Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 17 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2026


Q1. : ఒక రోగి ఏదైనా వ్యాధికి వైబ్రియానిక్స్ మాత్రలు తీసుకుంటున్నప్పుడు, స్వస్థత ప్రక్రియను బలపరచేందుకు అదే మందును బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చా?

A. లేదు. ఒక రోగి ఇప్పటికే ఒక నిర్దిష్ట వ్యాధికి వైబ్రియానిక్స్ మాత్రలు తీసుకుంటున్నట్లయితే, అదే సమస్యకు ఒకేసారి బ్రాడ్‌కాస్టింగ్ చేయకూడదు. అయితే, వేరే వ్యాధికి ప్రత్యేకంగా తయారు చేసిన మందుతో బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఇది వైబ్రేషన్ల స్పష్టతను కాపాడుతుంది మరియు వైబ్రియానిక్స్, రేడియోనిక్స్ మూలసూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మాత్రలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు లేదా రోగి వాటిని తీసుకోలేని పరిస్థితిలో మాత్రమే బ్రాడ్‌కాస్టింగ్ ఉపయోగించాలి. ఒక స్పష్టమైన, ఏకైక వైబ్రేషనల్ సంకేతం అత్యంత స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. అదనంగా, ఒకే విధమైన చికిత్సా మార్గాన్ని ఉపయోగించినప్పుడు, సాధకుడు రోగి పురోగతిని స్పష్టంగా అంచనా వేసి అవసరమైన మార్పులు చేయగలుగుతాడు.రెండు విధాలుగా ఒకేసారి చికిత్స అందించడం వల్ల వైబ్రేషనల్ సందేశం అస్పష్టంగా మారవచ్చు. ముఖ్యంగా సున్నితమైన రోగులలో ఇది అధిక ప్రభావాన్ని కలిగించవచ్చు.

_____________________________________________________________________________________________________

Q2. కొన్నిసార్లు బాబా ఫోటో నుండి అమృతం లేదా తేనె ప్రత్యక్షమవుతుంది. దానిని SRHVP ద్వారా పొటెన్సైజ్ చేసి వైద్యం కోసం లేదా ఇతరుల ఆరోగ్య ప్రయోజనాల కోసం పంచుకోవచ్చా?

 A. విభూతి, అమృతం లేదా తేనె వంటి దివ్య ఆవిర్భావములు, వాటిని స్వీకరించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక లేదా శారీరక అవసరాలకు ప్రత్యేకంగా అనుగుణంగా ఉండవచ్చు. బాబా మీ ప్రస్తుత పరిస్థితికి అనుగుణమైన ప్రత్యేక శక్తిని వాటిలో నింపి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వాటిని మీ స్వీయ సాధన మరియు స్వస్థత కోసం మాత్రమే ఉపయోగించాలి. వాటిని పొటెన్సైజ్ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం శక్తి పరంగా సరిపోకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బాబా అలాంటి దివ్య ప్రసాదాన్ని ఇతరులతో పంచుకోవాలని సంకల్పిస్తారు. అప్పుడు సాధారణంగా మీకు చాలా స్పష్టమైన అంతరంగ ప్రేరణ లేదా పునరావృత బాహ్య ధృవీకరణ లభిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆ శక్తి విశ్వవ్యాప్తమైనదిగా ఉంటుంది. దివ్య పదార్థం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు దానిని సాధారణ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం ఉదారంగా పంచుకోవచ్చు.

_____________________________________________________________________________________________________

Q3. హోమియోపతీలో 1M, 10M వంటి అధిక పొటెన్సీలను నెలకు ఒకసారి మాత్రమే ఇస్తారు. కానీ వైబ్రియానిక్స్‌లో అదే పొటెన్సీకి TDS సూచిస్తారు. ఇది చాలా ఎక్కువ మోతాదు కాదా?

A. హోమియోపతీలో 1M లేదా 10M వంటి అధిక పొటెన్సీలు రోగి ప్రాణశక్తిని బలంగా ప్రేరేపిస్తాయి. అందువల్ల తరచుగా ఇవ్వడం వల్ల అగ్రవేషన్ (లక్షణాల తాత్కాలిక తీవ్రత) సంభవించవచ్చు కనుక  వాటిని అరుదుగా ఇస్తారు. వైబ్రియానిక్స్‌లో కూడా ఇలాంటి పొటెన్సీ సంఖ్యలు ఉపయోగించినప్పటికీ, వాటి పని విధానం భిన్నంగా ఉంటుంది. వైబ్రియానిక్స్ రెమిడీ ఒక మృదువైన వైబ్రేషనల్ సంకేతం మాత్రమే. అది ప్రతిచర్యను ప్రేరేపించే ఉద్దీపన కాదు. అందువల్ల TDS వంటి తరచు మోతాదులు ఇవ్వడం ద్వారా సరిచేసే వైబ్రేషన్‌ను శరీరంలో నిలుపుకోవచ్చు. ఎందుకంటే ఈ వైబ్రేషన్లు ఎక్కువకాలం శరీరంలో నిలిచి ఉండవు. కాబట్టి వైబ్రియానిక్స్‌లో తరచుగా మందు ఇవ్వడం సురక్షితమైనది మరియు అవసరమైనది. హోమియోపతీలో మాత్రం అధిక పొటెన్సీలను అరుదుగా ఇవ్వడం అత్యవసరం.

_____________________________________________________________________________________________________

Q4. కొంతమంది ప్రాక్టీషనర్ని రోగుల బాధ లను లోతుగా అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు సంప్రదింపుల అనంతరం అదే లక్షణాలు తమలో కూడా అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

A..రోగుల పట్ల గాఢమైన సానుభూతి కలిగిన సాధకులు కొన్నిసార్లు “సింపతటిక్ రెసొనెన్స్” అనే తాత్కాలిక ప్రతిబింబ ప్రభావాన్ని అనుభవించవచ్చు. ఇది కరుణకు సంకేతమైనప్పటికీ, వారిలో శక్తి ప్రసారానికి దారితీస్తుంది. కనుక ఈ సూచనలను పాటించండి: సమావేశానికి ముందు: ముందుగా దైవ రక్షణ కోసం ఇలా ప్రార్థించండి. మీరు బంగారు కాంతితో కూడిన ఒక శంఖువులో కూర్చుని ఉన్నట్లు, దాని అడుగు భాగం నీలి కాంతి వలయంతో రక్షించబడినట్లు ఊహించుకోండి. “నేను కేవలం ఒక సాధనం మాత్రమే; స్వస్థత నాలోనుంచి కాదు, నా ద్వారా ప్రవహిస్తుంది” అని గుర్తుచేసుకోండి.

సమావేశం సమయంలో: లక్షణాలను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సమాచారంగా మాత్రమే చూడండి. రోగి పరిస్థితిని మాటల ద్వారా గుర్తించండి; అవగాహన లేకుండా దానిని మీలో ప్రతిబింబించనివ్వకండి. బాధను స్వీకరించడం కాదు, సానుభూతితో వినడం నేర్చుకోండి.

సమావేశం అనంతరం: చేతులు, ముఖం కడుక్కోండి. నీటిని శక్తి శుద్ధి సాధనంగా భావించండి. బయటకు వెళ్లి మూడు లోతైన శ్వాసలు తీసుకోండి. కొద్దిసేపు చెప్పులు లేకుండా నేలపై నడవండి. మీ పాదాల నుండి భూమిలోకి శక్తి ప్రవహిస్తూ ప్రతికూల శక్తిని విడుదల చేస్తున్నట్లు ధ్యానించండి. దైవానికి కృతజ్ఞతలు తెలియజేసి మిగిలిన శక్తిని విడిచిపెట్టండి. మీ భావోద్వేగాలను పరిశీలించండి. వాటిని మీతో తీసుకెళ్లవద్దు. అవసరమైతే: CC15.1 Mental & Emotional Tonic వంటి సరైన మందును స్వయంగా తీసుకోవచ్చు.

బాబా పలుమార్లు నొక్కి చెప్పినట్లుగా, వైద్యులు మరియు సాధకులు దివ్యశక్తికి కేవలం సాధనాలు మాత్రమే. వారు మూలశక్తి కాదు. అందువల్ల సేవ చేస్తూనే వైరాగ్యం, వినమ్రతలను పెంపొందించుకోవాలి. 

_____________________________________________________________________________________________________

Q5. సిగరెట్లకు బదులుగా వేపింగ్ (Vaping) సురక్షితమని భావించి చాలా మంది యువత దానిని ఉపయోగిస్తున్నారు. కానీ వాటి  ఆవిరిలో నికోటిన్ మరియు ఇతర హానికర రసాయనాలు ఉంటాయి. వాటి ప్రభావాన్ని తగ్గించే మందు ఏదైనా ఉందా? అలాగే వేపింగ్ వ్యసనాన్ని ఎలా తొలగించవచ్చు?

 A. వేపింగ్ వల్ల కలిగే హానికర ప్రభావాలను తగ్గించేందుకు, ఆ ఆవిరినే పొటెన్సైజ్ చేయవచ్చు. దీనికోసం ఆవిరిని దూది ఉండపై  ఘనీభవింపజేసి సీసాలో ఉంచండి, లేదా స్ట్రా ద్వారా నీరు ఉన్న సీసాలోకి ఊది తర్వాత దానిని 1M పొటెన్సీలో పొటెన్సైజ్ చేయండి. ఈ మందు వేపింగ్ వల్ల కలిగే హానికర ప్రభావాలను, అలాగే పరోక్షంగా ఆ ఆవిరిని పీల్చుకునే వారిపై పడే ప్రభావాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

వ్యసన నివారణ కోసం అదే మందును 200C పొటెన్సీలో తయారు చేయవచ్చు. ఇది కోరికలను తగ్గించి, ఆధారపడే స్వభావాన్ని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, ఈ మందు ఉత్తమ ఫలితాలను ఇవ్వాలంటే వ్యక్తిలో మానేయాలనే దృఢ సంకల్పం మరియు ఆరోగ్యకర జీవనశైలి కూడా అవసరం.