Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కే. అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021


ప్రియమైన ప్రాక్టీషనర్లారా,

సుమారు 18 నెలల అనిశ్చితి మరియు గందరగోళ పరిస్థితి అనంతరం, చివరికి ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఒక విధమైన సాధారణ స్థితి నెలకొన్నట్లు అనిపిస్తున్నది. కోవిడ్ మూడవ తరంగం గురించి అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోభావస్థితి ఆశాజనకంగానే ఉండడము, అంతేకాక భారతదేశం మరియు ఇతర దేశాలు మహమ్మారి యొక్క రెండవ తరంగం నుండి క్రమంగా కోలుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ప్రపంచమంతటా, జనబాహుళ్యం మాస్ గా టీకాలు వేయించుకుంటున్నారు; ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరియు భద్రతా మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త మరియు వైవిధ్యమైన ఉత్పరివర్తనలు కనిపించడం మరియు వైరస్ అంచనాలకు అందకుండా మరియు అనూహ్యంగా ఉండటంతో, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు శాస్త్రీయ సమాజం కోవిడ్ -19 తో వ్యవహరించడంలో చేస్తున్న మహోన్నత త్యాగాలకు మరియు వారి అవిరళ కృషికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

“ప్రపంచం అనే ఒక భారీ ఆసుపత్రిలో, మానవత్వం రోగగ్రస్తమై మంచం మీద ఉంది. కొందరు అసూయ అనే బాధతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, కొందరు అహంకారంతో విర్రవీగుతున్నారు, కొందరు ద్వేషం అనే ముసుగులో నిద్ర పోతుండగా, కొందరు స్వార్ధంతో అంధులుగా మారారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం లేదా ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ గురు పూర్ణిమ దినోత్సవం రోజున, మీ వ్యాధులను నిర్ధారించి, నివారణలు సూచించిన వైద్యులకు మరియు మిమ్మల్ని తిరిగి ఆరోగ్యవంతులను చేసిన నర్సులకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.”… గురు పూర్ణిమ సందేశం 1961 జూలై 27.  http://www.sssbpt.info/ssspeaks/volume02/sss02-14.pdf.

జూలై ఆరంభం సహజంగా ప్రశాంతి నిలయంలో దైవ సన్నిధిలో మనం గురు పూర్ణిమను జరుపుకున్న పూర్వపు ఆనందకరమైన రోజులను జ్ఞప్తికి తెస్తుంది. ఈ పండుగ మన విషయంలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది, అదేమిటంటే భగవాన్ తన భౌతిక రూపంలో ఉన్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు అందించిన కేక్‌ను కత్తిరించడం మన అదృష్టం. ఈ విలువైన క్షణాలను గుర్తుచేసుకోవడం ద్వారా మన ప్రభువు మనపై కురిపించిన ప్రేమకు మరియు సాయి వైబ్రియోనిక్సుకు  వారు అందించిన  అనంతమైన ఆశీర్వాదాలకు కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది. గురు పూర్ణిమ సమీపిస్తున్న సందర్భంలో స్వామి చెప్పిన విషయం, ‘‘ఎక్కడైతే స్వామి పని నిస్వార్థ సేవ రూపంలో జరగబడుతున్నదో, ఎక్కడైతే స్వామి నామం పఠించబడుచున్నదో, లేదా స్వచ్ఛమైన నిస్వార్ధ ప్రేమ మరియు భక్తితో గానం చెయ్యబడుతున్నదో అక్కడ స్వామి ఉంటారు” అన్నది తప్పక గుర్తుంచుకోవాలి. అలాగే మనలో అంతర్లీనంగా ఉన్న గురువును మేల్కొలపడం కోసం ప్రతీ రోజు, ప్రతీ  క్షణంలో గురు పూర్ణిమను జరుపుకునే విధంగా మన జీవితాలను గడపాలని, అలా మనల్ని మనం మలుచుకోవాలని స్వామి కోరారు.  

1974 జులై లో తమ గురు పూర్ణిమ సందేశంలో భగవాన్ బాబా “మీరు కారు నడుపుతున్నప్పుడు, కారే మీ దేవుడు. మీరు మార్కెట్లో వ్యాపారం చేస్తున్నప్పుడు, మార్కెట్ మీ దేవుడు. భారత్ (భారతదేశం) సంస్కృతి ప్రకారం, మనం చేయవలసిన పనికి మొదట నమస్కారం చేస్తాము. మనము ఏదైనా పని చేయటానికి ముందు, ఆ పనిని దేవుడిగా పరిగణించాలి.”

మన అభ్యాసకులు తమ రోగులకు ఈ స్ఫూర్తితోనే సేవ చేస్తున్నారని నివేదించడం నాకు సంతోషంగా ఉంది. ప్రారంభంలో, లాక్డౌన్ పరిమితుల కారణంగా, మన ‘స్ప్రెడ్ ది వర్డ్ క్యాంపెయిన్’ మందగమనాన్ని చూశాము. ఐతే మన ప్రాక్టీషనర్ల అంకిత భావం ఎంత గొప్పది అంటే ఈ మహమ్మారి కారణంగా వ్యక్తిగత నష్టాలు ఉన్నప్పటికీ, వారు ఇమ్యునిటీ బూస్టర్ (ఐబి) ని ఎంతో దూర ప్రాంతాలకు కూడా  పంపిణీ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. నేను వారి ప్రయత్నాలను మరియు భక్తిని వినయ పూర్వకంగా మీముందు నివేదిస్తున్నాను.  ఈ నాటి వరకూ  ఇమ్యునిటీ బూస్టర్ (ఐబి) లబ్ధిదారుల సంఖ్య 433,148 గా ఉంది.

మహమ్మారి యొక్క రెండవ తరంగం యొక్క గరిష్ట స్థాయి సందర్భంలో మే నెలలో IB రెమిడీ మొత్తం డిమాండ్లో గణనీయమైన పెరుగుదల (12%) ఉంది. ఈ రోజు వరకు మనం చూసిన అత్యధిక పెరుగుదల ఇదే. ఇదే సమయంలో, లాక్డౌన్ ప్రయాణ పరిమితుల కారణంగా ప్రాక్టీషనర్లతో కనెక్ట్ అయ్యే ఇబ్బందులు అధిగమించి ప్రజలు వారిని చేరుకోవాలనే ఉద్దేశ్యంతో మన వెబ్‌సైట్ (www.vibrionics.org) లో IB కోసం ఆన్‌లైన్ అభ్యర్థన ఫారమ్‌ను పోస్ట్ చేసామ. మన పరిశోధనా బృందం నిరంతరం పరివర్తన చెందుతున్న వైరస్ ను నిశితంగా గమనిస్తూ మరోసారి ఐబిని సవరించింది, ఈ సంచికలోని ‘అదనంగా’ విభాగంలో వివరాలను చూడండి.   

ఆన్‌లైన్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నందున, 2021 జూన్ 13 న భారతదేశంలో ప్రాంతీయ సమన్వయకర్తల నాల్గవ ద్విముఖ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలు చర్చించబడి ప్రారంభించబడ్డాయని తెలియజేయడం ఆనందంగా ఉంది. కాన్ఫరెన్స్ గురించి మరిన్ని వివరాలను ‘అదనంగా’ విభాగంలో చూడవచ్చు.  

IASVP లో సభ్యులు కావడానికి అర్హతగల ప్రాక్టీషనర్లకు సహాయపడటానికి మా ప్రయత్నాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ  సందర్భంగా కేరళ రాష్ట్రం నుండి 17 మంది VP లకు IASVP సభ్యులు కావడానికి సహాయం చేసిన ప్రాక్టీషనర్11956 కు ప్రత్యేక అభినందనలు. భారతదేశంలోని కొందరి ప్రాక్టీషనర్ల IASVP గుర్తింపు కార్డు చెల్లుబాటు గడువు ముగిసిందని తెలియజేయాలని అనుకుంటున్నాను. వారు ప్రాక్టీషనర్ల వెబ్సైట్ లో ఉన్న ప్రవర్తనా నియమావళిని చదివి ధృవీకరిస్తూ లాగిన్ అవ్వమని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. మీ IASVP సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి మీకు ఏమైనా సహాయం అవసరమైతే, దయచేసి [email protected]. లో IASVP సెక్రటరీని సంప్రదించ వలసిందిగా విజ్ఞప్తి.  

ముగింపులో, మీకుగుర్తు చేయదలిచిన విషయం ఏమిటంటే  ఈ విపత్కర పరిస్థితిలో మనం ఆధారపడగల ఏకైక అంశం దేవునిపై మనకున్న అచంచలమైన విశ్వాసం మరియు ఇతరులకు సేవ చేయడానికి అంకితభావం గల వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లుగా స్వామి  మిషన్‌లో మన వంతు పాత్ర పోషించాలనే మనకున్న భక్తి మాత్రమే. మీకు మరియు మీ ప్రియమైనవారికి ఆనందకరమైన గురు పూర్ణిమను ఆకాంక్షిస్తూ మీ హృదయంలో దైవిక కాంతిరేఖలు దేదీప్య మానంగా ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాను. ఈ పర్వదినం  సందర్భంగా, మనమందరం మన లోపల ఊన్న గురువు నుండి మార్గదర్శకత్వం తీసుకుందాం. “అత్యంత ప్రాధాన్యత గల అంశం  ఏమిటంటే, మీ అంతరాత్మను  దివ్య తేజో పుంజముగా , గురువుగా భావించడం. మీ అన్తః కరణమే గురువుగా ఈ సత్యాన్ని వెల్లడిస్తుంది. ఈ ప్రార్థనా పూర్వక ధోరణి మీ అంతర్గత ప్రేరణలను అంతర్గత తెలివితేటలను పూర్తిగా వెల్లడిస్తుంది.”… గురు పూర్ణిమ ఉపన్యాసంవైద్యులకు కృతజ్ఞతతో ఉండండి1961 జూలై 27.

సాయికి ప్రేమపూర్వక సేవలో మీ

జిత్ కె అగర్వాల్