీ చేయడానికి, మా వెల్‌నెస్ కిట్‌లోని మూడు కాంబోలు — బ్రీత్ వెల్, మూవ్ వెల్, ఈట్ వెల్, అలాగే డయాబెటిస్ టానిక్ మరియు సన్‌స్ట్రోక్ రెమిడీ (వాల్యూం 15 #2లోని అడ్డెండం ప్రకారం) — ముందుగానే పెద్ద మొత్తం లో తయారు చేయబడ్డాయి.
మొత్తం 80 మంది రోగులకు రెమిడీస్ అందించబడ్డాయి. వారిలో 50 మందికి ముందుగా తయారుచేసిన కాంబోలు ఇవ్వగా, మిగిలిన వారికి వారి ప్రత్యేక ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా వ్యక్తిగతంగా రూపొందించిన రెమిడీస్ అందించబడ్డాయి. ఈ క్యాంప్ అనేక మంది హాజరైన వారికి సాయి వైబ్రియానిక్స్ పరిచయ కార్యక్రమంగా కూడా ఉపయోగపడింది. వారిలో చాలామంది ఈ వేదికలో నిర్వహించే క్రమబద్ధమైన నెలవారీ క్యాంప్‌లకు హాజరు కావాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.


_____________________________________________________________________________
4. అనుభవ కథనం
డా. జిత్ కె అగర్వాల్ డైరీ నుండి – సేవకు ప్రతిఫలంగా దివ్యానుగ్రహం!
1997లో నేను ఆశ్రమంలో ఒక శిక్షణా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాను. పాల్గొన్న వారిలో క్రొయేషియా నుండి వచ్చిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారు నార్త్ బ్లాక్‌లో ఒకే గదిలో ఉండేవారు. వారు మొదట పుట్టపర్తికి బాబా దర్శనం కోసమే వచ్చారు. కానీ వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత వారి ఆసక్తి పెరిగింది. వారు దరఖాస్తు పత్రాలు నింపి, ఇంటర్వ్యూకు హాజరై, ఏడు రోజుల సుదీర్ఘ కోర్సులో ప్రవేశం పొందారు.
మూడవ రోజు నాటికి, తరగతులలో ఎక్కువ సమయం గడపడం మరియు మిగిలిన కొద్దిపాటి సమయాన్ని కూడా హోంవర్క్ పూర్తి చేయడానికి వినియోగించడం వల్ల వారికి కొంత బాధగా అనిపించింది. వారు నాతో మాట్లాడుతూ, బాబా దర్శనం మిస్ అవుతున్నామని, ఒక రోజు సెలవు తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. అయితే, మరో ఏడుగురు విద్యార్థులు ఉండటం మరియు కార్యక్రమం చాలా బిజీగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. అప్పుడు నేను సరదాగా, “చింతించకండి, స్వామి మీ గదికే వచ్చి దర్శనం ఇవ్వగలరు” అని అన్నాను. వారు నవ్వేశారు కానీ నిజంగా నమ్మలేదు.
ఆ సాయంత్రం తరగతి ముగించుకొని గదికి తిరిగి వచ్చినప్పుడు, వారి గది ముందు తలుపు అంతా విభూతితో చల్లబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అపారమైన ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చి, “స్వామి నిజంగానే మా గదికి వచ్చారు” అని చెప్పారు. కానీ వెంటనే వారికి ఒక చిన్న బాధ కలిగింది. ముందు తలుపు తాళం వేసి ఉండటం వల్ల స్వామి లోపలికి రాలేకపోయారని వారు భావించారు. మరుసటి రోజు, తరగతి అనంతరం గది తలుపు తెరిచినప్పుడు, లోపలి తలుపుపై విభూతి కనిపించింది. ఈసారి వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. “స్వామి మా గదిలోకి కూడా వచ్చారు!” అని పరవశించారు. మూడవ రోజు, మరింత విభూతి కనిపిస్తుందేమోనని వారు తమ గదిలోని ప్రతి మూలను ఆసక్తిగా వెతికారు. కానీ ఈసారి ఎక్కడా విభూతి కనిపించలేదు. అదే ఈ సంఘటనకు అత్యంత అందమైన ముగింపు. ఎందుకంటే స్వామి వారికి అవసరమైనదాన్ని, సరిగ్గా అవసరమైన సమయంలో అనుగ్రహించారు!
_____________________________________________________________________________
5. స్మృతిలో
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన విపి ప్రాక్టీషనర్ శ్రీ గోవింద్ డి గజ్జం 10440...ఇండియా దీర్ఘకాలిక
అనారోగ్యం అనంతరం 1 డిసెంబర్ 2024న, 70 సంవత్సరాల వయస్సులో తమ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన విషయాన్ని విచారంతో తెలియజేస్తున్నాము. అందరికీ ప్రేమగా "గజ్జం సర్"గా పరిచితులైన ఆయన, ప్రభుత్వ పాఠశాలలో అంకితభావంతో ఉపాధ్యాయుడిగా సేవలందించి, గౌరవనీయ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. భగవాన్ అనుగ్రహంతో ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఓలో సేవ చేసే అవకాశం పొందిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ బాధ్యతల్లో నిబద్ధతతో సేవలందించారు.
ఆయన 2009లో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్‌గా అర్హత సాధించి, తదుపరి 13 సంవత్సరాల పాటు సోలాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక క్యాంప్‌లను నిర్వహించారు. ఎంతో మంది ఆదరణ పొందిన ప్రాక్టీషనర్‌గా పేరుపొందిన ఆయన, తన దయ, కరుణ మరియు నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందారు. ఎల్లప్పుడూ మృదుస్మితంతో కనిపించే ఆయన, అనేక మంది తోటి ప్రాక్టీషనర్లకు తండ్రి సమానమైన వ్యక్తిగా ఉండేవారు. వైబ్రియానిక్స్‌కు సంబంధించిన మార్గదర్శకత్వం కోసం వారు తరచూ ఆయనను ఆశ్రయించేవారు. ఆయన ప్రేమపూర్వకమైన మరియు స్ఫూర్తిదాయకమైన సాన్నిధ్యాన్ని ఆయన కుటుంబ సభ్యులు మరియు సాయి కుటుంబ సభ్యులందరూ ఎంతోగా మిస్సవుతున్నారు.