సాధకుని వివరములు 11598...India
ప్రాక్టీషనర్ 11598…India బీఎస్సీ, బెంగాలీ భాషలో బీఏ (ఆనర్స్) పట్టాలను పొందారు. వృత్తిరీత్యా చిత్రకళ ఉపాధ్యాయులు. సృజనాత్మకతకు ప్రతిరూపమైన ఆయనకు గానం, కవితలు మరియు పాటలు రచించడం, సంగీత స్వరరచన చేయడం ఎంతో ఇష్టం.
చిత్రలేఖనంపై నాలుగు పుస్తకాలను రచించారు. ప్రయాణాలు చేయడం, జంతువులను ప్రేమించడం ఆయన అభిరుచులు. సామాజిక సేవ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, నిరుపేద పిల్లలకు ఉచితంగా చిత్రకళను బోధించడంతో పాటు వీధి జంతువులకు ఆహారం అందిస్తుంటారు.
ప్రకృతిని అమితంగా ప్రేమించే ఆయన తన ఇంటి పరిసరాల్లో సుమారు 200 రకాల మొక్కలు, వృక్షాలు, వాటిలో 65 రకాల కాక్టస్ మొక్కలు పెంచుతూ ఒక సుందరమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాక, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. వాటిలో బంగాళాఖాతంలోని సుందర్‌బన్స్ దీవుల్లో 83,000కు పైగా మాంగ్రూవ్ అడవి మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో భాబా పాగ్లా ఆశ్రమం సహకారంతో పేదలకు అన్నదానం చేయడం, కోవిడ్ రోగులకు ఆక్సిజన్ మరియు అలోపతి మందులు అందించడం, అలాగే అంఫాన్ తుఫాను బాధితులకు ఆహారం, వస్త్రాలు పంపిణీ చేయడం వంటి విశేష సేవా కార్యక్రమాలు ఉన్నాయి.
చిన్ననాటి నుంచే ఆయనకు ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉంది. ప్రతిరోజూ ఉదయం తన ఇంటిలోని ఆలయంలో అమ్మవారు కాళీమాతను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆయన కుమార్తె బాలవికాస్ విద్యార్థిని కావడంతో సాయి మార్గంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. స్థానిక సాయి వైద్య శిబిరాలలో చురుకైన సేవాదళ్ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. 2012 నుండి ప్రతి సంవత్సరం డిసెంబరులో ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ, సేవాదళ్ బృంద నాయకుడిగా సేవ చేస్తున్నారు.
యుక్తవయస్సులోనే పేదలకు వైద్యసేవ చేయాలనే సంకల్పంతో వైద్యుడిగా మారాలని కలలు కనేవారు. ఆ సంకల్పంతో 2013 నుండి హోమియోపతి, అలోపతి వైద్యులకు సహాయకుడిగా సేవలందించడం ప్రారంభించారు. 2017లో బాబా ఆశ్రమంలో ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ని కలుసుకున్నారు. ఆయన ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం డా. జిత్ కె. అగర్వాల్‌ను సంప్రదించగా, ఆయన ప్రోత్సాహంతో AVP కోర్సులో చేరి 2018 గురుపూర్ణిమ సందర్భంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.
“మానవ సేవయే మాధవ సేవ” అనే స్వామివారి బోధనను జీవిత సూత్రంగా భావించి, అపార భక్తి, సమర్పణతో వైద్యసేవ అందిస్తున్నారు. ఒక రోగి కోలుకోవడాన్ని చూడటం తనకు “స్వర్గానుభూతి” తో సమానమని ఆయన చెబుతారు. మరింత మంది రోగులకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఎన్నోసార్లు స్వామివారిని ప్రార్థించగా, వెంటనే కొత్త రోగులు రావడం ఆయన గమనించారు. కొన్నిసార్లు లక్షణాల ఆధారంగా ఒక రెమెడీ ఎంచుకున్నప్పటికీ, 108CC పెట్టెలో ఆయన వేళ్లు మరో సీసా వైపు మళ్లడం జరిగింది. దానిని స్వామివారి ప్రత్యక్ష మార్గదర్శకత్వంగా ఆయన భావిస్తారు.
తనకు ఎంతో గుర్తుండిపోయిన కొన్ని స్వస్థత అనుభవాలను ఆయన పంచుకుంటున్నారు. జూన్ 2023లో, 48 సంవత్సరాల వయస్సు గల ఒక పొరుగువ్యక్తి కుడి పై దవడలో తీవ్రమైన పంటి నొప్పి, చిగుళ్ల వాపుతో బాధపడుతూ ఆయనను సంప్రదించారు. నొప్పి భరించలేనంతగా ఉంది. ఆయనకు CC11.5 Mouth Infections + CC11.6 Tooth Infections ఇచ్చారు. మరుసటి ఉదయమే ఆ రోగి ఆశ్చర్యంతో వచ్చి, కేవలం ఒక మాత్ర తీసుకున్న వెంటనే నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని, మళ్లీ తిరిగి రాలేదని చెప్పారు. చిగుళ్ల వాపు మొదటి రోజే 20% తగ్గి, ఒక వారంలో పూర్తిగా నయమైంది.
మరో సంఘటనలో, ఆగస్టు 2018లో 37 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ రుతుక్రమ సమస్యలతో ఆయనను సంప్రదించారు. గత మూడు నెలలుగా ఆమెకు అధిక యోని స్రావం ఉండేది. అదనంగా, ప్రతి నెలలో రెండు సార్లు బహిష్టు వచ్చేది. ప్రతిసారి 5–6 రోజుల పాటు అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, బలహీనతతో పాటు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఆమెకు CC8.5 Vagina & Cervix + CC8.7 Menses Frequent + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic ఇచ్చారు. కేవలం నాలుగు రోజులకే యోని స్రావం 60% తగ్గి, వారం రోజుల్లో పూర్తిగా ఆగిపోయింది. చికిత్స ప్రారంభించిన నెల రోజుల తరువాత ఆమె ఎంతో ఆనందంగా వచ్చి, ఆ నెలలో రెండోసారి బహిష్టు రాలేదని, బలహీనత కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. మరో నెల రోజుల పాటు రెమెడీ కొనసాగించారు. అప్పటి నుండి ఆ సమస్య మళ్లీ రాలేదు.
తన అనుభవంలో, అనేక మంది రోగుల రెమెడీలకు CC10.1 Emergencies జోడించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్నాయని ఆయన చెబుతారు. ఇటీవలి కాలంలో ఫిస్టులా, మొలలు (పైల్స్), చర్మంపై ఏర్పడే మచ్చలు వంటి సమస్యలకు CC2.3 Tumours & Growths ను కలిపి ఇవ్వడం ద్వారా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందుతున్నారు.
వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా మారిన తరువాత తన జ్ఞానం ఎంతో విస్తరించిందని ఆయన చెబుతారు. సాధారణ వ్యాధుల గురించి ముందే తెలిసినప్పటికీ, వైబ్రియానిక్స్ ద్వారా మరెన్నో వ్యాధుల గురించి తెలుసుకున్నారు. అంతేకాక, వైద్య పరీక్షల నివేదికలను అర్థం చేసుకోవడం, సాధారణ ప్రమాణాలను గుర్తించడం కూడా నేర్చుకున్నారు.
తన వద్దకు వచ్చే ప్రతి రోగికి కుటుంబ సభ్యుడిలా ఆప్యాయ వాతావరణం కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తారు. చిరునవ్వుతో, ప్రేమతో పలకరించడం వల్ల రోగులు సులభంగా మనసు విప్పి మాట్లాడతారని, దాంతో వ్యాధి మూల కారణాన్ని సులభంగా గుర్తించగలుగుతున్నానని ఆయన చెబుతారు.
చిత్రకళ ఉపాధ్యాయుడిగా ఉండడం వల్ల తన విద్యార్థులు, వారి కుటుంబాలకు కూడా వైబ్రియానిక్స్ ప్రయోజనాలను అందించే అవకాశం ఆయనకు లభిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో తన ప్రాంతంలోని ప్రజలకు పెద్ద మొత్తంలో ఇమ్యూనిటీ బూస్టర్ రెమెడీలు, మాస్కులు పంపిణీ చేశారు.
మొక్కల పెంపకం కార్యక్రమాల్లో కూడా ఆయన స్వయంగా విత్తనాల నుండి లేదా అంటుకట్టడం ద్వారా మొక్కలను పెంచుతూ “సాయిరాం” నామస్మరణ, సాయి గాయత్రి జపం చేస్తారు. అవసరమైనప్పుడు CC1.2 Plant Tonicను కూడా ఉపయోగిస్తారు.
వైబ్రియానిక్స్ సేవను స్వామివారు తనకు ప్రసాదించిన దివ్య అవకాశంగా, గత జన్మల పుణ్యఫలంగా ఆయన భావిస్తారు. ఈ సేవ తనను మరింత ప్రశాంతమైన, వినయపూర్వకమైన, కరుణామయమైన వ్యక్తిగా మార్చిందని ఆయన అంటారు. తోటి ప్రాక్టీషనర్లకు ఆయన హృదయపూర్వక సందేశం: “మన సేవను స్వీకరించడానికి స్వామివారే ప్రతి రోగి రూపంలో మన ఇంటి గుమ్మం వద్దకు వస్తారు. ప్రతి రోగిలో స్వామివారి ప్రతిబింబాన్ని చూడండి. ఆయన మన నుండి కోరేది ఒక్కటే—ప్రేమ.”
పంచుకోవలసిన కేసులు