డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 16 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2025
ప్రియమైన ప్రాక్టీషనర్లారా,
ఇటీవలే మనం పవిత్రమైన వినాయక చవితి పండుగను జరుపుకున్నాము. విఘ్నాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుని ఆరాధించిన ఆనందంతో మన హృదయాలు నిండిపోయాయి. ఈ పండుగ మనకు బాహ్య ఆశీర్వాదాలను మాత్రమే కోరుకోవాలని కాకుండా, మన ఆధ్యాత్మిక పథంలో నిజమైన అడ్డంకులైన గర్వం, అహంకారం, స్వార్థాన్ని అంతర్గతంగా తొలగించుకోవడానికి కృషి చేయాలని కూడా గుర్తుచేస్తుంది.
స్వామి దీనిని సాధించడానికి అత్యంత నిశ్చితమైన మార్గాన్ని మనకు చూపించారు: “సేవ అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన. ప్రార్థన, ధ్యానం, శాస్త్రజ్ఞానం, యోగ సాధనలలో ప్రావీణ్యం—ఇవన్నీ ద్వితీయ సహాయాలు మాత్రమే. అహంకారమనే దుష్ప్రభావాన్ని తొలగించడానికి సేవ అత్యంత సమర్థవంతమైన సాధనం. కాబట్టి సేవా భావాన్ని పెంపొందించుకోండి; ఇతరులకు నిస్వార్థ సేవను అందించడంలో ఆనందాన్ని పొందండి.” (వినాయక చవితి ప్రసంగం, 10 సెప్టెంబర్ 1979, ప్రశాంతి నిలయం)
వైబ్రియానిక్స్‌లో మనకు, ప్రతి రోగిని చూడటం, ప్రతి రెమెడీని అందించడం కేవలం స్వస్తత చేయడం మాత్రమే కాదు—అది ఆయన పద్మపాదాల వద్ద సమర్పించే పవిత్రమైన సేవ!
శతాబ్ది సమర్పణ కోసం పంపబడిన అసాధారణ అనుభవాలు మరియు కేసు చరిత్రలను పరిశీలిస్తున్నప్పుడు, అద్భుతమైన చికిత్సలను సూచించి, విశేషమైన ఫలితాలను సాధించిన మన ప్ప్రాక్టీషనర్ల అసాధారణ అనుభవాలు నన్ను ఎంతో ప్రేరేపించాయి. ఈ అనుభవాలు మనకు సమాజంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సేవ చేయగల అపారమైన సామర్థ్యం ఉందని మరోసారి నిర్ధారిస్తున్నాయి. SVP గా పదోన్నతి పొందాలని ఆకాంక్షిస్తున్న VP లందరూ తమ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా [email protected] కు ఇమెయిల్ చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. తదుపరి శిక్షణా కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరగనుంది (ప్రకటనల విభాగాన్ని చూడండి). ఈ ఉన్నత స్థాయి శిక్షణా కార్యక్రమానికి మరెంతో మందిని ఆహ్వానించగలమని ఆశిస్తున్నాము. అలాగే, మన ప్ప్రాక్టీషనర్ల సంఖ్యను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో, తగిన రోగులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను వైబ్రియానిక్స్ సేవ అనే ఈ పవిత్ర మార్గాన్ని స్వీకరించేందుకు ప్రేరేపించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ఈ వార్తాపత్రిక ప్రతి సంచికలో ఒకరు లేదా ఇద్దరు ప్ప్రాక్టీషనర్ల వైబ్రియానిక్స్ సేవా ప్రయాణాన్ని పరిచయం చేస్తున్నాము. ఇటీవల కొందరు కొత్త ఆలోచనలను సూచించారు—ఉదాహరణకు, ఇటీవల శిక్షణ పొందిన AVPలు/APల సమూహాలను పరిచయం చేయడం, దేశం లేదా రాష్ట్రం వారీగా జరుగుతున్న సేవను వివరించడం, లేదా పరిపాలన/బోధనా సేవలో నిమగ్నమైన వారిని ప్రత్యేకంగా పరిచయం చేయడం వంటివి. ఈ విభాగం మన సమాజానికి మరింత స్ఫూర్తినిచ్చేలా, వైబ్రియానిక్స్ సేవ యొక్క విస్తృతిని మరింత చక్కగా ప్రతిబింబించేలా చేయడానికి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే, దయచేసి [email protected] కు రాయండి.
ముఖ్యంగా భారతదేశంలో సేవా శిబిరాల ద్వారా వేలాది మంది రోగులకు సేవ అందుతున్న విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహించి తమ సేవను విస్తరించాలనుకునే వారు, సహాయం అడగడానికి సంకోచించవలసిన అవసరం లేదు. SVIRT సిబ్బంది, అవసరమైన సామగ్రి మరియు నిర్వహణా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. సంకోచించకుండా [email protected] కు రాయండి. మనమందరం కలిసి మరింతమంది అవసరంలో ఉన్నవారిని చేరుకోవచ్చు.
పుట్టపర్తిలో కూడా సేవకు నిరంతర అవకాశాలు ఉన్నాయి. SVIRTలో, అలాగే ఆశ్రమంలోని లేడీస్ మరియు జెంట్స్ సేవాదళ్ భవనాల్లో వైబ్రియానిక్స్ క్లినిక్‌లు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయి. పుట్టపర్తిని సందర్శించే ప్ప్రాక్టీషనర్లు ఈ పవిత్రమైన క్లినిక్‌లలో తమ సమయాన్ని సేవకు అందించమని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ ప్రయాణ వివరాలు మరియు మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని [email protected] కు తెలియజేయండి. ఆయన దివ్య నివాసమైన పుట్టపర్తిలో మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశాలను స్వామి మనకు ప్రసాదించాలని మనం నిరంతరం ప్రార్థిద్దాం.
నవంబర్‌లో 12 మంది కొత్త ప్ప్రాక్టీషనర్లకు శిక్షణ ఇచ్చేందుకు AVP వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నాము. వారు అర్హత సాధించిన తరువాత, వారి ప్రారంభ సేవా ప్రయాణంలో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయడానికి రిమోట్ మెంటర్లు అవసరం ఉంటుంది. వైబ్రియానిక్స్ విస్తరిస్తున్న కొద్దీ, ఇతరులకు బోధించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన ప్ప్రాక్టీషనర్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ మహోన్నతమైన సేవ కోసం VPలు మరియు SVPలు అందరూ ముందుకు వచ్చి, [email protected] కు రాయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తగిన శిక్షణ మరియు సహాయం అందించబడుతుంది. మెంటరింగ్ అనేది మన జ్ఞానం మరియు అనుభవాన్ని తదుపరి తరానికి అందించే ఒక అమూల్యమైన అవకాశం. గతంలో మెంటర్లుగా సేవ చేసిన అనేకమంది, ఈ ప్రక్రియ ద్వారా తమకే కొత్త అవగాహనలు కలిగాయని, ఎంతో నేర్చుకున్నామని పంచుకున్నారు. నిజంగా, స్వామి దివ్య సంకల్పానికి సాధనాలుగా మనమందరం కలిసి ఎదగడానికి ఇది ఒక ఆశీర్వాదకరమైన మార్గం.
వినాయక చవితి ఆనందోత్సవాల నుండి పొందిన దివ్య స్ఫూర్తిని మనతో ముందుకు తీసుకెళ్దాం. వినాయకుడు మరియు మన ప్రియమైన స్వామి మన అంతర్గత అడ్డంకులను తొలగించి, మన సేవను ఆశీర్వదించి, ప్రేమతో కూడిన సేవా మార్గంలో ప్రతి అడుగులో మనకు మార్గదర్శకత్వం వహించుగాక!
సాయికి ప్రేమపూర్వక సేవలో,
జిత్ కె. అగర్వాల్