Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 9 సంచిక 4
July/August 2018


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

పరమ పావనమైన గురుపూర్ణిమ సమీపించబోతోంది. ఈ పవిత్ర పర్వదినము గురించి స్వామి ఏమన్నారో ఒకసారి మననం చేసుకుందాము. ‘‘ఈ గురుపూర్ణిమ నుండి మీరు సేవకు అంకితం కావాలి. సేవ ద్వారా ప్రజలకు అందించవలసింది ఎంతో ఉంది. సేవ ద్వారానే జీవితానికి అర్ధం, పరమార్ధం చేకూరుతుంది. ఈనాడు దేశం ఒక నిరాశావహమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సేవ అంటే అర్ధం కూడా తెలియనివారు పరిపాలకులుగా ఉన్నారు. సేవ ద్వారానే నాయకత్వం వహించే అర్హత వస్తుంది.”- శ్రీ సత్యసాయిబాబా గురుపూర్ణిమ సందేశం 18 జూలై, 1989

కనుక ఈ రోజు నుండి మనం, మన ప్రభువు ఆజ్ఞను హృదయ పూర్వకంగా అనుసరిద్దాము. మన మాటలద్వారా చేతల ద్వారా ఆలోచనల ద్వారా బేదరహితమైన ప్రేమ వాహినిని ప్రసరింప జేద్దాం. ఈ దిశలో వైబ్రియోనిక్స్ ఒక సమగ్రమైన వైద్యవిధానముగా విశ్వవ్యాప్తమవుతూ ప్రాక్టీషనర్ లకు ఒక వరంగా రూపుదాల్చింది.  

108 మిశ్రమాల యొక్క  పనితీరు గురించి  చికిత్సా నిపుణుల నుండి మాకు  అందుతున్న స్పందన మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. గత 7 సంవత్సరాలుగా 108CC పుస్తకానికి అనేక అనుబంధాలను చేరుస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా గ్లాసరీ (పదకోశము) మరియు ఇండెక్స్( విషయ సూచిక) లను తగువిధంగా మార్పుచేయడం జరిగింది. ఇవి సులువుగా తెలుసుకోవడానికి  వీలుగా ‘’అదనంగా (ఇన్ ఎడిషన్)” అనే విభాగంలో  పుస్తకంలో మార్పులు చేర్పుల గురించి వివరణ ఇవ్వబడింది. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే మీ 108CC బాక్సు ను సాధ్యమైనంత త్వరగా రీచార్జి చేసుకోండి. ఇందుకోసం మీరు పుట్టపర్తి లోని మాస్టర్ బాక్సు నుండి కానీ లేదా మీ కోఆర్డినేటర్ ఏర్పాటు చేసిన విధానము ద్వారా కానీ రీచార్జి చేసుకోవచ్చు. ఈ రెండు సాధ్యం కానీ పక్షంలో [email protected] కు ఈమెయిల్ పంపితే మేము తగిన ఏర్పాటు చేస్తాము. సాధారణంగా కొంబో బాక్సు ను ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి రీఛార్జ్ చెయ్యాలి. ఇది కుదరని పక్షంలో తాత్కాలిక ఏర్పాటు కోసం కొంబో బాక్సు లోని ప్రతీ బాటిల్ ను పైకి తీసి ఒక చేతితో బాటిల్ ను పట్టుకొని బాటిల్ క్రింది భాగాన్ని రెండవ చేయి అరచేతిలో ఉంచి 9 సార్లు తట్టడం ద్వారా సీసాలో నిద్రాణముగా ఉన్న శక్తి తిరిగి పుంజు కుంటుంది.

విదేశీ యానము కోసమో మరి ఏదైనా ఇతర కారణాల నిమిత్తమో తాము ఉంటున్న స్థానం నుండి దూరం వెళ్ళే ప్రాక్టీషనర్ లకు మేము చేయబోయే విజ్ఞప్తి ఏమిటంటే వారు తమ ప్రయాణానికి రెండు వారాల ముందు నుంచే పేషంట్ల కు తమ వద్దకు వచ్చి రెమిడి లను రీఫిల్ చేసుకోవలసిందిగా సూచించాలి. అలాగే తమకు దగ్గరలో ఉన్న మరొక ప్రాక్టీషనర్ కు ఈ విషయం తెలుపుతూ పేషంట్లకు కూడా ఆ  ప్రాక్టీషనర్ యొక్క సమాచారాన్ని అందించాలి. దీనివలన ఆటంకం లేకుండా రోగులు తమ చికిత్సని ఆ ప్రాక్టీషనర్ ను సంప్రదించడం ద్వారా కొనసాగించగలుగుతారు. ఇది కూడా కష్టం అనుకొంటే అత్యవసర పరిస్థితిలో పోస్టు ద్వారా రెమిడిలను పంపించే ( భారత దేశములో మాత్రమే) పద్దతి, అలాగే దూరంగా ఉన్నవారికి బ్రాడ్కాస్టింగ్ విధానము ద్వారా చికిత్స చేసే విధానము కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల వివరాల కోసం గానీ ఇతర చికిత్సా నిపుణుల వివరాల కోసం గానీ మీ కోఆర్డినేటర్ ను సంప్రదించండి.

మీరు భగవంతుడికి ఇచ్చిన వాగ్దానము మేరకు మీ నిత్య సేవకు అంతరాయం కలగకుండా  ఉండడానికి వీలుగా 9 రెమిడిలు ఉండే వెల్నెస్ కిట్ ను ఎప్పుడూ మీ వెంట ఉంచుకోండి (  2 of 108 CC -2011 పుస్తకంలో 2 వ పేజీ చూడండి). అలాగే రెండు వారాలకు దాటి మీరు ఏదైనా ఊరు వెళుతున్నప్పుడు మీ సేవకు ఆటంకం కలగకుండా ఉండడానికి మీ 108CC బాక్సు ను కూడా వెంట తీసుకొని వెళ్ళండి.

మీ అందరికీ తెలుసు ఆరోగ్యకరమైన జీవనవిధానము పేషంట్లకు చికిత్స నందించే విషయంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కనుక జీవన శైలికి ఆలోచనా విధానానికి అనుగుణంగా తగిన విధంగా సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రాక్టీషనర్లు రోగులకు చికిత్స చేసేటప్పుడు వారు తమ జీవనవిధానము మార్చుకునేందుకు తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే ఉంది అని తెలుసుకునేందుకు ప్రేమతోను ప్రభావవంతంగాను బోధించవలసి ఉంటుంది.

ప్రస్తుతం మనం అప్రతిహతంగా మార్పులకు గురి అవుతున్న యుగంలో జీవిస్తున్నాము. దురదృష్టవశాత్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరంకుశ మరియు అత్యాశతో కూడిన రాజకీయ నాయకుల అరాచకము కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. వీటి పర్యవసానాల కారణంగా అందరూ మానసిక అనారోగ్యకర స్థితిలోనో, హిస్టీరియా లోనో లేదా విపరీతమైన భయంలోనో కాలం వెళ్లబుచ్చుతున్న పరిస్థితి నెలకొంది. కనుక ఇట్టి ప్రతికూల పరిస్థితులలో జీవిస్తున్న బాధితులకు సేవ చేయడానికి మనకు అపూర్వమైన అవకాశం లభించింది. వైబ్రియోనిక్స్ ద్వారా అందే దివ్యత్వం తో కూడిన వైబ్రేషన్స్ ఇట్టి బాధితుల జీవితాల్లో మహత్తరమైన మార్పు తేగలదని నా ప్రగాఢ విశ్వాసము. ఈ గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా మన గురువు, దైవమైన భగవాన్ బాబా తమ అనంత ప్రేమానురాగాలను మనపై ప్రసరింప జేస్తూ అంతర్గత శక్తిని, సేవచేసే నిబద్దతను అందిచాలని, ఈ గురుపూర్ణిమ ఆధ్యాత్మికానుభూతిని, ఆనంద దీప్తిలను అందించాలని ఆశిస్తూ...  

ప్రేమతో సాయిసేవలో

జిత్ కె.అగ్గర్వాల్