డాక్టర్ జిత్ కె అగర్వాల్ గారి డెస్క్ నుండి
Vol 15 సంచిక 4
జులై / ఆగష్టు 2024
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
అత్యంత పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినం సమీపిస్తున్న ఈ సమయంలో, ఈ పవిత్రమైన రోజున స్వామివారు అందించిన సందేశాన్ని మనం మననం చేసుకుందాం.“మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, మిమ్మల్ని మీరు దైవానికి ఒక సాధనంగా భావించి, ఆ భావనతోనే మీ కర్తవ్యాలను నిర్వహించండి. గురుపూర్ణిమ పర్వదినమును ఆచరించడానికి ఏడాది పొడవునా వేచి ఉండవలసిన అవసరం లేదు. మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతునికి అంకితం చేయడానికి ఉద్దేశించినదిగా భావించండి. మీరు అన్ని వేళలా, అన్ని ప్రదేశాల్లో దైవత్వాన్ని అనుభవించగాలిగేందుకు ఇదే సరైన మార్గము. ఇదే నిజమైన సాక్షాత్కారం, అందరినీ సేవించండి, అందరినీ ప్రేమించండి, ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉన్నాడనే విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండండి. ఆ విశ్వాసానికి అనుగుణంగా నిరంతరం ప్రవర్తించండి. నిరంతర సాధన ద్వారానే మీరు ఈ పవిత్రమైన భావనను అలవర్చుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుకోండి. మీ జీవితాన్ని దైవానికి సంపూర్ణ సమర్పణగా మలచుకోండి. ఎందుకంటే, మీలో ఉన్నదంతటికీ, మీ వద్ద ఉన్నదంతటికీ నిజమైన మూలం ఆ దైవమే.”— శ్రీ సత్యసాయి బాబా, గురుపూర్ణిమ ప్రవచనం, 7 జూలై 1990, శ్రీ సత్యసాయి వాణి, సంపుటి 23.
కొత్తగా చేరిన మన ప్రాక్టీషనర్లలో చాలామంది వైబ్రియానిక్స్ సేవకు తమ సమయాన్ని, శక్తిని మరింతగా అంకితం చేయాలని ఆసక్తి చూపుతుండటం, అలాగే SVP శిక్షణ పొందేందుకు ఉత్సాహం కనబరుస్తుండటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అర్హత ప్రమాణాలను విస్తరించిన తరువాత, SVP కోర్సు కోసం మాకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. SVP శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన తుది అర్హత ప్రమాణాలు మరియు శిక్షణా షెడ్యూల్‌ను* 2024 జూలై 21న గురుపూర్ణిమ నాటికి ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాము. ఇంకా దరఖాస్తులు పంపని వారు, ఆగస్టు మొదటి వారంలోపు తప్పనిసరిగా తమ దరఖాస్తులను [email protected]. అనే ఈమెయిల్ చిరునామాకు పంపవచ్చు.
గురువును గౌరవించే ఈ పవిత్రమైన పండుగ సమీపిస్తున్న తరుణంలో, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న గురువును మేల్కొలిపి, ఆ స్ఫూర్తిని ఆహ్వానించడం ఎంతో సముచితమని నేను భావిస్తున్నాను. ప్రతి వర్క్‌షాప్‌తో AVPలుగా అర్హత సాధిస్తున్న ప్రాక్టీషనర్ల సంఖ్య పెరుగుతోంది. దాంతో మరింతమంది శిక్షకుల అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.,మన శిక్షణా విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఆన్‌లైన్ కోర్సులకు మరియు తరగతి గది శిక్షణకు అవసరమైన శిక్షకులను తయారు చేయడానికి, 2024 డిసెంబరులో టీచర్ల శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించాము.
“మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు, మనం మరింత మెరుగ్గా నేర్చుకుంటాము” నేర్చుకోవడం, నేర్పించడం పట్ల ఆసక్తి కలిగి ఉండి, అమూల్యమైన రోగుల సేవకు అదనంగా మరికొంత సమయాన్ని ఈ సేవా కార్యక్రమానికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్న VPలు మరియు SVPలు అందరినీ ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో* పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 15వ తేదీలోపు [email protected] అనే ఈమెయిల్ చిరునామాకు తమ దరఖాస్తులను పంపించవచ్చు. ఈ గురుపూర్ణిమ నాటికి శిక్షకుల శిక్షణకు సంబంధించిన అర్హత ప్రమాణాలను కూడా ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాము.
మన స్వామివారి శతజయంతి జన్మోత్సవ సందర్భంగా 100 వైబ్రియానిక్స్ శిబిరాలు, 100 ఆసక్తికరమైన కేసు చరిత్రలు, 100 మంది ప్రాక్టీషనర్ల విశిష్ట అనుభవాల సంకలనాలను సమర్పించాలని మనం ప్రణాళిక రూపొందించిన విషయం మీకు తెలిసిందే. ఇప్పటివరకు తమ వివరాలను పంపించని ప్రాక్టీషనర్లందరూ మనందరి సమిష్టి సమర్పణలో భాగంగా మీ అనుభవాలు, వివరాలను పంపించవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనమందరం కలిసి కృషి చేసి, ఈ సమర్పణను ప్రత్యేకంగా తీర్చిదిద్దుదాం. ఇది ప్రస్తుత ప్రాక్టీషనర్లకే కాకుండా, భవిష్యత్తులో ఈ సేవలో పాల్గొనే వారికి కూడా స్ఫూర్తినిచ్చేలా ఉండాలి.
ప్రాక్టీషనర్లందరి తాజా వివరాలను మన రికార్డుల్లో పొందుపరచాలనే ఉద్దేశంతో, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్ https://practitioners.vibrionics.org ను సందర్శించి, మీ వ్యక్తిగత సంప్రదింపు వివరాలైన ఈమెయిల్ ఐడీ, చిరునామా, ఫోన్ నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించండి. మన డేటాబేస్‌లో సుమారు 70 ఈమెయిల్ ఐడీలు పాతవిగా మారాయి లేదా తప్పుగా ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాక్టీషనర్లకు వార్తాలేఖ (న్యూస్‌లెటర్) చేరడం లేదు. న్యూస్‌లెటర్‌తో పాటు, వారికి ముఖ్యమైన తాజా సమాచారం, ప్రకటనలు కూడా అందడం లేదని గుర్తుంచుకోండి.
గురుపూర్ణిమ సందర్భంగా మన ప్రియమైన స్వామివారి సందేశాన్ని మననం చేసుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనమందరం సంకల్పిద్దాం. “శరీరంపై మమకారం వల్ల కలిగే అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడే గురువు. శరీరం అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. కర్మమార్గంలో నడవడానికి దేవుడు మీకు ఈ శరీరాన్ని ప్రసాదించాడు. ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ‘దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవస్సనాతనః’ - శరీరమే దేవాలయం; దానిలో నివసించే జీవునిలో అంతర్యామిగా ఉన్నది భగవంతుడే. ప్రతి శరీరాన్నీ భగవంతుని ఆలయంగా భావించి, వాటికి నమస్కరించండి.”- శ్రీ సత్యసాయి బాబా, గురుపూర్ణిమ ప్రవచనం, 16 జూలై 2000, శ్రీ సత్యసాయి వాణి, సంపుటి 33.
శిష్యులు తమ గురువు బోధనలను పూర్తిగా అర్థం చేసుకొని, వాటిని తమ జీవితాల్లో ఆచరించి చూపించినప్పుడు గురువుకు కలిగే గౌరవం, ఆనందం మరేదీ ఇవ్వలేవు. ఈ సంచిక నుంచి, సమయం మరియు స్థలం అనుకూలించి నప్పుడల్లా, “ఇన్ అడిషన్” (అదనంగా) అనే శీర్షిక కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిజమైన వైబ్రియానిక్స్ అనుభవగాథలను మీతో పంచుకోబోతున్నాను. ఇటీవల నేను కనుగొన్న నా అనేక సంవత్సరాల డైరీలోని నా వ్యక్తిగత అనుభవాలతో పాటు, ఇతర ప్రాక్టీషనర్లు పంచుకున్న అనుభవాలను కూడా అందులో పొందుపరుస్తాను.
మన ఆలోచనలు, మాటలు, చేతల ద్వారా ఎల్లప్పుడూ స్వామికి ప్రణమిల్లే ప్రయత్నం చేద్దాం.
* పుట్టపర్తిలో నిర్వహించనున్న వర్క్‌షాప్ తేదీల కోసం న్యూస్‌లెటర్‌లోని ప్రకటనలు విభాగాన్ని చూడండి.
సాయికి ప్రేమపూర్వక సేవలో
డాక్టర్ జిత్ కె అగర్వాల్