Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 16 సంచిక 3
మే / జూన్ 2025


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఏప్రిల్ 24న ఇటీవలే మనం ఆరాధనా మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు తమ ప్రియతమ స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించేందుకు ఈ పవిత్ర సమయాన్ని ఆత్మీయంగా ఆచరిస్తున్నారు. మన జీవితమనే సాగరాన్ని దాటే ఈ ప్రయాణంలో స్వామి యొక్క అపారమైన ప్రేమ, కృప, మార్గదర్శకత్వం నిరంతరం మనకు వెలుగునిస్తున్నాయి. ఈ లోతైన ఆత్మపరిశీలన సమయంలో, దైవ కృపను పొందేందుకు స్వామి మనకు ప్రేమతో చూపించిన రాజమార్గాన్ని మనం స్మరించుకుందాం. 1985 మే 6న ఈశ్వరమ్మ దినోత్సవం సందర్భంగా స్వామి తన దివ్య ఉపన్యాసంలో ఇలా అన్నారు: “మీరు నిస్వార్థమైన అంకితభావంతో నిండి ఉండాలి. అహంకారపూరిత గర్వం లేని సేవ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. స్వీకరించడం కంటే ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందాలి. మీకు కావలసినదంతా ఇవ్వడానికి దైవం సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు ఇతరుల నుంచి ఎందుకు ఏదైనా కోరాలి లేదా స్వీకరించాలి? దైవాన్ని అనుభవించేందుకు మీ మనస్సులను, హృదయాలను పవిత్రం చేసుకోవడమే మీ ప్రతి కార్యం యొక్క లక్ష్యంగా ఉండాలి. హృదయం పవిత్రమైనప్పుడు జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. జ్ఞానంతో వెలిగిన హృదయం స్వచ్ఛమైన ప్రేమకు నిలయమవుతుంది. ప్రేమే సర్వస్వం.”- శ్రీ సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 18

గత కొన్ని నెలలుగా మన ప్రాక్టీషనర్లు పెద్ద సంఖ్యలో కేసుల చరిత్రలు, అసాధారణ అనుభవాలను పంచుకుంటుండటం మనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తోంది. ఇది వారు స్వామి సేవా బోధనలను తమ జీవితాల్లో ఆచరిస్తున్నారనడానికి నిదర్శనం. మీలో చాలామంది పాత రికార్డులు, డైరీలను పరిశీలించి, తమ స్వస్థత అనుభవాలను నమోదు చేసి మాతో పంచుకోవడం ఎంతో సంతోషదాయకం. కేసులు లేదా అనుభవాలు రాయడం కష్టంగా అనిపించే వారికి సహాయం చేయడానికి మన వద్ద ప్రాక్టీషర్-వాలంటీర్లు ఉన్నారు. వారు ఫోన్ ద్వారా మీ నుంచి పూర్తి వివరాలను తెలుసుకుని, మీ తరఫున కేస్ హిస్టరీలు లేదా అనుభవాలను రూపొందించడానికి సంతోషంగా సహాయపడతారు. మీ రచనలను కేస్ హిస్టరీలు: [email protected] ; అసాధారణ అనుభవాలు: [email protected] కు పంపండి

మన రీజినల్ కోఆర్డినేటర్లకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రాక్టీషనర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, తమ బృందాలను ప్రోత్సహిస్తూ వారు చేస్తున్న అలుపెరగని కృషి ప్రశంసనీయం. సమావేశాలకు హాజరు కావడానికి ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యం కానప్పుడు, స్థానిక ప్రాక్టీషనర్ల బృందాలు వారానికి ఒకసారి ఆత్మీయంగా సమావేశమై ఆలోచనలు, అనుభవాలను పంచుకోవాలని, తద్వారా తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ చర్చలలోని ముఖ్యాంశాలను విస్తృత ప్రయోజనం కోసం మీ రీజినల్ కోఆర్డినేటర్‌తో పంచుకోవాలి.

2023 మేలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సీనియర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి వాట్సాప్ ద్వారా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము. ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని పంచుకోవడం, రోగులకు సహాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అప్పటి నుంచి ఈ నెలవారీ సమావేశాలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి నెల మొదటి శనివారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను నిరంతరం నిర్వహిస్తూ, భవిష్యత్ సూచన కోసం వాటి వివరాలను నమోదు చేస్తున్న ప్రాక్టీషనర్ 03599కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశాల్లో ఎంతో విలువైన సమాచారం, వినూత్న ఆలోచనలు పంచుకోబడుతున్నాయి. ఇంకా ఈ గ్రూపులో చేరని SVPs, తమను చేర్చుకోవడానికి [email protected] కు రాయాలని కోరుతున్నాము.

ఇటీవల భారతదేశంలోని పుణేలో జరిగిన ఒక రోజు ప్రాక్టీషనర్ల సమావేశంలో, అనేక సంవత్సరాలుగా తమ ప్రారంభ పరిచయాల రోగులకు ప్రేమతో సేవలందించిన తరువాత కొత్త రోగులను ఎలా చేరుకోవాలనే విషయంపై కొందరు ప్రాక్టీషనర్లు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. వైబ్రియానిక్స్ సేవ చురుకుగా, నిరంతరం అభివృద్ధి చెందేందుకు రోగుల సంఖ్య నిరంతరం పెరగడం ఎంతో అవసరమని గుర్తించి, అవసరమైన మరింత మందిని చేరుకోవడానికి, రోగుల సంఖ్యను విస్తరించడానికి అనేక ఆలోచనలు చర్చించబడ్డాయి. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అదనంగా విభాగాన్ని చూడండి.

ప్రపంచవ్యాప్తంగా IB ను ప్రారంభించి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో 11,55,000 సీసాలు పంపిణీ చేయబడటం ఒక గొప్ప మైలురాయి! మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2025 జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన వైబ్రియానిక్స్ శిబిరాల్లో 13 రాష్ట్రాలకు చెందిన 129 మంది ప్రాక్టీషనర్లు, 118 ప్రదేశాల్లో 432 శిబిరాలు నిర్వహించి, 15,277 మంది రోగులకు సేవలందించారు. మన ప్రాక్టీషనర్ల అంకితభావం, భక్తి నిజంగా ప్రశంసనీయం.

చివరిగా, ప్రతి ప్రాక్టీషనర్ SVIRTకు అసోసియేట్‌గా మారడం తప్పనిసరి అని సున్నితంగా గుర్తుచేయాలనుకుంటున్నాను. ఇప్పటికే తమ అసోసియేట్‌షిప్‌ను పునరుద్ధరించుకున్న వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా పునరుద్ధరించుకోని వారు ప్రాక్టీషనర్స్ సైట్ www.practitioners.vibrionics.org లో దరఖాస్తు చేసి, మానవ సేవలో సంస్థ యొక్క లక్ష్యాన్ని కొనసాగించేందుకు తమ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాము.

చివరగా, 1993 ఈశ్వరమ్మ దినోత్సవం సందర్భంగా స్వామి చేసిన ఉపన్యాసంలోని ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను: “సేవా కార్యాన్ని దాని కోసం వెచ్చించిన ఖర్చు లేదా దానికి లభించిన ప్రచారం ఆధారంగా అంచనా వేయకూడదు; అది అడవిలోని లోతైన ప్రాంతంలో ఒకరికి ఒక కప్పు నీటిని అందించడం మాత్రమే కావచ్చు. అయితే, ఆ సేవను స్వీకరించే వ్యక్తి అవసరం, దానిని అందించే వ్యక్తి యొక్క మనోభావం—ఆ సేవ బంగారమా లేక సీసమా అనేది నిర్ణయించేది ఇవే.” ... శ్రీ సత్య సాయి బాబా (శ్రీ సత్య సాయి స్పీక్స్, వాల్యూమ్ 26)

మన సేవా కార్యాలు సీసంలా కాకుండా బంగారంలా ఉండాలని, తద్వారా స్వామి యొక్క స్వస్థతా మిషన్‌లో మనమందరం కలిసి ఆయనకు తగిన సాధనాలుగా కొనసాగగలగాలని నా హృదయపూర్వక ప్రార్థన.

సాయికి ప్రేమపూర్వక సేవలో

జిత్ కె. అగర్వాల్