డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 15 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2024
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
ప్రశాంతి నిలయం ఇది అత్యంత ఉత్సాహ భరితమైన సమయాల్లో ఒకటి - సెలవు కాలము. సంవత్సరంలో ప్రస్తుత పవిత్ర కాలంలో క్రిస్మస్ జరుపుకోవడానికి మరియు నూతన సంవత్సర ఆరంభాన్ని ఆనందముగా గడపడానికి అనేక దేశాల నుండి విభిన్న మత విశ్వాసాలు, సంస్కృతులు గల ప్రజలు ప్రశాంతి నిలయం చేరతారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన భక్తులు చక్కగా ఏర్పాటు చేసి, విశేషంగా అలంకరించిన అలంకరణతో ఆశ్రమం అంతా ఎంతో శోభాయమానంగా ఉంది. తూర్పు ప్రశాంతి ఎదురుగా 35 అడుగుల ఎత్తైన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. ప్రేమ, శాంతి, కృతజ్ఞతతో ఆశ్రమము లోని గాలి అంతా నిండిపోయి ఉంది. స్వామి అంటారు“సేవా మరియు ప్రేమను మీ జీవిత ఆదర్శంగా స్వీకరించి ఈ క్షణం నుండి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీకు ఇదే నా ఆశీర్వాదము మరియు దీవెన” శ్రీ సాయి బాబా నూతన సంవత్సర ప్రసంగం 2000 జనవరి 1. మనలో ప్రతీ ఒక్కరూ పరిణామం చెందడానికి, అభివృద్ధి చెందటానికి ఇదే సరైన అవకాశం. 2024 లో ఎక్కువ జన బాహుళ్యానికి ప్రేమ మరియు స్వస్థత ప్రకంపనలను వ్యాపింప చేసేందుకు తమ పరిధిని విస్తరించాలని ప్రాక్టీషనర్లు అందరిని నేను వినమ్రతతో అభ్యర్థిస్తున్నాను.
2023 అనే దర్పణంలో చూసుకుంటే మనం కృతజ్ఞతతో ఉండటానికి మరియు దాని నుండి నేర్చుకోవడానికి చాలా ఉంది.
- సాయి వైబ్రియానిక్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SVIRT ను మనం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నాము. ఇది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ IASVP ను భర్తీ చేస్తుంది. ఇప్పటినుండి SVIRT మన పరిశోధనలు నిర్వహించడానికి మరియు శిక్షణను కొనసాగించడానికి మన మిషన్ యొక్క ప్రధాన వేదికగా మారాలని ఆకాంక్షింప బడుతోంది.
- 2023లో మరో ముఖ్యమైన మైలు రాయి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జులై 22 వ తేదీన విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి వైబ్రియానిక్స్ కాన్ఫరెన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి చెందిన ప్రాక్టీ షనర్లను ఒకచోట చేర్చింది. ప్రాక్టీషనర్లు మరియు ఉత్సాహవంతులైన వాలంటీర్లను ఏకం చేసిన ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం భారత దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాలవారు అనుసరించడానికి ప్రేరణ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతం దేశం నలు మూలల నుండి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లను ఒక చోట చేర్చే ఉద్దేశ్యంతో జాతీయ సదస్సుకు పునాది వేయడమే మన లక్ష్యం.
- వైబ్రియానిక్స్ వెల్నెస్ క్యాంపుల సంఖ్య ముఖ్యంగా పట్టణములు, మురికివాడలు, మరియు గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్నట్టు నివేదించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. 109 ప్రదేశాల్లో 1367 శిబిరాలు నిర్వహించబడి సుమారు 57,000 మంది రోగులకు వైబ్రియానిక్స్ రెమిడీలు అందించబడడం ఒక ఆద్భుతమైన పరిణామం. స్వామి అనుగ్రహించిన వైబ్రో రెమిడీల ద్వారా అత్యంత అణగారిన వ్యక్తులను చేరుకోవడానికి మరియు వారికి స్వాంతన కలిగించడానికి రాబోయే సంవత్సరాల్లో తమను తాము హృదయపూర్వకముగా అంకితం చేసుకోవాలని ప్రాక్టీషనర్లు అందరిని నేను అభ్యర్ధిస్తున్నాను.
- సాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రశంసనీయమైన చొరవకంటే మన స్వామికి నివాళులర్పించడానికి మంచి మార్గం ఏముంది. 2025 లో భగవాన్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా లక్షలాది చెట్లతో భూమాతను అలంకరించేందుకు వారు కృషి చేస్తున్నారు. భారతదేశంలోని సత్య సాయి సంస్థ మరియు సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ల మధ్య ఒక ప్రత్యేకమైన సహకారాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మరియు ఢిల్లీ ఎన్సీఆర్ నుండి విశేషమైన చొరవ చూపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్లు సాయి వైబ్రియానిక్స్ సంరక్షణలో చెట్లను నాటడం మరియు సంరక్షించడంలో ఈ ప్రయత్నాలకు సహకరిస్తూ కొనసాగుతున్న కార్యాచరణ 2024 లో మరింత వేగవంతం కావాలని ఆశిస్తున్నాను.
- సంవత్సరం అంతా కూడా IB పంపిణీ కొనసాగింది. కొత్త కోవిడ్ వేరియంట్ రావడం తో ఈ పంపిణీ మరింత ఊపు అందుకుంది.
ఎప్పటిలాగే ఒక సంస్థగా మేము కార్యకలాపాలలో కొనసాగుతున్నాము, 2024 నాటికి SVIRT ఆధ్వర్యంలో పరిశోధనపై మరింత ఎక్కువ దృష్టి పెడతాము.
చివరిగా 2024 ను స్వాగతిస్తూ స్వామివారి సందేశాన్ని మనం ప్రతిబింబించుకుందాం- “కొత్త సంవత్సరం లేదా కొత్త నెల తనతో కొత్త ఆనందాన్ని లేదా దుఃఖాన్ని తీసుకురాదు, ప్రతీ సెకనూ కొత్తదే, ఎందుకంటే ఇది కాలగమనాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి సెకండ్లు నిమిషాలుగా, రోజులుగా, మరియు నెలలుగా మారితే ఏర్పడేదే సంవత్సరం. ప్రతీ క్షణాన్ని కొత్తగా ఆదరించినప్పుడే కొత్త సంవత్సరం యొక్క కొత్తదనం వ్యక్త మవుతుంది. ప్రతీక్షణాన్ని ఎంత పవిత్రంగా గడుపుతామో అదే సంవత్సర ఫలాన్ని నిర్ణయిస్తుంది. మీరు పవిత్రమైన జీవితాన్ని గడపాలని మరియు పవిత్రమైన అనుభవాలను పొందాలనుకుంటే మీరు పవిత్రమైన చర్యలలో నిమగ్నమై ఉండాలి”...శ్రీ సత్యసాయి దివ్య వాణి, సంపుటి 31 జనవరి 1 1998.
2024 ను ఒక ఫలవంతమైన సంవత్సరంగా ఆస్వాదించడానికి మనమందరం ప్రతీ రోజు “ప్రేమతో రోజును ప్రారంభించాలని, ప్రేమతో రోజంతా గడపాలని ప్రేమతో రోజును నింపాలని చివరికి ప్రేమతోనే రోజును ముగించాలని” సంకల్పించుకుందాం.
ఈ 2024 మిమ్మల్ని సంతోషంగా ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉంచాలని కోరుకుంటూ,
సాయికి ప్రేమ పూర్వక సేవలో,
జిత్ కె అగ్గర్వాల్.