డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 16 సంచిక 4
జులై / ఆగష్టు 2025
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
అత్యంత పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినం సమీపిస్తున్న ఈ శుభవేళలో నా హృదయం కృతజ్ఞతా భావంతో, గురుదేవుని పట్ల భక్తి శ్రద్ధలతో నిండిపోతోంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు, వైబ్రియానిక్స్ కుటుంబం తరఫున సాయి కుల్వంత్ హాల్లో స్వామివారికి ప్రేమపూర్వకంగా కేక్ సమర్పించే భాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా, స్వయంగా దానిని కోసి తమ అనుగ్రహాన్ని కురిపించిన ఆ పవిత్ర క్షణాలు నా మనస్సులో మధుర స్మృతులుగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ దివ్యానుభూతులు వైబ్రియానిక్స్ సేవపై స్వామివారి ఆశీస్సులకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మా హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటాయి. ఈ పవిత్ర గురుపూర్ణిమ సందర్భంగా, అర్ధ శతాబ్దానికి పైగా క్రితం గురుపూర్ణిమ సందేశంలో స్వామివారు ప్రసాదించిన ఆ శాశ్వతమైన మార్గదర్శక బోధనలను మనమందరం మరోసారి స్మరించుకుందాం:
“మీ ప్రతి మాటను ప్రేమతో నింపండి. మీ ప్రతి కార్యాన్ని ప్రేమతో నింపండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, దానిని ఆరాధనగా, సమర్పణగా, మీకు ప్రేరణనిచ్చే, సాక్షిగా నిలిచే, సర్వాధిపతియైన భగవంతుని మహిమను చాటే పవిత్ర కార్యంగా చేయండి. మీరు ఏ పని చేసినా, అందులో ఏమాత్రం మిగులు ఉండకూడదు; ఏ పనినీ అసంపూర్ణంగా విడిచిపెట్టకండి. సమస్త కార్యాలను ఒకే దైవసేవగా భావించండి. మీరు చేసే ప్రతి కార్యాన్ని భగవంతుని పాదపద్మాలకు సమర్పించి, అహంకారమనే బంధం నుండి విముక్తం చేస్తే, ఆ కార్యఫలాలు మిమ్మల్ని బంధించవు. అప్పుడు మీరు స్వతంత్రులు, విముక్తులు; అదే మోక్షం.” … 29 జూలై 1969, ప్రశాంతి నిలయం, శ్రీ సత్య సాయి స్పీక్స్, సంపుటి 9
సేవ యొక్క అసలైన తత్త్వాన్ని—ప్రేమ, సమర్పణ, నిస్వార్థతలను ఆధారంగా చేసుకొని, చివరకు మోక్షానికి దారితీసే మార్గాన్ని—ఈ దివ్య వాక్యాలు ఎంత అందంగా ప్రకాశింపజేస్తున్నాయో మనం గ్రహించవచ్చు. వైబ్రియానిక్స్ సేవలో ఉన్న మనకు, తయారు చేసే ప్రతి రెమెడీ, సేవ చేసే ప్రతి రోగి, భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన పవిత్ర సేవేనని ఇవి దివ్యమైన స్మరణను కలిగిస్తున్నాయి.
గత రెండు నెలల కాలంలో, శతజయంతి కానుకగా సిద్ధం చేస్తున్న వైబ్రియానిక్స్ త్రయం (మూడు గ్రంథాలు) కోసం ఎంతో పెద్ద సంఖ్యలో రచనలు మాకు అందాయి. నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుండి, అలాగే వీలైనన్ని దేశాల నుండి ప్రాక్టీషనర్ల అనుభవాలు ఈ గ్రంథాలలో చోటు చేసుకోవాలని మా హృదయపూర్వక ఆకాంక్ష. మీ వద్ద ఇంకా కేసు చరిత్రలు, విశేష అనుభవాలు ఉన్నా, లేదా అలాంటి అనుభవాలు కలిగిన మరో ప్రాక్టీషనర్ మీకు తెలిసినా, దయచేసి వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదించండి. స్వామివారి శతజయంతి సందర్భంగా ఈ మహత్తర సంకల్పాన్ని సాకారం చేయడానికి మా మూడు సంపాదక బృందాలు అంకితభావంతో నిరంతరం శ్రమిస్తున్నాయి.
అదేవిధంగా, మా పరిశోధనా బృందాన్ని మరింత విస్తరించి, బలోపేతం చేయాలని భావిస్తున్నాము. ఈ ముఖ్యమైన సేవా విభాగంపై ఆసక్తి కలిగిన ప్రతి ప్రాక్టీషనర్ని, తాము కేటాయించగల సమయం మరియు సేవా నిబద్ధతను స్పష్టంగా పేర్కొంటూ [email protected] కు పంపమని ఆహ్వానిస్తున్నాము. గత ముప్పై సంవత్సరాలకు పైగా అచంచలమైన అంకితభావంతో ఈ బాధ్యతను నిర్వహించిన మన ప్రస్తుత పరిశోధన విభాగాధిపతి ఇప్పుడు 92 సంవత్సరాల వయస్సులో ఉండి, ఈ బాధ్యత నుండి విశ్రాంతి తీసుకోవాలనే అభిలాషను వ్యక్తం చేశారు.
అందువల్ల, ఈ బాధ్యతను చేపట్టగల అంకితభావం, సామర్థ్యం మరియు ఆధ్యాత్మిక దృక్పథం కలిగిన ఒక ప్రాక్టీషనర్ని మేము కోరుకుంటున్నాము. ఈ బాధ్యతలో పరిశోధన ప్రాజెక్టులను గుర్తించి నిర్వహించడం, కాంబోలకు సంబంధించిన సందేహాలను పరిష్కరించడం, నిర్దిష్ట రెమెడీల ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయనాలను రూపొందించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అవసరమైన శిక్షణ అందించబడుతుంది. హోమియోపతి ప్రాథమిక సూత్రాలపై అవగాహనతో పాటు, అంతర్ప్రేరణ ఆధారంగా సరైన రెమెడీని ఎంపిక చేసే సామర్థ్యం ఉంటే అది అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.
గత నెలలో మరో ఆధ్యాత్మికంగా ఉల్లాసభరితమైన సందర్భాన్ని మనమందరం అనుభవించాము. 2025 జూన్ 15న, శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయి మీడియా సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం సామూహిక జప కార్యక్రమం నిర్వహించబడింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది భక్తులు, వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సాయి గాయత్రి జపంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వైబ్రేషనల్ రెమెడీని కూడా ఉపయోగించారు. ఈ దివ్య కార్యక్రమం అంతరంగ శాంతిని పెంపొందించడమే కాకుండా, సామూహిక చైతన్యాన్ని బలోపేతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక స్పందనలను ఉన్నత స్థాయికి చేర్చింది. మరిన్ని వివరాల కోసం “అదనంగా” విభాగాన్ని చూడండి.
ఇటీవల జూన్ 29న ప్రశాంతి నిలయంలో నిర్వహించిన ప్రపంచ వైద్య సదస్సు సందర్భంగా, శ్రీ సత్య సాయి సేవా సంస్థ (SSSSO) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వైద్య సేవలలో భాగంగా వైబ్రియానిక్స్ శిబిరాలకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఎంతో గౌరవకరమైన విషయం. వైబ్రియానిక్స్ కుటుంబం తరఫున, ఈ ప్రోత్సాహకరమైన గుర్తింపును ప్రసాదించిన మా ప్రియ భగవానునికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను.
అంతిమంగా, మనందరినీ నిరంతరం నడిపిస్తూ, ప్రేమతో, మార్గదర్శకత్వంతో, అనుగ్రహంతో కాపాడుతున్న స్వామివారికి నా వినమ్ర హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.
సాయికి ప్రేమపూర్వక సేవలో,
డా. జిత్ కె. అగర్వాల్