డా. జిత్ అగ్గర్వాల్ డెస్కు నుండి
Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026
ప్రియమైన ప్రాక్టీషనర్లకు
శతజయంతి ఉత్సవాలు మరియు క్రిస్మస్ సందర్భంగా ప్రశాంతి నిలయంలో గడిపిన సమయం ఎంతో హృదయానందకరంగా అనిపించింది. ప్రతీ ప్రార్థనలోనూ, ఆత్మను తాకే సంగీతంలోనూ, ప్రతీ సేవా కార్యక్రమంలోనూ, ప్రతి నిశ్శబ్ద క్షణంలోనూ స్వామివారి సాన్నిధ్యాన్ని అనుభస్తూ వారి సేవ చేయగలిగే భాగ్యం కలిగినందుకు మా హృదయాలు గాఢమైన కృతజ్ఞతతోనూ వినమ్రతతోనూ నిండాయి. ఆ పవిత్ర అనుభవమే ఇప్పుడు ఈ వార్తాపత్రిక తయారీలో స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వామివారి ప్రేమ కేవలం ఉత్సవాలలోనే కాదు, సేవ చేయాలనే మన నిత్య సంకల్పంలో, రోగులను స్వస్థపరచే కర్తవ్యబోధలో, ఆయన చూపిన మార్గంలో నడవాలనే అంకితభావంలో వ్యక్తమవుతుందని అది మనకు గుర్తు చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి సంవత్సరం సాయి వైబ్రియానిక్స్‌కు అత్యంత ప్రాముఖ్యమైన ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. స్వామివారి ప్రత్యక్ష ఆశీర్వాదంతో ప్రారంభమైన ఈ వినయపూర్వక వైద్య విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్ల నిస్వార్థ సేవ మరియు ఆయన కృప వల్ల తన పరిధి, విశ్వసనీయత మరియు ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది.
ఈ శతజయంతి సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి మూడు గ్రంథాలనూ విజయవంతముగా పూర్తి చేసి, 2025 నవంబర్ 25న పవిత్రమైన సాయి కుల్వంత్ సభామండపంలో భగవాన్ బాబా వారి పదపద్మాలకు సమర్పించడం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు “అదనంగా” (In Addition) విభాగంలో ఇవ్వబడ్డాయి. ఈ కార్యాన్ని సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో అంకితభావంతో కృషి చేసిన ప్రతీఒక్క ప్రాక్టీషనర్, సమన్వయకర్త, సంపాదకుడు మరియు స్వచ్ఛంద సేవకులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా, అసాధారణ అనుభవాలు (Extraordinary Experiences) గ్రంథానికి ప్రోత్సాహకరమైన ముందుమాటను అందించిన సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి, అలాగే రోగ చరిత్రలు (ase Histories) గ్రంథానికి ముందుమాటను అందించిన అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమీష్ పాండ్యా గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ గ్రంథాలను పొందదలచిన ప్రాక్టీషనర్లు [email protected] కు వ్రాయవచ్చు.
2025 సంవత్సరంలో పూర్తిగా సాయి వైబ్రియానిక్స్ కార్యకలాపాలు వివిధ ప్రాంతాలకు మరింత విస్తరించాయి. వందలాది మంది ప్రాక్టీషనర్లు రోగుల సేవలో చురుకుగా పాల్గొనగా, వెల్‌నెస్ శిబిరాలు మరియు క్లినిక్‌ల సంఖ్యతో పాటు వాటి సేవా పరిధి కూడా గణనీయంగా పెరిగింది. ఈ అభివృద్ధిని 100 క్యాంపులు మరియు శిబిరాలు (100 Camps and Clinics) గ్రంథంలో స్పష్టంగా ప్రతిబింబించబడింది. ఆ గ్రంథ ప్రచురణ అనంతరం నిర్వహించిన శిబిరాలు మరియు క్లినిక్‌లకు సంబంధించిన తాజా రోగుల గణాంకాలు, అలాగే ఇటీవల తీసిన ఫోటోలను ప్రాక్టీషనర్లు మాకు పంపాలని కోరుతున్నాము.
సంస్థాగత స్థాయిలో, పుట్టపర్తిలోని సాయి వైబ్రియానిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SVIRT) ను మరింత బలోపేతం చేసి, సుస్థిరపరచడానికి నిరంతర కృషి కొనసాగింది. పరిపాలనా బృందం సాధకుల డేటాబేస్‌ను నవీకరించడం, సంస్థ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడం, మరియు కార్యకలాపాలలో మరింత స్పష్టతను తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ క్రమబద్ధీకరణలో భాగంగా, SRHVP యంత్రాలు మరియు 108CC బాక్సులకు సంఖ్యా విధానం (Numbering System) ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా మెరుగైన ప్రమాణీకరణ మరియు దీర్ఘకాలిక పర్యవేక్షణ సాధ్యమవుతుంది. 2025 డిసెంబర్ 2న ప్రశాంతి నిలయంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సంవత్సరపు పురోగతిని సమీక్షించడమే కాకుండా, రాబోయే నెలల్లో దశలవారీగా అమలులోకి వచ్చే పలు ప్రతిపాదనలను కూడా చర్చించడం జరిగింది. ఇవి రాబోయే సంవత్సరానికి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
ఈ సంచికతో, ప్రాక్టీషనర్ వివరాలు (Practitioner Profiles) స్థానంలో ప్రాక్టీషనర్ కార్నర్ (Practitioners Corner) అనే కొత్త విభాగాన్ని పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ విభాగం పరస్పర అభ్యాసం మరియు ప్రేరణకు వేదికగా ఉండేలా రూపొందించబడింది. ఇందులో సాయి వైబ్రియానిక్స్‌తో తమ ప్రయాణం, క్లిష్టమైన కేసులలో మార్గనిర్దేశం చేసిన గురువుల గురించి వివరణ, గురువుల పర్యవేక్షణలో నిర్వహించిన కేసులు, పోటెంటైజ్ (Potentise) చేసి విజయవంతంగా ఉపయోగించిన వినూత్న నివారణలు, అలాగే వైబ్రియానిక్స్ ద్వారా ప్రత్యేకమైన రీతిలో లేదా అనూహ్యంగా పొందిన అద్భుతమైన ఫలితాలు లేదా అనుభవాలు వంటి అంశాలను పంచుకోవచ్చు.
జనవరి 26ను “వైబ్రియానిక్స్ డే” గా నిర్ణయించడం జరిగింది. ఇది సమిష్ఠి అంకితభావం, సేవా తత్వం మరియు నిస్వార్థ వైద్యసేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజును అర్థవంతంగా నిర్వహించడానికి ప్రాక్టీషనర్లు శిబిరాలు నిర్వహించడం, రోగుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్థానికంగా అనుభవాలను పంచుకోవడం, సాయి సమితులు లేదా కమ్యూనిటీ కేంద్రాలలో అవగాహన ప్రసంగాలు ఇవ్వడం, లేదా ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా ప్రాక్టీషనర్ల శిక్షణ కోసం నిజాయితీ గల అభ్యర్థులను దరఖాస్తు చేయమని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. వైబ్రియానిక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల నివేదికలు మరియు ఫోటోలను [email protected] కు పంపవచ్చు. తద్వారా ఈ సమిష్టి సేవా కార్యక్రమాలను భవిష్యత్ సంచికలలో పంచుకునే అవకాశం కలుగుతుంది.
శ్రవణం (భగవంతుని మహిమలను వినడం), కీర్తనం (భగవన్నామ సంకీర్తనం), విష్ణుస్మరణం (భగవంతుని నిరంతరం స్మరించడం), పాదసేవనం (దివ్య పాదాలను సేవించడం), వందనం (నమస్కరించడం), అర్చనం (ఆరాధించడం), దాస్యం (భగవంతుని సేవకునిగా భావించడం), స్నేహం (దైవంతో స్నేహభావం కలిగి ఉండడం), ఆత్మనివేదనం (సంపూర్ణ శరణాగతి) అనే నవవిధ భక్తి మార్గాలన్నీ పవిత్రమైనవే, అయితే, వీటిలో సేవకే అత్యున్నత స్థానం ఉందని స్వామి మనకు గుర్తుచేస్తున్నారు. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరం కేవలం జీవించడానికే కాదు, ఇతరులకు సేవ చేయడానికే ఉద్దేశించబడింది అని స్వామి మనకు గుర్తు చేస్తూ ఉంటారు. “సేవ ద్వారా లభించే ఫలితాలే శాశ్వతమైనవి... మానవ సేవకన్నా గొప్పది మరొకటి లేదు. మానవ సేవయే మాధవ సేవ. మానవాళికి సేవ చేయడం ద్వారానే మహనీయులందరూ తమ జీవితాలను పవిత్రం చేసుకున్నారు. కాబట్టి, కనీసం ఇప్పటి నుంచైనా మానవసేవను ప్రారంభించండి. భజనలకన్నా, ఇతర ఆధ్యాత్మిక సాధనలకన్నా సేవే ముఖ్యమైనది.”— శ్రీ సత్యసాయి ప్రసంగాలు, సంపుటి 37, 1 జనవరి 2004 https://sssbpt.info/ssspeaks/volume37/sss37-01.pdf
ఈ శతజయంతి సంవత్సరం మనకు సమిష్టి సంకల్పం, క్రమశిక్షణ మరియు భక్తి కలిసినప్పుడు ఎంతటి గొప్ప ఫలితాలను సాధించవచ్చో చూపించింది. ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మరిన్ని శిబిరాలను విస్తరిస్తూ, సాధనను మరింత గాఢంగా చేసుకుంటూ, ఉదారంగా మార్గనిర్దేశం చేస్తూ సేవా అనుభవాలను నిజాయితీగా లిఖితపరచుకుందాం. అలా చేయడం ద్వారా వైబ్రియానిక్స్ స్వామివారి దివ్య వైద్య ప్రేమకు ఒక వినమ్ర సాధనంగా కొనసాగగలదు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన, ఆరోగ్యవంతమైన, సేవాస్ఫూర్తితో నిండిన 2026 సంవత్సర శుభాకాంక్షలు!
సాయికి ప్రేమపూర్వక సేవలో,
జిత్ కె. అగర్వాల్